ఎడిటర్స్ కామెంట్ : సమ్మిట్ చిత్తశుద్ధి లేని శివపూజ కాకూడదు !

ఏదైనా కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుందంటారు పెద్దలు. ఇది వంద శాతం నిజం. అది ప్రతి మనిషికీ అనుభవం అయి ఉంటుంది. అది డబ్బులా.. వస్తువులా.. లేకపోతే మనుషులా అన్న విషయం పక్కన పెడితే… ఏదైనా సరే ఎంతో ఉపయోగమున్నవాటిని కోల్పోతేనే వాటి విలువ తెలుస్తుంది. ఈ విషయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కూడా అవగతమవుతోందని ప్రస్తుతం మనం అంచనాకు రావొచ్చు. మన అనుకునేది పొరపాటా.. లేకపోతే నిజంగానే ప్రభుత్వం అలా ఫీలవుతోందని అనుకుంటుందా అనేది ముందు ముందు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఇంతకీ ఏపీ ప్రభుత్వానికి ఏ విషయంలో తాను కోల్పోయామని అనుకుంటుందంటే… పెట్టుబడులు. పెట్టుబడులు అంటే.. ఇలా పిలవగానే అలా వచ్చేస్తాయని ఇంత కాలం అనుకున్నారేమో కానీ.. గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఎగతాళి చేశారు.. దావోస్ వెళ్తే విహారయాత్రకన్నారు.. మూడు సార్లు పెట్టుబడుల సదస్సు పెడితే..రోడ్డు మీద పోయే వాళ్లను తీసుకొచ్చి ఎంవోయూలు చేసుకున్నారని విమర్శించేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దావోస్ ఎందుకు వెళ్లాలో తెలుసుకుంది. ఓ సారి వెళ్లి.., లెంగ్తీ క్వశ్చన్స్ దెబ్బకు రెండో సారి అలాంటి ఆలోచన చేయకపోయినా.. మొదటి సారి పెట్టుబడుల సదస్సు మాత్రం నిర్వహిస్తున్నారు. అంటే..పెట్టుబడుల సదస్సుల వల్ల పెట్టుబడులు వస్తాయని గట్టిగా నమ్ముతున్నట్లే. మనసు మార్చుకున్నట్లే. మరి ఈ పెట్టుబడుల సదస్సులైనా సిన్సియర్‌గా నిర్వహిస్తారా.. చిత్తశుద్ధిలేని శివపూజలా చేసి.. పాత ఒప్పందాలకు కొత్త ఎంవోయూలు చేసుకుని షో చేస్తారా అన్నది ఇప్పుడు కీలకం.

నాలుగేళ్ల పాటు పారిశ్రామిక ప్రపంచాన్ని భయపెట్టి ఇప్పుడు రమ్మంటున్న ఏపీ ప్రభుత్వం !

ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు కీలకం. పెట్టుబడులు వస్తేనే ఏ రాష్ట్రమైనా పారిశ్రామికంగా ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పారిశ్రామికంగా వెనుకబడింది. వ్యవసాయ ప్రాధాన్యత రాష్ట్రంగా మిగిలింది. ఒక్క పెద్ద నగరం లేదు. రాష్ట్రానికి ఆదాయం రావాలన్నా.. పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా.. చేయాల్సింది రాజధాని నిర్మించడం.. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించడం. రాజధాని నిర్మాణానికి వచ్చే పెట్టుబడులు.. పరిశ్రమల వల్ల పెట్టుబడులు రెండూ కలగలిపి .. దక్షిణాదిలో ఏపీని మరో సూపర్ రిచ్ రాష్ట్రంగా నిలబెట్టి ఉండేది. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా… పాలకులు ఒకటి తలిచారు.. ప్రజలు మరొకటి తలిచారు. జరిగిందేదో జరిగిపోయింది. గత నాలుగేళ్లుగా ఏపీకి పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఆగిపోయాయి. పాలనా ఉపద్రవం ఓ వైపు ఉందనుకుంటే.. కరోనా విరుచుకుపడింది. కరోనా అనేది రాష్ట్ర ప్రజల మీద మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం మీద పడింది. అందుకే దిగ్గజ వ్యాపార, పారిశ్రామిక సంస్ధలన్నీ పెట్టబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. అనేక మంది అవకాశాల్ని అందుకుంటున్నారు. రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అందరూ ఎదురెళ్లి రాయితీలు ఇచ్చి పరిశ్రమల్ని తీసుకెళ్లిపోతున్నారు. కానీ ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం.. నాలుగేళ్లలో సాధించిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటీ లేదు. డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ అవేమీ నిర్మాణం కాలేదు.. ఉత్పత్తులు ప్రారంభించలేదు. రాజధానిని లేకుండా చేశారు. అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నా పట్టించుకోలేదు. అక్కడే ఏపీ పట్ల పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ దెబ్బతిన్నది.

