ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ప్రకటించిన ఏడు విజ్ఞప్తులు ప్రస్తుతం కేవలం రాజకీయ ప్రసంగం మాత్రమే కాదు, దేశం ఎదుర్కోబోతున్న ఆర్థిక గండం నుంచి గట్టెక్కడానికి ఒక అప్రమత్తత . పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల మరియు సరఫరా గొలుసులో ఆటంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే ప్రధాని చేసిన సూచనలను రాజకీయ కోణంలో చూడటం కంటే జాతీయ కర్తవ్యం గా భావించడం నేటి అవసరం.
రాజకీయాలకు అతీతమైన పిలుపు
ప్రధాని మోదీ చేసిన ఈ విజ్ఞప్తులు ఏ ఒక్క పార్టీ కోసమో, వర్గం కోసమో చేసినవి కావు. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం ద్వారా రూపాయి విలువ పతనం కాకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, బంగారం కొనుగోళ్లపై నియంత్రణ వంటివి నేరుగా మన దిగుమతుల భారాన్ని తగ్గిస్తాయి. దీన్ని రాజకీయంగా విమర్శించడం సులభమే కానీ, ఆచరణలో పెట్టకపోతే దేశం ఎదుర్కోవాల్సిన నష్టాలు తీవ్రంగా ఉంటాయి.
పాకిస్థాన్, శ్రీలంకల పరిస్థితి ఒక పాఠం
మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకలు నేడు ఎదుర్కొంటున్న దుస్థితిని ఒకసారి గమనిస్తే.. అది కేవలం పాలకుల వైఫల్యం మాత్రమే కాదు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోవడం వల్ల వచ్చిన సంక్షోభం. కనీస అవసరాలైన ఆహారం, మందులు, ఇంధనం కోసం ఆ దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. భారతదేశం ఆ స్థాయికి వెళ్లకుండా ఉండాలంటే, ముందుస్తు జాగ్రత్తగా ప్రధాని చేసిన ఈ ఏడు విజ్ఞప్తులు శిరోధార్యం కావాలి. పొదుపు మంత్రం అనేది నేటి అవసరం, రేపటి రక్షణ.
ప్రజలే భాగస్వాములు కావాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఇదొక నేషనల్ మిషన్ . ప్రభుత్వం మాత్రమే యుద్ధం చేయలేదు, ప్రతి పౌరుడు తన వంతుగా సహకరించాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిన్న చిన్న మార్పులే దేశానికి పెద్ద ఊరటనిస్తాయి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత సౌకర్యాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరడంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
యుద్ధం ఎక్కడో జరుగుతున్నా, దాని సెగ మన వంటింటి వరకు వస్తుంది. ఆర్థిక సుస్థిరత దెబ్బతింటే అది అందరిపై ప్రభావం చూపుతుంది. అందుకే మోదీ సూచనలను అపహాస్యం చేయడం మానేసి, వాటిని మన జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలి. రాజకీయ విమర్శలు ఎన్నికల వరకే పరిమితం కావాలి, కానీ దేశ ఆర్థిక భద్రత విషయంలో అందరూ ఒక్కతాటిపై నిలబడాలి. అప్పుడే మనం రాబోయే గడ్డు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలం. మనం చేసే ప్రతి పొదుపు చర్య దేశం వైపు వేసే ఒక బలమైన అడుగు అవుతుంది. అలా రాకుండా.. రాజకీయంగా చూస్తే.. నష్టం దేశానికే.. అంటే మనకే.
