ఆయ‌న‌పై అధిష్టానానికి ఏపీ భాజ‌పా నేత‌ల ఫిర్యాదు!

అంగ‌ట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అనీ వెనకటికో సామెత ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇది అతికిన‌ట్టు స‌రిపోతుంద‌ని చెప్పాలి! కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో టీడీపీతో పొత్తులో ఉన్నారు. దేశంలోని ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుని మ‌రీ అధికారాన్ని ద‌క్కించుకుంటున్నారు. రాష్ట్రానికో వ్యూహం అమ‌లు చేస్తున్నారు. ఎంత మేథోమ‌థ‌నం చేస్తున్నా… ఆంధ్రా విష‌యానికి వ‌చ్చేస‌రికి భాజ‌పా ఎందుకో త‌డ‌బ‌డుతోంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దోస్తీ వ‌దులుకోవ‌డం కొంతమంది ఏపీ నేత‌ల‌కు ఏమాత్రం ఇష్టం లేద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఏపీలో పార్టీ విస్త‌ర‌ణ‌కు ఎన్ని ర‌కాలు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌న్నా… ఇలాంటి అభిమాన‌మే అడ్డు త‌గులుతూ ఉండ‌టంపై ఆ నాయ‌కుడి మీద పార్టీ నేత‌లు ఒకింత గుర్రుగా ఉన్నార‌ట‌! అంతేకాదు, ఆయ‌న తీరుపై ఢిల్లీకి ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ఇంత‌కీ.. ఆయ‌న ఎవ‌రంటే, ఏపీ భాజ‌పా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు!

ఏపీ భాజ‌పాకి కొత్త అధ్య‌క్షుడు రాబోతున్న‌ట్టు గ‌త కొన్ని నెల‌లుగా క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. ఓ ముగ్గురి పేర్లూ తెర‌మీదికి వ‌చ్చాయి అయితే, ఈ విష‌య‌మై అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణ‌య‌మూ ప్ర‌క‌టించ‌లేదు. ఈలోగా రాష్ట్రంలో భాజ‌పా త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలంటూ కేంద్ర నాయ‌క‌త్వం సూచించింద‌ట‌! దీన్లో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా బ‌స్సు యాత్ర నిర్వ‌హించాల‌ని నేత‌లు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ కార్య‌క్ర‌మానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. ఏర్పాట్లు చేసుకోవాల‌ని ఆయ‌న కూడా చెప్పేశార‌ట‌! కానీ, ఆ ఇది కార్య‌రూపం దాల్చ‌డం లేదు! కార‌ణం ఏంటంటే… ఈ బ‌స్సు యాత్ర విష‌య‌మై అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు చాలా లైట్ గా తీసుకుంటున్నార‌నీ, ఇలాంటి యాత్ర‌లు చేస్తే అధికారంలోకి వ‌చ్చేస్తామా అంటూ తేలిక చేసి మాట్లాడుతున్నారంటూ స‌మాచారం!

ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ కొన్ని ఆధారాల‌తో స‌హా ఫిర్యాదు నేత‌లు పంపిన‌ట్టు స‌మాచారం. వీలైనంత త్వ‌ర‌గా రాష్ట్రానికి కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించాల‌నీ, లేదంటే జాతీయ నాయ‌క‌త్వం ఆశిస్తున్న‌ట్టుగా ఏపీలో ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే ప‌రిస్థితి లేద‌నే విష‌యాన్ని స‌ద‌రు ఫిర్యాదులో క‌మ‌ల‌నాథులు పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో భాజ‌పా అధినాయ‌క‌త్వం కూడా కాస్త ఆగ్ర‌హించింద‌నీ, కొత్త అధ్య‌క్షుడి నియామ‌కం త్వ‌ర‌లో పూర్తి చేస్తామ‌నీ, ఆ త‌రువాతే బ‌స్సుయాత్ర వంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని అధినాయ‌క‌త్వం సూచించిన‌ట్టు కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాగూ లేదు క‌దా, ఆ స్థానంలో భాజ‌పాని నిల‌పాల‌ని రాష్ట్ర నేత‌లు త‌ప‌న ప‌డుతూ ఉంటే, ఇంకోప‌క్క పార్టీ అధ్య‌క్షుడు తీరు ఇలా ఉంటే ఎలా చెప్పండీ..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.