అమరావతి నిలిపివేత.. లూలూ, కియాలతో వ్యవహరించిన విధానాన్ని దిగ్గజ సంస్థలు మర్చిపోతాయా ?

పెట్టుబడుల ప్రాధాన్యం పాలకులకు మొదట్లో అర్థం కాకపోవడంతో.. టీడీపీ హయాంలో వచ్చారు కాబట్టి వారిని వెళ్లగొట్టాలన్నఓ రకమైన మైండ్ సెట్‌తో వ్యవహరించారు. దీని వల్ల ఏపీకి జరిగిన పారిశ్రామిక నష్టం అంతా ఇంతా కాదు. విశాఖలో ఇప్పుడు పెట్టుబడుల సదస్సు కోసం రూ. వంద కోట్లు ఖర్చు పెట్టి.. టెంట్ వేసి పారిశ్రామిక వేత్తల కోసం లగ్జరీ ఏర్పాట్లు చేశారు. నిజానికి అంతకు మించిన కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించడానికి లూలూ సంస్థ గత ప్రభుత్వంలో ముందుకు వచ్చింది. రెండున్నరవేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. శంకుస్థాపన కూడా చేసింది. లూలూ సంస్థ గురించి తెలియని వారు ఉండరు. వరల్డ్ క్లాస్ మాల్స్… కన్వెన్షన్ సెంటర్స్ నిర్మించడంలో వారికి వారే సాటి. అలాంటి సంస్థ డబ్బులు కట్టి మరీ స్థలం తీసుకుని విశాఖలో రెండున్నర వేల కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు సిద్ధమైతే.. టీడీపీ హయాంలో వచ్చిందని చెప్పి వెళ్లగొట్టేశారు. ఆ పారిశ్రామికవేత్తల్ని ఎంత దారుణంగా అవమానించారంటే ఇప్పుడే కాదు భవిష్యత్‌లో ఎప్పుడైనా తాము పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రదేశాల జాబితా నుంచి ఆంద్రప్రదేశ్ ను కొట్టేశారు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు. ఆ పెట్టుబడి విలువ తెలియకపోవడం వల్ల ఏపీ ప్రభుత్వానికి ఎంత ఆదాయ నష్టమో… యువత కూడా కొన్ని వేల ఉద్యోగాలను కోల్పోయారు. లూలూను వెళ్లగొట్టడం అనేది మచ్చకు మాత్రమే.. జాకీ పరిశ్రమను ఎలా పంపేశారో కళ్ల ముందే ఉంది.. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు వాటా అడిగారు.. ఇవ్వలేదని దాడులు చేశారు. సీఎంవోకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలంగాణకు వెళ్లిపోయారు. ఇలాంటివి కోకొల్లలు. ఇవన్నీ బయట ప్రపంచానికి వింతగా అనిపించవచ్చు కానీ.. పారిశ్రామిక ప్రపంచంలో ఓ భయానక వాతావరణాన్ని కల్పిస్తాయి. కల్పించాయి కూడా. అందుకే ఏపీ అంటే పారిశ్రామిక వేత్తలు ఎవరూ రావడం లేదు. టీడీపీ హయాంలో ఒప్పందాలు చేసుకున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టర్ దగ్గర నుంచి తిరుపతిలో రిలయన్స్ సెజ్ వరకూ అందర్నీ వెళ్లగొట్టేశారు. టీడీపీ హయాంలో ఒప్పందాలు చేసుకుని నిర్మాణాలు ప్రారంభించేసిన హీరో ఎలక్ట్రిక్ వంటి కొన్ని సంస్థలు మాత్రం సైలెంట్ గా ఉత్పత్తి చేసుకుంటున్నాయి. చాలా సంస్థలు.. ప్రభుత్వ తీరు నచ్చక కార్యకలాపాలు కూడా ప్రారంభించలేదు. విజయవాడలో హెచ్ సీఎల్ సంస్థ భారీ క్యాంపస్ నిర్వహించింది. కానీ ఏమయింది ? విశాఖలో ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ఇన్ఫోసిస్ క్యాంపస్ పెట్టేందుకు సిద్ధమైంది. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకున్నాక.. ఆ క్యాంపస్ వస్తుందా రాదా అన్నది తెలియడం లేదు. 2019 నాటికి విశాఖలో యాభై వేల మంది ఐటీ ఉద్యోగులు పని చేసేవారు. ఇప్పుడు వారి సంఖ్య రెండు, మూడు వేలు ఉంది. ఎంతో కొంత ఐటీకి కేంద్రంగా ఉన్న విశాఖ ఉన్నప్పటికీ.. ఒడిషా కన్నా తక్కువగా ఐటీ ఎగుమతులు చేసేంతగా దిగజారిపోయాం. ఎంత దారుణం అంటే ఫార్ట్యూన్ 500 సంస్థల్లో ఒకటి అయిన ఫ్రాంక్లీన్ టెంపుల్టన్ ను ఓ బినామీ కంపెనీగా నేరుగా పార్లమెంట్‌లోనే చెప్పుకొచ్చారు.. ఘనత వహించిన ఎంపీ మిథున్ రెడ్డి. దీనికి ఆ కంపెనీ సర్కాస్టిక్ సమాధానం ఇచ్చి ఏపీ ప్రభుత్వ పరువు తీసింది. దీన్ని ప్రపంచ కార్పొరేట్ సమాజం తేలికగా తీసుకుని ఏపీకి పరుగులు పెట్టి వస్తందా ?

