ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములు , ఉమ్మడి ఆస్తుల విభజన ప్రక్రియలో చారిత్రాత్మక మార్పులు తీసుకువచ్చింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం, ఆస్తి విభజన జరిగినప్పుడు వారసుల మధ్య వాటాలు సమానంగా లేకపోతే, ఎవరికైతే ఎక్కువ వాటా దక్కిందో వారు ఆ అదనపు విలువపై మార్కెట్ రేటు ప్రకారం 3 శాతం వరకు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెద్ద ఆర్థిక భారంగా మారడమే కాకుండా, ఆస్తుల పంపకాల్లో వివాదాలకు, ఆలస్యానికి దారితీసేది.
తాజా జీవో ప్రకారం ఈ నిబంధనను సవరించి, వాటాలతో సంబంధం లేకుండా నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కొత్త నిబంధనల ప్రకారం, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డుల్లో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి విలువ రూ. 10 లక్షల లోపు ఉంటే కేవలం రూ. 100 మాత్రమే స్టాంపు డ్యూటీగా చెల్లించాలి. ఒకవేళ ఆస్తి విలువ రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, కేవలం రూ. 1,000 ఫిక్స్డ్ స్టాంపు డ్యూటీగా వసూలు చేస్తారు. వారసుల మధ్య ఆస్తి సమానంగా పంపకాలు లేకపోయినా , ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ వాటా వచ్చినా సరే.. ఈ నిర్ణీత నామమాత్రపు రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అంగీకారంతో ఆస్తులను త్వరగా పంచుకోవడానికి దోహదపడుతుంది.
ఈ నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పరోక్షంగా మేలు జరుగుతుంది. చాలా కాలంగా వారసత్వ వివాదాలు లేదా భారీ రిజిస్ట్రేషన్ ఖర్చుల భయం వల్ల నిలిచిపోయిన ఆస్తులు ఇప్పుడు చట్టబద్ధంగా వారసుల పేరు మీదకు మారతాయి. తద్వారా ఆయా భూములు లేదా స్థలాలకు స్పష్టమైన టైటిల్ లభిస్తుంది, ఇది తదుపరి క్రయవిక్రయాలకు లేదా బ్యాంకు రుణాలు పొందడానికి ఎంతో కీలకం. ఆస్తుల రికార్డులు క్లియర్ కావడంతో మార్కెట్లో లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కుటుంబాలకు ఈ జీవో ఒక వరం లాంటిది. తల్లిదండ్రులు విల్లు రాయకుండా మరణించిన సందర్భాల్లో, వారసులు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ , ఇతర పత్రాలతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తమ వాటాలను సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌లో కూడా ఇందుకు అనుగుణంగా మార్పులు చేయడంతో, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతమైంది. వ్యవస్థలో పారదర్శకత పెరగడమే కాకుండా, అవినీతికి తావులేకుండా సాధారణ పౌరులు తమ ఆక్కులను భద్రపరుచుకునే అవకాశం లభించింది.


