పుష్క‌ర ప్ర‌యాణం : అదిరింద‌మ్మా అనుష్క‌

క‌థానాయిక‌ల కెరీర్ కాలం చాలా త‌క్కువ‌. ప‌ట్టుమ‌ని నాలుగేళ్లు చేయ‌డం గొప్ప‌! అలాంటిది ఓ క‌థానాయిక పుష్క‌ర కాలంగా కొన‌సాగుతోందంటే, ఇప్ప‌టికీ… స్టార్ డ‌మ్ అనుభ‌విస్తుందంటే.. నిజంగా ఆ ప్ర‌యాణం అద్భుత‌మే. ఈ అద్భుతం సాధించిన క‌థానాయిక అనుష్క‌. ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి నేటికి స‌రిగ్గా 12 యేళ్లు. తొలి సినిమా ‘సూప‌ర్‌’.. సూప‌ర్ హిట్టేం కాదు. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈసినిమా డింకీ కొట్టింది. ఈ సినిమా వ‌ల్ల జ‌రిగిన మేలేమైనా ఉందంటే.. అది క‌చ్చితంగా అనుష్క‌నే. ఓ యోగా టీచ‌ర్‌ని ప‌నిగట్టుకొని హీరోయిన్ చేసిన సినిమా అది. ఆ సినిమాతో ఓ స్టార్ హీరోయిన్ తెలుగు చిత్ర‌సీమ‌కు దొరికింది. అరుంధ‌తితో ఒక్క‌సారిగా అనుష్క జాత‌క‌మే మారిపోయింది. ఈ క‌థానాయిక‌ని న‌మ్మి కోట్లు పెట్టుబ‌డిగా పెట్టొచ్చు… అనే విష‌యం రుజువైంది. రుద్ర‌మ‌దేవి లాంటి ప్రాజెక్ట్ సాకారం అయ్యిందంటే, అనుష్క‌లాంటి క‌థానాయిక అందుబాటులో ఉన్నందుకే! సైజ్ జీరో ఫ్లాప్ అయితే అవ్వొచ్చు.. కానీ… ఓ ప్ర‌యోగం చేసింది. బాహుబ‌లిలో దేవ‌సేన‌గా అద్భుతమైన గుర్తింపు అందుకొంది. డీ గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించాల్సివ‌చ్చినా అద‌ర‌లేదు.. బెద‌ర‌లేదు. ఆ ధైర్య‌మే, ఆ తెగువే.. ఇప్ప‌టికీ నెంబ‌ర్ వ‌న్ క‌థానాయిక‌గా కొన‌సాగేందుకు దోహ‌ద‌ప‌డింది.

గ్లామ‌ర్ హీరోయిన్‌గా అనుష్క చేసిన సినిమాలూ ఎక్కువే. హైటు ఆమెకు ప్ల‌స్ పాయింట్‌గా మారింది. ఇది వ‌ర‌కు.. ఆర‌డుగులు ఉన్న క‌థానాయకుల‌కు హీరోయిన్లు దొర‌క‌డం గ‌గ‌నం అయిపోయేది. అలాంటి త‌రుణంలో అనుష్క ఓ సూప‌ర్ ఛాయిస్‌గా దొరికింది. తెలుగుకే ప‌రిమితం కాకుండా.. త‌మిళంలోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. బాలీవుడ్‌కి వెళ్లే ఛాన్స్ వ‌చ్చినా ఏమాత్రం టెమ్ట్ అవ్వ‌లేదు. ఎందుకంటే.. అక్క‌డ ఫ్లాప్ ఎదురైతే.. సౌత్‌లో త‌న స్థానం గ‌ల్లంత‌వుతుంద‌ని తెలుసు. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం క‌ష్టం అనుకొంది కాబ‌ట్టే… తేలిగ్గా హిందీ అవ‌కాశాల్ని కాద‌నుకోగ‌లిగింది. సినిమా అంటేనే వివాదాల మ‌యం. ఎన్నో ఆకర్ష‌ణ‌ల‌కు లోన‌వ్వాల్సివుంటుంది. దాంతో పాటు పుకార్ల‌నూ భ‌రించాల్సివ‌స్తుంది. అనుష్క‌పై వ‌చ్చిన పుకార్లేం త‌క్కువ కాదు. ప్ర‌భాస్, నాగార్జున‌ల‌తో ముడిపెట్టి ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఏకంగా అనుష్క‌కి పెళ్ల‌యిపోయింది, ఓ కూతురు కూడా ఉంద‌ని టామ్ టామ్ చేశారు. అయినా అనుష్క బెద‌ర‌లేదు. వాటికి కృంగిపోలేదు. త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌లకూ ధీటుగానే స‌మాధానాలు ఇచ్చేది. సైజ్ జీరో త‌ర‌వాత పెరిగిన బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి నానా పాట్లు ప‌డింది జేజ‌మ్మ‌. ఇక అనుష్క ప‌ని అయిపోయింద‌నుకొన్నారంతా. కానీ.. ఈ బ్యాడ్ పిరియ‌డ్ ని కూడా.. దాటేసింది.

ఈ ప‌న్నెండేళ్ల ప్ర‌యాణం లో అనుభూతులు, విజ‌యాలు, అవార్డులు, ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌ల్నీ, ఓట‌ముల‌ను స‌మానంగా తీసుకొంది స్వీటీ. అందుకే.. అగుడడుగు ఆస్వాదించింది. అందుకే.. ఈ సంద‌ర్భంగా ఈ విషయాన్ని అనుష్క సోషల్‌మీడియాలో గుర్తు చేసుకున్నారు.

‘నాగార్జున, పూరీ జగన్నాథ్‌తో కలిసి నేను పనిచేసిన తొలి సినిమా ‘సూపర్‌’ విడుదలై 12 ఏళ్లు అయ్యింది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నన్ను ఆదరించిన, ప్రేమించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞతలు’ అని అనుష్క ఫేస్‌బక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తన సినిమా పోస్టర్లతో డిజైన్‌ చేసిన ఫొటోను పంచుకొంది. అనుష్క ప్ర‌యాణం భ‌విష్య‌త్తులోనూ ఇంత‌కంటే అద్భుతంగా కొన‌సాగాల‌ని.. మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని కోరుకొందాం. ఆల్ ద బెస్ట్ అనుష్కా…!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.