నాలుగేళ్లలో రాయలసీమ యువతకు చేసిన ద్రోహం సదస్సు ద్వారా సరిదిద్దగలరా ?

రాయలసీమ రాత మార్చే పరిశ్రమలు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. కియా లాంటి ఓ పరిశ్రమ వస్తే.. దాని చుట్టూ ఓ ఆటోమోబైల్ పరిశ్రమల ప్రపంచం ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది. టీడీపీ హయాంలో ఎన్నో కియా అనుబంధ పరిశ్రమ కోసం ఒప్పందాలు జరిగాయి. కానీ.. చివరికి ఊడ్చే కాంట్రాక్టుల కోసం కూడా బెదిరింపులకు పాల్పడటంతో మొత్తం వాతావరణం దెబ్బతిన్నది. గత నాలుగేళ్లలో ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో ఒక్క పెట్టుబడి ప్రతిపాదన రాలేదు. పులివెందులలో రెండు, మూడు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు..కానీ ఏదీ కనీసం నిర్మాణాల వరకూ రాలేదు. చివరికి సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ లో 51 శాతం వాటా కలిగిన వికాట్.. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టాగనే వచ్చి భారీగా విస్తరణ చేపడతామని ప్రకటించింది. కానీ నాలుగేళ్లయినా కనీస విస్తరణ జాడలేదు. అంటే పరిశ్రమలు తీసుకురావడం.. పెట్టుబడులు ఆకర్షించడం ఎంత కష్టమో ప్రస్తుత ప్రభుత్వానికి అర్థమయి ఉంటుంది. అందుకే.. మొత్తం నష్టపోయిన తర్వాత.. పెట్టుబడులు రాకపోతే.. బండి నడవదని అర్థమయి.. పెట్టుబడుల సదస్సు పేరుతో కనీసం .. రెండు మూడు వందల కోట్లు అయినా ఖర్చు పెట్టి… ఓ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడుల ప్రాధాన్యత గురించి తెలిసి ఉంటే.. మొదట ప్రజా వేదికను కూల్చేవారు కాదు. ఇలా ప్రభుత్వ ఆస్తులనే కూల్చుకునేవారి పట్ల పారిశ్రమికవేత్తలకు ఏ మాత్రం నమ్మకం ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ అదే జరిగింది. ఏపీలో ఓ వెయ్యి కోట్ల పెట్టుబడి వస్తే.. ఆ పరిశ్రమలకు రూ. రెండు వందల కోట్ల రాయితీలు ఇచ్చినా ప్రభుత్వానికి లాభమే ఉంటుంది. వెయ్యి కోట్లు పెట్టుబడి పెడితే..అందులో వివిధ రకాల పన్నుల ద్వారా మూడు వందల కోట్లు ప్రభుత్వానికే వస్తాయి. ఆ పరిశ్రమ చేసే ప్రతీ ఖర్చులో పన్నులు ప్రభుత్వానికి వస్తాయి. ఇక ఉత్పత్తి ప్రారంభిస్తే.. చేసే ప్రతి ఉత్పత్తి మీద ఆదాయం వస్తుంది. కియా పరిశ్రమకు.. ఓ నాలుగైదు వందల కోట్ల రాయితీలు ఇచ్చిఉంటారేమో కానీ.. దానిపైన కొన్ని రెట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇలాంటి అవగాహనలేకపోవడంతో ఏపీకి తీవ్ర నష్టం జరిగింది.

పెట్టుబడుల విలువను ప్రభుత్వం గుర్తించిందా ?

