క‌ర్ణాట‌క‌లో మ‌ఠాల చుట్టూ అమిత్ షా ప్ర‌ద‌క్షిణ‌లు..!

ఒక‌ప్పుడు రాజ‌కీయ నాయ‌కులు గుళ్లూ గోపురాల‌కూ వ‌స్తే… పూజ‌లూ పున‌స్కారాలు మాత్ర‌మే చేసేవారు. ఆధ్యాత్మిక కేంద్రాల‌కు వెళ్తే ప్రార్థ‌న‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యేవారు. కానీ, ఇప్పుడు… రాజ‌కీయాలు చేయ‌డం కోసం ఈ బాట ప‌డుతున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో చేస్తున‌్న ప‌ని ఇదే..! ఆ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఏదో ఒక‌లా కర్ణాటకలో అధికారం ద‌క్కించుకుంటే.. ద‌క్షిణాదిలో కూడా త‌మ‌కు ప‌ట్టు దొరికింద‌ని ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. పైగా, ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నిక‌ల్లో వ‌రుస వైఫ‌ల్యాల ఇమేజ్ ను మార్చుకోవ‌చ్చ‌నీ భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క టూర్ లో ఉన్నారు భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షా. అక్క‌డి మ‌ఠాలు చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. సిద్ధ‌గంగ‌తోపాటు ప‌లు ప్ర‌ముఖ మ‌ఠాల‌ను ఆయన ఇప్పటికే చుట్టేశారు. ఇప్పుడు మైసూర్ లోని సుత్తూరు మ‌ఠానికి చేరుకున్నారు. ఆ త‌రువాత‌, మీడియాతో మాట్లాడుతూ.. హంత‌కుల‌ను క‌ర్ణాట‌క స‌ర్కారు విచ్చ‌ల‌విడిగా స‌మాజంలో తిర‌గ‌నిస్తోంద‌నీ, మ‌రోసారి హత్యలు చేసే అవ‌కాశం వారికి ఇస్తోంద‌ని మండిప‌డ్డారు. సిద్ధ‌రామ‌య్య స‌ర్కారు స‌మ‌యం స‌మాప్త‌మైంద‌నీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే, పాతాళంలో దాక్కున్నా కూడా హంత‌కుల్ని లాక్కొచ్చి మ‌రీ శిక్ష‌లు వేయిస్తుంద‌న్నారు. హ‌త్య‌కు గురైన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు అండ‌గా నిలుస్తామ‌ని చెప్పారు.

అమిత్ షా త‌న మాట‌ల్లో ప్రాధాన్య‌త ఇచ్చిన అంశం కార్య‌క‌ర్త‌ల హ‌త్య‌..! హంత‌కుల‌కు శిక్ష‌లు ప‌డాలి, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, దాని కోస‌మని య‌డ్యూర‌ప్ప అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలా..? ఈలోగా చట్టప్రకారం చర్యల కోసం ప్రయత్నించొచ్చు కదా..? ఒక ఎమోష‌న‌ల్ అంశాన్ని ప‌ట్టుకుని, ఇలా ప్ర‌జ‌ల‌పై రుద్దే ప్ర‌య‌త్నం అమిత్ షా మొద‌లుపెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇంత‌కీ.. క‌ర్ణాట‌క‌లో భాజ‌పా టెన్ష‌న్ ఏంటంటే… అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయ‌త్ ల‌ను ప్ర‌త్యేక మతంగా గుర్తిస్తూ సిద్ధ‌రామ‌య్య స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం. లింగాయ‌త్ ల‌లో చాలామంది భాజపాకి అభిమానులుగా ఉండేవారు. కానీ, ఇప్పుడు వారంతా చేజారే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఈ నేప‌థ్యంలో వారికి ఆక‌ర్షించ‌డం కోసం అమిత్ షా మ‌ఠాల‌ను సంద‌ర్శిస్తున్నారు. భాజపాకి మద్దతు పలకాలంటూ లింగాయత్ లను కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.