రైతుల ఇళ్ళస్ధలాల చోటు మళ్ళీ మారుస్తారా? రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాను సిద్ధమైంది. క్యాపిటల్‌ ఏరియాలో మొత్తం భూమిలో 6910 హెక్టార్లు నివాసాలకు, 3385 హెక్టార్లు వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతానికి, 1950 హెక్టార్లలో పౌర సదుపాయాల కల్పనకు. 6390 హెక్టార్లు ను పార్కులు, ఖాళీ స్థలాలకు కేటాయించారు.

కేపిటల్ రీజియన్ డెవలప్ మెంటు అధారిటీ ప్రాంతంలో ఇప్పటికే వున్న గ్రామాల వారికి కేటాయించవలసి వున్న ఇళ్ళస్ధలాలను డీటెయిల్డ్ మాస్టర్ ప్లన్ లో చూపించలేదు. వెంకటపాలెం నుండి ఉండవల్లి గ్రామం మధ్యలో ఉన్న పొలాల్లో రెసిడెన్షియల్‌ ప్లాట్లు చూపించారు. లాండ్ పూలింగ్ సమయంలో ఆయాగ్రామాలకు దగ్గరలోనే ఇళ్ళస్ధలాలు కేటాయిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. భూసేకరణ అయిపోయాక అక్కడే కుదరదు ఎక్కడో ఒకచోట ఇస్తామన్నారు. ఇప్పుడు ఒక జోనల్ ప్లాన్ లో ఆస్ధలాన్ని కేటాయించినట్టు చూపించారు. అయితే డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ లో ఆ వివరాలేమీ లేవు దీన్నిబట్టి అవసరమైతే రైతులకు ఇవ్వవలసిన ఇళ్ళ స్ధలాల్ని మరింత దూరానికి మార్చే అవకాశం కూడా వుందని అర్ధమౌతోంది.

గతంలో ప్రకటించిన రోడ్డు గ్రిడ్‌నే ఈ ప్లాన్ లో కూడా దీనిలో ప్రాతిపాదించారు. రెండు రైలు మార్గాలను ప్లానులో చూపించారు. నీరుకొండ, వెంకటపాలెం, పెద్దమద్దూరు వద్ద రిజర్వాయర్లు నిర్మించనున్నారు. నీరుకొండతోపాటు, గవర్నమెంటు కోర్‌ ఏరియాలో పౌర సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఉండవల్లి సెంటర్‌ నుండి ప్రకాష్‌నగర్‌ సెంటర్‌కు మధ్య ప్రాంతాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కేడాయించారు. వెంకటపాలెం మందడంలో కొద్ది భాగంలో మిక్స్‌డ్‌ యూజ్‌ భూములను కేటాయించారు. ఉండవల్లి కొండతోపాటు నీరుకొండ నుండి కృష్ణాయపాలెం వరకూ ఏర్పాటు చేయనున్న కాలువలను పార్కులు, ఖాళీ స్థలాలు చూపించారు. వెంకటపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న కొంత భాగాన్ని కమర్షియల్‌గా మార్చారు. వెంకటపాలెం, ఇబ్రహీపంపట్నం లంకల్లో పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఉండవల్లి గుహల నుండి ప్రకాశం బ్యారేజీ వరకూ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఉద్యాన వనాలుగా మార్చారు. వెంకటపాలెం నుండి పెనుమాక మధ్యలో ఉన్న జరీబు పొలాల్లో నివాస, వాణిజ్య ప్రాంతాలను ఏర్పాటు చేశారు.

అమరావతి టౌన్‌షిప్‌, నిడమర్రు, అనంతవరం, బోరుపాలెం సమీపంలో పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేయనున్నారు. మణిపాల్‌ వెనుకభాగం నుండి పశ్చిమ కాలువ నూతన స్లూయిస్‌ వరకూ రోడ్డుమార్గం వేస్తున్నట్లు మాస్టర్‌ప్లానులో పేర్కొన్నారు. 6390 హెక్టార్లలో పార్కులు, ఖాళీ స్థలాలు చూపించారు. మొత్తం రాజధాని గ్రామాల్లో 23 శాతం నివాస ప్రాంతాలు, గ్రామాలు ఆరుశాతం, రెండు శాతం మిశ్రమ వినియోగ ప్రాంతాలకు కేటాయించారు. దీంతోపాటు వాణిజ్య ప్రాంతం తొమ్మిదిశాతం, పారిశ్రామిక ప్రాంతం ఆరుశాతం, పార్కులు, ఖాళీస్థలాలు 16 శాతం, వాటర్‌ బాడీస్‌ 10 శాతంగా చూపించారు. పౌర సదుపాయాలు తొమ్మిదిశాతం, మౌలిక సదుపాయాల కల్పనకు 14 శాతంగా పేర్కొన్నారు.

ముఖ్యంగా సీడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో ఉన్న గ్రామాలను మినహా కొత్తగా రెసిడెన్షియల్‌ ప్రాంతాన్ని చూపించలేదు. తుళ్లూరు, వెంకటపాలెం శివారు, రాయపూడి ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాల జంక్షన్లను ప్రత్యేకంగా పేర్కొన్నారు. నీరుకొండ రిజర్వాయర్‌ నుండి రాజధాని ప్రభుత్వ కోర్‌, జస్టిస్‌ సిటీలకు నీటిని వినియోగించుకునే విధంగా ప్లాను రూపొందించారు. మంగళగిరి ఆటోనగర్‌, నవులూరు, ప్రస్తుత అమరావతి టౌన్‌షిప్‌లోనూ పారిశ్రామిక ప్రాంతాన్ని చూపించారు.

ముఖ్యమంత్రి క్షుణ్ణంగా ప్లాన్ ను పరిశీలించి, చర్చించి మార్పులు చేర్పులతో క్లియరెన్స్ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా ప్లాన్ ను నోటిఫై చేస్తారు. దానిపై నెలరోజులపాటు ప్రజల అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆతరువాత అవసరమైతే మార్పులు చేర్పులతో ప్లాన్ ను ఖరారు చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com