అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేనంతటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సీఎన్ఎన్ చీఫ్ డేటా అనలిస్ట్ హ్యారీ ఎంటెన్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ట్రంప్ నెట్ అప్రూవల్ రేటింగ్ ఏకంగా మైనస్ 17 పాయింట్లకు పడిపోయింది. ఆధునిక అమెరికా చరిత్రలో తన పదవీ కాలంలో ఈ స్థాయిలో ప్రజాధరణ కోల్పోయిన ఏకైక అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయనకు అండగా నిలిచిన స్వతంత్ర ఓటర్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయనకు దూరమయ్యారు.
ఇరాన్ యుద్ధం – ముంచేసిన నిర్ణయం
ట్రంప్ పాపులారిటీ ఇంతలా పడిపోవడానికి ప్రధాన కారణం ఇరాన్‌పై ఆయన ప్రకటించిన యుద్ధమే. ఇజ్రాయెల్‌తో కలిసి ఫిబ్రవరిలో ఇరాన్‌పై జరిపిన మెరుపు దాడులు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. కేవలం నాలుగు వారాల్లోనే గ్యాస్ , నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం ఒక అనవసరమైన ఎంపిక అని సగానికి పైగా అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
75 శాతం మంది ఇంపీచ్మెంట్ కు మొగ్గు
సీఎన్ఎన్ డేటా నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ట్రంప్ దూకుడు చర్యలు, రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఆయనను పదవి నుంచి తొలగించే ఇంపీచ్మెంట్ ప్రక్రియకు దాదాపు 75 శాతం మంది ప్రజలు ఏదో ఒక రూపంలో మద్దతు తెలుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రిపబ్లికన్ పార్టీలోని ఒక వర్గం కూడా ట్రంప్ విదేశీ విధానాలపై అసంతృప్తిగా ఉండటం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ మద్దతుదారులు మినహా, మిగిలిన వర్గాలన్నీ ట్రంప్ తీరును తప్పుపడుతున్నాయి.
ప్రమాదంలో రిపబ్లికన్ల భవిష్యత్తు
ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ పడిపోవడం 2026 మధ్యంతర ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం, యుద్ధ భయం , సరిహద్దు సమస్యలపై ట్రంప్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఓటర్లు విముఖత చూపుతున్నారు. ఒకవైపు డెమొక్రాట్లు ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని నిరసనలు ఉధృతం చేస్తుండగా, మరోవైపు సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఈ గందరగోళ పరిస్థితుల నుంచి ట్రంప్ తన ఇమేజ్ను ఎలా కాపాడుకుంటారో అన్నది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది.


