ఏపీ నేత‌ల‌కు అమిత్ షా క్లాస్ తీసుకున్నారే!

ఈ నెల‌లో తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం చేసే ప‌నిలో ఉన్నారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇత‌ర పార్టీల నుంచీ వ‌ల‌స‌ల్ని కూడా ప్రోత్స‌హిస్తున్నారు. ఇక‌పై త‌ర‌చూ తెలంగాణ‌కు వ‌స్తాన‌ని అమిత్ షా చెప్పారు. అయితే, ఈ నేప‌థ్యంలో ఆంధ్రా ప‌రిస్థితి ఏంటీ అనే ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్నం అవుతుంది క‌దా! ఏపీలో కూడా భాజ‌పాని బ‌లోపేతం చేయాల‌ని చెబుతూ ఉంటారు క‌దా. అలాంట‌ప్పుడు ఆంధ్రాకి అమిత్ షా వెళ్తారా..? లేదంటే, ఆ రాష్ట్రానికి ఏదైనా ప్ర‌త్యేక‌మైన వ్యూహం ఉందా.. అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్రాలో త‌న ప‌ర్య‌ట‌న విష‌య‌మై అమిత్ షా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేయ‌డం విశేషం!

ఆంధ్రా భాజ‌పా నేత‌లు ఈ మ‌ధ్య అమిత్ షాకు వ‌రుస‌గా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. ఎవ‌రిమీద‌య్యా అంటే… ఇంకెవ‌రు సీఎం చంద్ర‌బాబు మీద‌! ఆయ‌న త‌మ‌ను గుర్తించ‌డం లేద‌నీ, ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఏపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. దీనిపై అమిత్ షా స్పందించి… చంద్ర‌బాబు స్థానంలో తాను ఉన్నా అలానే ప్ర‌వ‌ర్తిస్తాన‌ని చెప్ప‌డంతో ఏపీ భాజ‌పా నేత‌లు షాక్ తిన్నారట‌! ఆంధ్రాలో రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి భాజ‌పా ఎలా ఎద‌గాలో దానిపై దృష్టి పెట్టండీ అంటూ క్లాస్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆంధ్రాలో ఇంత‌వ‌ర‌కూ పార్టీ బూత్ క‌మిటీల ఏర్పాటే పూర్తికాలేద‌నీ, అలాంట‌ప్పుడు పార్టీ ఎలా బ‌లోపేతం అవుతుంద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

పార్టీ ఎలా బ‌ల‌ప‌డాలో దానిపైనే దృష్టిపెట్టాల‌నీ, రాజ‌కీయాల‌న్నీ త‌మ చుట్టూ తిరిగేట్టుగా చేసుకోగ‌ల‌రా అంటూ స‌వాల్ చేసిన‌ట్టు మాట్లాడ‌ర‌ని స‌మాచారం. పార్టీ పుంజుకోవ‌డం లేదంటే సరిపోతుందా… మ‌న ప్ర‌య‌త్నం ఉండాలి క‌దా అంటూ కాస్త ఘాటుగానే ఆయ‌న అన్నారు. క‌నీసం 75 శాతం బూత్ క‌మిటీలు ఏర్పాటు పూర్త‌య్యాక‌నే ఆంధ్రాకి వ‌స్తాన‌నీ, అప్పుడే ఏపీలో త‌న ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని నేత‌ల‌తో అమిత్ షా తెగేసి చెప్పారు.

అమిత్ షా వ్యాఖ్య‌ల్లో కొంత నిజం లేక‌పోలేదు. ఏపీ భాజ‌పా నేత‌లు ఎంత‌సేపూ చంద్ర‌బాబుపై ఫిర్యాదుల‌తో కాలం వెళ్ల‌బుచ్చుతున్నారు. సొంతంగా ఏదీ చేయ‌డం లేద‌న‌డంలో నిజ‌ముంది! అయితే, సొంతంగా వ్య‌వ‌హ‌రించేంత స్వేచ్ఛ ఏపీ భాజ‌పా నేత‌ల‌కు ఉంటోందా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఇంకోటీ.. అమిత్ షా స్పంద‌న చంద్ర‌బాబును వెన‌కేసుకొస్తున్న‌ట్టుగానూ ఉంది క‌దా. ఆయ‌న వ్యాఖ్య‌ల్ని ఏపీ భాజ‌పా నేత‌లు ఇలా అర్థం చేసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. మ‌రి, ఆయ‌న తీసుకున్న క్లాస్ ప్ర‌భావం ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా, తెలంగాణ వ‌ర‌కూ వ‌చ్చిన అమిత్ షా ఆంధ్రాలో ఇప్పుడు ప‌ర్య‌టించ‌రు అనేది మాత్రం సుస్పష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com