ఆంధ్రాకి కొత్త గ‌వ‌ర్న‌ర్ అవ‌స‌ర‌మే అంటున్నారు…!

తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ పై ఇంకా విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. ముఖ్యంగా ఏపీ నేత‌లు ఆ అంశాన్ని ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. న‌ర‌సింహ‌న్ తీరు స‌రిగా లేద‌నీ, తెలంగాణ ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపుతున్నారంటూ భాజ‌పా నేత విష్ణుకుమార్ రాజు విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. నాలా బిల్లుకు ఆమోదం తెలుప‌కుండా ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆ బిల్లుపై ర‌క‌ర‌కాల కొర్రీలు పెట్టారంటూ కొంత‌మంది ఏపీ నేత‌లు బాగానే విమ‌ర్శ‌లు చేశారు. అయితే, గ‌డ‌చిన వారంలోనే ఆ బిల్లుపై గ‌వ‌ర్న‌ర్ ఆమోదముద్ర వేసేశారు. దీంతో ఇక్క‌డితో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగిందీ అనుకున్నాం. న‌ర‌సింహ‌న్ కొంత ప‌ట్టువీడార‌నీ అనుకున్నాం. కానీ, తాజాగా ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు, ఎంపీ కంభంపాటి హ‌రిబాబు కేంద్రానికి రాసిన లేఖ ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

వీలైనంత త్వ‌రగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కొత్త గ‌వ‌ర్న‌ర్ ను ఏర్పాటు చేయాలంటూ ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. ప్ర‌తీయేటా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం వంటి కార్య‌క్ర‌మాల‌కు రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి గ‌వ‌ర్న‌ర్ హాజ‌రు కాలేక‌పోతున్నార‌నీ, ఇరు రాష్ట్రాల్లో ఉన్న విశ్వ‌విద్యాల‌యాల‌కు ఉప కుల‌ప‌తిగా ఒకేసారి బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం కూడా కాస్త ఇబ్బందిగా మారుతోంద‌నీ, అందుకే ఆంధ్రాకు ప్ర‌త్యేక గ‌వ‌ర్న‌ర్ ను బ‌డ్జెట్ స‌మావేశాల్లోపుగానే నియ‌మించాలంటూ హ‌రిబాబు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి, ఏపీ నేత‌లు న‌ర‌సింహ‌న్ విష‌యంలో ప‌ట్టువ‌దులుతున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు.

గ‌వ‌ర్న‌ర్ విష‌య‌మై భాజ‌పా ప‌ట్టు వీడ‌క‌పోవ‌డం వెన‌క తెలుగుదేశం వ్యూహం ఉంద‌నే అభిప్రాయం కూడా ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది! కేంద్రంతో స‌యోధ్య అవ‌స‌రం కాబ‌ట్టి, ఇదే స‌మ‌యంలో న‌ర‌సింహ‌న్ ను మార్చ‌డం అనే టాపిక్ ను ఏపీ భాజ‌పా నేత‌ల ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచేట్టు టీడీపీ చేస్తోంద‌నేది కొంద‌రి అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అప‌రిష్కృతంగా చాలా స‌మ‌స్య‌లు ఉన్నా న‌ర‌సింహ‌న్ ప‌ట్టించుకోవ‌డం కోలేద‌నీ, సెక్ర‌టేరియ‌ట్ కేటాయింపులు వంటి విష‌యాల్లో తెలంగాణ‌వైపే ఆయ‌న కాస్త ఎక్కువ మొగ్గుచూపి వ్య‌వ‌హ‌రించార‌నే అసంతృప్తి ఏపీ నేత‌ల్లో ఉంది. కాబ‌ట్టి, ఈ వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో ముగిసే అవ‌కాశం లేద‌నే అనిపిస్తోంది. అయితే, తాజా లేఖ‌పై కేంద్రం స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా న‌ర‌సింహ‌న్ కొన‌సాగుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక గ‌వ‌ర్న‌ర్ వ‌స్తే… కొంత గంద‌ర‌గోళం త‌ప్ప‌దేమో అనే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఆంధ్రా పాల‌న అమ‌రావ‌తికి వెళ్లినా.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మ‌డి రాజ‌ధాని క‌దా. ఇక్క‌డి శాంతి భ‌ద్ర‌త‌ల‌పై కేంద్రానికి ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు అందించాల్సిన బాద్య‌త గ‌వ‌ర్న‌ర్ పై ఉంటుంది. ఏపీకి ప్ర‌త్యేక గ‌వ‌ర్న‌ర్ వ‌స్తే… ఈ బాధ్య‌త ఎవ‌రి ప‌రిధిలోకి వ‌స్తుందీ అనే చ‌ర్చ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల్ని కేంద్రం దృష్టిలో ఉంచుకుని ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూడాలి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.