తెలంగాణ ఎన్నిక‌ల‌పై అమిత్ షా ప్ర‌త్యేక దృష్టి..!

తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీట్ పెరుగుతూనే ఉంది. ఆరో తేదీన అసెంబ్లీ ర‌ద్దు చేసి, ఆ మ‌ర్నాడు హుస్నాబాద్ స‌భలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల శంఖారావం పూరిస్తార‌నే అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇత‌ర పార్టీలు కూడా ఎన్నిక‌ల మూడ్ లోకి వ‌చ్చేశాయి. భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కూడా తెలంగాణ ఎన్నిక‌ల‌కు సంబంధించి వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. తెలంగాణ‌కు చెందిన భాజ‌పా నేత‌ల‌తో వ‌రుస‌గా రెండుసార్లు స‌మావేశ‌మ‌య్యారు అమిత్ షా. క‌ర్నూలులో జ‌రిగిన‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. చింత‌న్ భైట‌క్ స‌భ‌ల‌కు ఆయ‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో భాజపా నేత‌లు క‌లిశారు. తిరుగు ప్ర‌యాణంలో కూడా మ‌ళ్లీ శంషాబాద్ లోనే భాజ‌పా నేత‌ల‌తో అమిత్ షా భేటీ అయ్యారు.

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల గురించే సుదీర్ఘంగా పార్టీ నేత‌ల‌తో అమిత్ షా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో తెరాస‌, కాంగ్రెస్ ల‌కు ధీటుగా భాజ‌పా గ‌ట్టి పోటీని ఇవ్వాల‌న్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మ‌రింత బ‌లోపేతం కాకుండా చూడాల‌ని సూచించార‌ట‌! నాలుగు రాష్ట్రాల అసెంబ్లీతోపాటు తెలంగాణ‌కు కూడా ఎన్నిక‌లు జ‌రిగితే… తాను ఈ రాష్ట్రంపై ప్ర‌త్యేక దృష్టి పెడ‌తాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ భాజ‌పా శాఖ‌కు సంబంధించిన బాధ్య‌త‌ల్ని క‌ర్ణాట‌క‌కు చెందిన సంతోష్ కి అప్ప‌గిస్తార‌న్నారు. అంతేకాదు, క‌ర్ణాట‌క‌తోపాటు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల భాజ‌పా నేత‌లంతా తెలంగాణ వ‌చ్చిన ఎన్నిక‌ల వ్యూహాలు చూసుకుంటార‌ని చెప్పార‌ట‌.

ఈనెల 12 లేదా 15న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ లో భారీ బ‌హిరంగ స‌భ‌కు భాజ‌పా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఈ స‌భ‌కు అమిత్ షా వ‌స్తారు. అదే రోజున రాష్ట్రంలో భాజ‌పా ఎన్నిక‌ల శంఖారావం పూరిస్తుంద‌ని స‌మాచారం. ఈ స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల ప‌నిలో ఇప్ప‌టికే పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఉన్నారు. ఇది అయిపోయాక‌.. క‌రీంన‌గ‌ర్ లో కూడా మ‌రో భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని భాజ‌పా నేత‌లు అంటున్నారు. మొత్తానికి, ఎన్నిక‌ల‌కు సంబంధించి శంఖారావ స‌భ‌ల విష‌యంలో తెరాస‌లో క‌నిపిస్తున్నంత స్ప‌ష్ట‌మైన ప్లానింగ్‌… ఇప్పుడు భాజ‌పాలో కూడా క‌నిపిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం! అమిత్ షా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న ప‌రిస్థితి ఉందంటే… తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ప‌క్కా అని వారికి స్ప‌ష్ట‌మైన స‌మాచార‌మే ఉన్న‌ట్టుగా ఉంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com