ఆంధ్ర, తెలంగాణా నేతల శవ రాజకీయాలు

రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలదే బాధ్యతని తెరాస, తెదేపా ప్రభుత్వాలు వితండవాదం చేస్తూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 14నెలలు పూర్తయిన తరువాత కూడా ఇంకా గత ప్రభుత్వాలనే నిందించడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆంధ్రాలో రైతన్నల ఆత్మహత్యల గురించి ఎంతో ఆవేదన చెందే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో రైతన్నల ఆత్మహత్యల గురించి కనీసం నోరు విప్పి మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. కానీ ఆంధ్రాలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కోసం భరోసా యాత్రలు చేస్తుంటారు. వారి కోసం నిరాహార దీక్షలు కూడా చేస్తుంటారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న పొగాకు రైతుల కుటుంబాలను జగన్ ఓదార్చిన తరువాత రేపు టంగుటూరులో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయబోతున్నారు. జగన్ సోదరి షర్మిల తెలంగాణాలో పరామర్శ యాత్రలు చేస్తూ ఎప్పుడో ఆరేళ్ళ క్రితం తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను మాత్రమే ఓదార్చుతారు. కానీ అదే గ్రామంలో, నియోజక వర్గంలో నిన్న మొన్న ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శించరు! కారణాలు అందరికీ తెలిసినవే.

అదేవిధంగా తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల గురించి తెలంగాణా ప్రభుత్వాన్ని తెదేపా నేతలు ప్రశ్నిస్తుంటారు. కానీ వారు ఆంధ్రాలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడరు.! కారణం అందరికీ తెలుసు. రైతుల ఆత్మహత్యలపై కూడా రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ శవరాజకీయాలు చూస్తుంటే రైతుల మనసులు క్షోభిస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం గొలుసు చెరువుల పునరుద్దరణ, విద్యుత్ సంక్షోభ నివారణ కోసం చర్యలు చేపడుతోంది. వాటి ఫలితాలు కనిపించేవరకు రైతన్నల పరిస్థితిలో మార్పు రావడం కష్టం. కనుక అంతవరకు ప్రభుత్వమే వారిని ఆదుకొనేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకొంటే రైతుల ప్రాణాలు దక్కుతాయి.

అభివృద్ధి పేరిట సారవంతమయిన పంటభూములను రైతుల నుండి లాక్కొని వాటిపై కాంక్రీట్ కట్టడాలు నిర్మించే ప్రయత్నంలో ఆంధ్ర ప్రభుత్వం ఉంది. వ్యవసాయం లాభసాటి కాదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చితాభిప్రాయం కారణంగానే అటువంటి పనులకు పూనుకొంటున్నారని అనుమానించవలసి వస్తుంది. ఒకపక్క ఆర్ధిక బాధలు భరించలేక రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే తెదేపా ప్రభుత్వం ప్రచారార్భాటాలకి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోంది. వచ్చేనెల 22న జరుగబోయే రాజధాని శంఖుస్థాపన కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఆర్భాటంగా నిర్వహించడానికి ముంబైలోని విజ్ క్రాఫ్ట్ అనే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకి కాంట్రాక్టు ఇచ్చింది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9.5 కోట్లు చెల్లిస్తోంది. ఆర్ధిక బాధలు భరించలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ప్రభుత్వం ఇటువంటి దుబారా ఖర్చులు చేయడం సమంజసమేనా? పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com