ఆంధ్రప్రదేశ్ – సెల్ ఫోన్ల అడ్డా!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా వున్న పెద్దదేశం చైనా, దానితో పోటీపడుతున్న చిన్నదేశం తైవాన్ ఆంధ్రప్రదేశ్ లోనే మొబైల్ ఫోన్ల ఉత్పత్తి మొదలుపెట్టాయి. ఇది ”మేకిన్ ఇండియా – మేడిన్ ఎపి” అన్నట్టు వుంది. ఇప్పటికే మొదలైన ఉత్పత్తులను, ఉత్పత్తులకు సిద్ధమౌతున్న ప్లాంటులను పరిశీలిస్తే సెల్ ఫోన్ల తయారీలో ఆంధ్రప్రదేశే దేశానికి అగ్రగామి కాబోతోందన్న అభిప్రాయం కలుగుతోంది.

సెల్ ఫోన్ తయారీ కంపెనీలను ఆకర్షించటంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి సఫలీకృతమయింది. దేశీయ మొబైల్ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, సెల్ కాన్, కార్బోన్ మొబైల్స్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు (ఎంఓయు) కుదుర్చుకుంది. చిత్తూరు జిల్లా సత్యవేడు నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు విస్తరించి ఉన్న శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల కంపెనీ షామీ భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్ కాన్‌ ప్లాంట్‌లో షామీ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్ కాన్ ప్లాంట్ లో 25 అసెంబ్లింగ్ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ నెలకు పది లక్షలకు పైగా ఫోన్లు తయారవుతాయి. ఆరువేల మంది ఉద్యోగులు ఉన్నారు. తొలి దేశీయ షియామీ మొబైల్ ఫోన్ కూడా ఇక్కడే తయారైంది.

చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో సెల్ కాన్ తోపాటు నాలుగు మొబైల్ ఉత్పత్తి కంపెనీలను నెలకొల్పుతున్నారు. ఈ కంపెనీల వల్ల ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా మరో 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రముఖ మొబైల్ సంస్థ లావా కూడా తిరుపతికి సమీపంలో తమ ప్లాంట్ నెలకొల్పనుంది. వచ్చే ఏడాదికి ఈ సంస్థ ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఈ ఏడాది రాష్ట్రంలో కొత్త కంపెనీల ద్వారాగానీ, ప్రస్తుతం ఉన్న కంపెనీలలో గానీ నెలకు 60 నుంచి 70 లక్షల ఫోన్లను తయారు చేసే సామర్ధ్యాన్ని నెలకొల్పేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఎలక్ట్రానిక్ పాలసీ, ఈ రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలు, ఉత్పత్తి ప్రక్రియను గమనిస్తే భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో మేడిన్ చైనాకు ‘మేడిన్ ఆంధ్ర’ చెక్ పెట్టనుందా అన్న రీతిలో ఉంది. రూ.40 వేల కోట్ల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 2014-2020ని రూపొందించారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమని ప్రధాన వృద్ధి కారకం – గ్రోత్ ఇంజన్ గా అభివృద్ధిపరచాలన్న ప్రభుత్వ వ్యూహం ఇప్పటికే ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, భూకేటాయింపులు, సింగిల్ విండో ద్వారా అనుమతులు, ఇతర ప్రోత్సాహకాల వల్ల దేశీయ కంపెనీలతోపాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా రాష్ట్రంలో తమ యూనిట్లను నెలకొల్పుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com