అమరావతికి అనుకూలమే కానీ అవినీతికి వ్యతిరేకం అని వైసీపీ వింత వాదన చేస్తోంది. అవినీతి నిజం అయితే వెంటనే ప్రజల ముందు పెట్టాలి. న్యాయపోరాటం చేయాలి. కానీ అవేమీ లేకుండా ఉత్తుత్తి ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వ వ్యయాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యబద్ధమే, కానీ ఆ ఆరోపణలకు కనీస ప్రాథమిక ఆధారాలు ఉండాలి. అమరావతిలో చదరపు అడుగుకు రూ. 14,000 ఖర్చు చేస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని వైసీపీ నేతలు గొంతు చించుకుంటున్నారు. కానీ ఆధారాలు మాత్రం చూపించడం లేదు.
జగన్ చెబుతున్నదంతా అబద్దమే!
ప్రపంచస్థాయి ఐకానిక్ భవనాలు, సెక్రటేరియట్, హైకోర్టు వంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన నిర్మాణాలకు అయ్యే ఖర్చును అవినీతిగా చిత్రీకరించడం కేవలం రాజకీయ దురుద్దేశమే. నిజంగా అవినీతిపై జగన్ రెడ్డికి అంతటి చిత్తశుద్ధి ఉంటే, విశాఖలోని రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేవలం తన విలాసం కోసం పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి, ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు చేసి రహస్యంగా నిర్మించిన ఆ ప్యాలెస్‌కు SFTకి ఏకంగా రూ. 40,000 పైగా ఖర్చు చేశారన్న గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో ప్రజావసరాల కోసం కట్టే భవనాలకు రూ. 7,000 ఉంటే దాన్ని రెండింతలు చేసి ప్రచారం చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ పేరుతో మరో ఫేక్ ప్రచారం
రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దోపిడీ,ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఐదేళ్లుగా ఊదరగొడుతూనే ఉంది. కానీ, ఆ ఐదేళ్ల కాలంలో అధికారం వారి చేతుల్లోనే ఉన్నా, ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణను కూడా న్యాయపరంగా నిరూపించలేకపోయారు. సిట్ వేశారు, కేబినెట్ సబ్ కమిటీలు వేశారు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.. కానీ ఎక్కడా అంగుళం అవినీతిని కూడా బయట పెట్టలేకపోయారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వల్ల కేవలం అమరావతి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడమే కాకుండా, రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల పెట్టుబడులను అడ్డుకున్నట్లయింది. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా వైసీపీ వాదనను ఎవరూ పరిగణనలోకి తీసుకోకపోవడానికి కారణం ఈ నిరాధార అబద్ధాల ప్రచారమే.
నిధులు రాకుండా కుట్రలెందుకు?
కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రూ.15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం వైసీపీకి మింగుడు పడటం లేదు. వరల్డ్ బ్యాంక్ , ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నిధులు ఇస్తున్నాయంటే, అక్కడ పారదర్శకత ఉందనే కదా అర్థం? అంతర్జాతీయ బ్యాంకులు ప్రాజెక్టు రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రుణాలు మంజూరు చేస్తాయి. ఒకవేళ వైసీపీ చెబుతున్నట్లు అవినీతి ఉంటే, ఈ సంస్థలు నిధులు ఎలా ఇస్తాయి? ఈ ప్రాథమిక లాజిక్‌ను విస్మరించి బురద జల్లడం వల్ల వైసీపీ తన సొంత విశ్వసనీయతనే పోగొట్టుకుంటోంది.
వైసీపీకి స్వయం వినాశక వ్యూహం
ఐదేళ్ల పాలనలో రాజధానిని ఒక స్మశానంగా మార్చి, అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ.. ఇప్పుడు మళ్లీ అదే పాత పాట పాడటం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం , భవిష్యత్తు తరాల ఆర్థిక మూలధనం. దానిపై అడ్డగోలు లెక్కలు చెబుతూ ప్రజలను భ్రమల్లో ముంచాలని చూడటం వికటిస్తోంది. అమరావతిపై చేసే ప్రతి కుట్రపూరిత ప్రచారం వైసీపీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రజలు ఇప్పుడు ప్యాలెస్ రాజకీయాలకు, ప్రజా రాజధానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా గుర్తిస్తున్నారు.


