చంద్రబాబు ప్రభుత్వానికి 1500 రోజులు..! ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చారా..?

విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి ప్రభుత్వానికి నేటితో 1500 రోజులు ముగిశాయి. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే.. కట్టుబట్టలతో నెత్తిన అప్పులతో.. కొత్త రాష్ట్రం పయనం ప్రారంభించింది. రూ.14 వేల కోట్ల పైచిలుకు లోటు బడ్జెట్‌తో .. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే సమయానికి ఇవ్వడం కష్టమనుకునే ఆర్థిక పరిస్థితితో నడక ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ పదిహేను వందల రోజుల్లో… పర్వాలేదు.. నిలబడగలమనే నమ్మకాన్ని తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. తొలి ఏడాది లోటును పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని విభజన చట్టంలోఉన్నా.. తమకు ఏది భారం కాకుండా ఉంటుందో .. ఆ లెక్క వేసుకుని.. రూ. 4వేల కోట్లతో.. కేంద్రం సరిపుచ్చుంది. అయినా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేశారు. నాలుగు విడతలుగా రుణమాఫీని అమలు చేసినా రైతుల్లో ఎలాంటి అసంతృప్తి వ్యక్తం కాలేదు. ఏపీ ఉన్న క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లోనూ.. రుణమాఫీ చేశారన్న ప్రశంసలు కూడా దక్కాయి.

ఈ నాలుగేళ్ల కాలంలో… మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాలకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తున్నారు. సంక్షేమ రంగంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చంద్రన్న బీమా బడుగుల పాలిట వరంగా మారింది. హఠాత్తుగా మరణిస్తే.. ఆ కుటుంబాల్లో ఉండే కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ బాధను చంద్రన్న బీమా దాదాపుగా తీర్చింది. ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ప్రజల వద్ద నుంచి పూర్తి సంతృప్తిని పొందలేకపోయారు. ఇక హామీల్లో భాగంగా… చాలా రోజుల పాటు పెండింగ్‌లో ఉంచుతూ వచ్చిన అన్న క్యాంటీన్లను గత వారంలో ప్రారంభించారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రజల అంచనాలను దీర్ఘకాలంలో అందుకోగలిగితే.. ప్రభుత్వానికి ఇదో పెద్ద ఎసెట్ అవుతుంది. ఎన్నికల ముందు … పెండింగ్‌లో ఉన్న చిట్ట చివరి హామీ.. నిరుద్యోగభృతిని కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కూడా అమలు చేస్తే.. మ్యానిఫెస్టోని పూర్తిగా అమలు చేసినట్లు ప్రభుత్వం చెప్పుకోనుంది.

ఇక ఈ పదిహేను వందల రోజుల పాటనలో ప్రభుత్వానికి పేరు తెచ్చిన మరో అంశం ఇళ్ల నిర్మాణం. గతంలో లక్షలకు లక్షలు ఇళ్లు నిర్మిస్తున్నామన్న ప్రకటనలే కానీ… పట్టుమని వెయ్యి ఇళ్లయినా పేదలకు చేరినట్లు కనిపించేవి కావు. కానీ.. .రెండు విడతలుగా..దాదాపుగా ఐదు లక్షలకుపైగా ఇళ్లలో పేదల గృహప్రవేశాలు చేశారు. సాగునీటి రంగంలో పట్టిసీమ ప్రాజెక్ట్‌తో రైతుల్లో అసంతృప్తి అనేది లేకుండా చేసుకున్నారు. వట్టి పోతున్న కృష్ణాడెల్టాకు జీవం పోశారు. వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ.. రాయలసీమలో పచ్చదనం చూశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ దాదాపుగా సగానిపైగా పూర్తయింది. వచ్చే ఏడాదికి గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపాధి హామీ నిధులతో.. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే… అమరావతి విషయంలో మాత్రం.. ప్రభుత్వం అనుకున్న ప్రగతిని సాధించలేకపోయింది. డిజైన్లు, టెండర్ల ఖరారు దగ్గరే ఉంది. వచ్చే నెలలో ఓ రూపు తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. మౌలిక సదుపాయాల పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. రెండు ప్రైవేటు యూనిర్శిటీలు క్లాసులు ప్రారంభించేశాయి. హైదరాబాద్‌ను తలదన్నేలా.. గుంటూరు, విజయవాడ మధ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో తొమ్మిది నెలల్లో మళ్లీ ప్రజాతీర్పు కోరనున్న సమయంలో.. గ్రామదర్శిని ద్వారా..తెలుగుదేశం తాము సాధించిన విజయాలను ప్రజలకు చెప్పుకునేందుకు సిద్దమయింది. ఓ రకంగా క్షేత్ర స్థాయిలో ఇది ఎన్నికల ప్రచారం లాంటిదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com