రాష్ట్రంలోని కార్మికులు, కూలీలు , గ్రామీణ ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్ల నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పేదలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో తాజాగా 62 కొత్త క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల మొత్తం సంఖ్య 269కి చేరుకోనుంది.
ప్రస్తుతం 207 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజూ సుమారు 2.10 లక్షల మంది కేవలం 5 రూపాయలకే కడుపునిండా భోజనం చేస్తున్నారు. వీటి పునఃప్రారంభం నుండి ఇప్పటివరకు సుమారు 8.80 కోట్ల భోజనాలు పేదలకు అందాయి. సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం భారీగా సబ్సిడీని భరిస్తోంది. ఇప్పటివరకు 243 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పథకం కోసం వెచ్చించగా, కొత్తగా ఏర్పాటు చేసే గ్రామీణ క్యాంటీన్ల కోసం ఏడాదికి మరో 58 కోట్ల రూపాయలు కేటాయించనుంది.
రెండవ విడతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 15న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ప్రారంభించనున్నారు. గతంలో కార్పొరేషన్లు , మున్సిపాలిటీలకే పరిమితమైన ఈ సేవలు ఇప్పుడు గ్రామాలకు విస్తరించడం ద్వారా గ్రామీణ పేదలకు ఊరట లభించనుంది. రుచి, శుచికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ధరణికోటలో కొత్త క్యాంటీన్‌ను ప్రారంభించి, అనంతరం లబ్ధిదారులతో కలిసి ఆయన భోజనం చేయనున్నారు. పల్లె ప్రజల ఆహార భద్రత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
