పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మరోసారి అపహాస్యానికి గురైంది. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచి, అధికారం కోసం, ఇతర ప్రయోజనాల కోసం మరో పార్టీ కండువా కప్పుకోవడం కళ్లముందే కనిపిస్తున్నా.. సాక్ష్యాధారాలు లేవంటూ పది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కొట్టివేయడం నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ, సాంకేతిక కారణాల సాకుతో ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉద్దేశ్యం రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడం, కానీ నేటి రాజకీయాల్లో అది కేవలం అధికార పక్షానికి రక్షణ కవచంగా మారుతోంది.
కొత్త తరహా రాజకీయాల్లో స్పీకర్ పై అంతలేని ఒత్తిడి
ఈ వ్యవహారంలో స్పీకర్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉందనేది బహిరంగ రహస్యం. సాధారణంగా ఇటువంటి కేసుల్లో స్పీకర్లు తమ విచక్షణ అధికారాన్ని’ ఉపయోగించుకుని, సభా కాలపరిమితి ముగిసే వరకు తీర్పును సాగదీయడం ఒక అనవాయితీగా మారింది. అయితే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని గడువు విధించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ముందే తీర్పు వెలువరించాల్సి వచ్చింది. కోర్టు ధిక్కరణను తప్పించుకోవడానికి హడావుడిగా ఇచ్చిన ఈ తీర్పులో, వాస్తవాలను కంటే రాజకీయ అవసరాలకే పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. పారదర్శకమైన విచారణ కంటే, ప్రక్రియను ముగించడమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ సాగింది.
ఓటరు గౌరవించేది ఎప్పుడు ?
ఇక్కడ సమస్య కేవలం స్పీకర్ నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయ పార్టీల్లో నైతిక విలువలు పూర్తిగా అడుగంటడమే అసలు వైఫల్యం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రజాస్వామ్యానికి శాపంగా అభివర్ణించే పార్టీలే, అధికారంలోకి రాగానే అదే ఫిరాయింపులను రాజకీయ పునరేకీకరణ పేరుతో సమర్థించుకోవడం ద్వంద్వ నీతికి పరాకాష్ట. ప్రజలు తమకు నచ్చిన సిద్ధాంతానికి, పార్టీకి ఓటు వేస్తే.. గెలిచిన ప్రతినిధులు మాత్రం ఓటరును తక్కువ అంచనా వేస్తూ గోడలు దూకుతున్నారు. ఈ క్రమంలో ఓటరు ఒక మూగ ప్రేక్షకుడు మాత్రమేనన్న సంకేతాన్ని పార్టీలు పంపిస్తున్నాయి.
సంస్కరణలు రావాల్సిందే !
స్పీకర్ స్థానం ఎంతటి రాజ్యాంగబద్ధమైనదైనా, వారు రాజకీయ పార్టీల నుంచే ఎంపికవుతారు కాబట్టి నిష్పక్షపాత నిర్ణయాలు ఆశించడం అత్యాశే అవుతోంది. అందుకే, ఫిరాయింపుల కేసులను తేల్చే బాధ్యతను స్పీకర్ల నుంచి తొలగించి, స్వతంత్ర ట్రిబ్యునళ్లకు లేదా ఎన్నికల కమిషన్కు అప్పగించాలన్న సుప్రీంకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే, ఐదేళ్లకోసారి ప్రజలు వేసే ఓటుకు విలువ లేకుండా పోవడమే కాకుండా, ఫిరాయింపుల నిరోధక చట్టం కేవలం ఒక కాగితపు పులిలాగే మిగిలిపోతుంది.