ఇప్పటికైనా ప్రభుత్వం తాము చేసిన తప్పును గుర్తించిందనే ఆశిద్దాం. వందల కోట్లు ఖర్చు పెట్టి.. పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారంటే.. రాష్ట్రం కోసమే అని నమ్ముదాం. అలా కాకుండా… ఏం చేసినా ఇంత కాలం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఈ సదస్సు విషయంలోనూ వ్యవహరిస్తే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ప్రభుత్వం ప్రతీ సారి.. అదానీ పెట్టుబడుల లెక్క చెబుతూ ఉంటుంది. గ్రీన్ కో సంస్థలుు… షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేపెత్తందారు సంస్థలు పెట్టే పెట్టుబడులనువేల కోట్లతో చూపిస్తూ ఉంటుంది. దావోస్ వెళ్లినా… మరో చోట అయినా అవే పెట్టుబడులు మళ్లీ మళ్లీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఎంవోయూలు మళ్లీ చేసుకుంటే … ప్రజలు ప్రభుత్వ చిత్తశుద్ధినే ప్రశ్నిస్తారు. సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పెట్టుబడులంటూ ఎన్ని మాయలు చేసినా వాటితో ప్రభుత్వం చేసుకునే ఒప్పందాల వల్ల ప్రజల ఆదాయాన్ని కట్టబెట్టాల్సి వస్తుంది కానీ ఉద్యోగాలు రావు. ఉత్పత్తి, సేవా రంగాల్లో పెట్టుబడులను విస్తృతంగా ఆకర్షించాల్సి. ఓఎన్జీసీ లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతుందని రాసుకుంటే.. అది పెట్టుబడి అయిపోదు. కియా లాంటి పరిశ్రమల్ని ఆకర్షించాలి. ఎంతో వేగంగా వాటిని గ్రౌండ్ చేయించుకోవాలి. అాలంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లకుండా.. అదానీ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకపోయినా కొండల్ని రాసిచ్చేసి.. రూపాయి.. అర్థరూపాయికు సేల్ డీడ్ లు చేస్తే.. అది స్కాం అవుతుంది కానీ.. పెట్టుబడుల ఆకర్షణకాదు.

స్వార్థం కోసం సమ్మిట్ ను ఉపయోగించుకుంటే అంతకంటే రాష్ట్ర ద్రోహం ఉండదు !

ప్రభుత్వ నిర్వాకం.. సీఎం జగన్ పాలనా తీరు.. ఇప్పుటి వరకూ తీసుకున్న నిర్ణయాల కారణంగా.. ఏపీ లో పెట్టుబడులు అనే అంశాన్ని దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఏదో మారామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి.. ముందుగా పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించుకునే ప్రయత్నం చేయాలి. ఆడంబరాలకు పోకుండా.. ఊరూపేరూ లేని వాళ్లతో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టిన కంపెనీలతో వేల కోట్ల ఒప్పందాలు చేసుకోకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. సహజవనరులను దోచి పెట్టడానికే.. ఈ సదస్సు అయితే ప్రజలకు చేసే ద్రోహం చిన్నది కాదు. ప్రభుత్వం ఏ విషయంలో అయినా పారదర్శకంగా వ్యవహరించాలి. పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించాలంటే.. తాము రాజ్యాంగ బద్దంగా వ్యహరిస్తామని.. తమ దగ్గర వ్యవస్థలన్నీ పక్కగా ఉంటాయని నమ్మకం కలిగేలా చేయాలి. కానీ ప్రభుత్వం.. అసలు చట్ట విరుద్ధమైన.. సుప్రీంకోర్టును సైతం ధిక్కరించేలా.. విశాఖ రాజధాని అని ప్రకటిస్తోంది. దీన్ని పెట్టుబడిదారులు ఎలా సానుకూలంగా తీసుగోలరు ?. ఏపీలో వ్యవస్తలన్నీ కుప్పకూలిన విషయంపై వారికి అవగాహన ఉంటే ఎలా పెట్టుబడులతో వస్తారు ?. వీటిపై పాలకులు దృష్టి పెడితే… నాలుగేళ్ల పాటు ఏపీపై పడిన ఓ మచ్చ.. కొన్నాళ్లకైనా మాయమయ్యే అవకాశం ఉంది. లేదు.. పెట్టుబడుల సదస్సు పేరుతో అస్మదీయులు.. బినామీలతో ఒప్పందాలు చేసుకుని.. ప్రచారం చేసుకుంటామంటే… అది రాష్ట్రానికి తీరని ద్రోహం చేయడమే !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close