ఆర్థిక సంఘానికీ ఏపీ హోదాకీ సంబంధం ఎక్క‌డ‌..?

14వ ఆర్థిక సంఘం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేకపోవ‌డానికి కార‌ణం ఇదే అనేది భాజ‌పా నేత‌ల వాద‌న‌! ఇక‌పై ఏ రాష్ట్రాలకూ ప్ర‌త్యేక హోదా ఇవ్వొద్ద‌ని క‌మిష‌న్ చెప్పింద‌నీ, కాబ‌ట్టే త‌త్సమాన ప్ర‌యోజ‌నాల‌తో ప్యాకేజీ ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింద‌ని ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల కూడా వాపోయారు. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంలో, అప్పుడు కేంద్ర‌మంత్రిగా ఉన్న వెంక‌య్య‌నాయుడు కూడా ఆర్థిక సంఘం సూచ‌న‌ల మేర‌కే ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని చెప్పారు. ఇంత‌కీ, 14వ ఆర్థిక సంఘానికీ ప్ర‌త్యేక హోదాకీ సంబంధం ఉందా..? హోదాను నిర్దేశించ‌గ‌లిగే స్థాయి సిఫార్సులు చేయ‌డం ఆ సంఘం ప‌రిధిలో అంశ‌మా..? అంటే, కానే కాదు అంటున్నారు నిపుణులు. వాస్త‌వం ఏంటంటే…14వ ఆర్థిక సంఘానికీ, ప్ర‌త్యేక హోదా ఇవ్వాలా వ‌ద్దా అనే ప్ర‌భుత్వ నిర్ణ‌యానికీ ఏమాత్రం సంబంధం లేదు. ఇదే విష‌యాన్ని 14వ ఆర్థిక సంఘంలో స‌భ్యులే స్వ‌యంగా చెబుతున్నారు.

రాజ్యాంగంలోకి ఆర్టిక‌ల్ 280 ప్ర‌కారం ఏర్ప‌డిన ఫైనాన్ష్ క‌మిష‌న్ కి రాష్ట్రాలను జ‌న‌ర‌ల్, ప్ర‌త్యేక హోదాల కింద వ‌ర్గీక‌రించే అంశంతో సంబంధం ఉండ‌దు. ఒక‌వేళ ఆ ప‌ని ఆర్థిక సంఘం చేస్తే దాని ఉనికికే అర్థం ఉండ‌దు. 14వ ఆర్థిక సంఘానికి నిర్దేశించిన విధులు ఏంటంటే… రాష్ట్రాల ఆదాయ వ్య‌యాల‌ను అంచ‌నా వేయ‌డం, ప‌న్నుల పంపిణీ – నిధుల మ‌ధ్య వ్య‌త్యాసాలు త‌గ్గించే సూచ‌న‌లు ఇవ్వ‌డం, అన్ని రాష్ట్రాల ఆదాయాల‌ను స‌మ‌తౌల్యం చేసే విధంగా మార్గ‌నిర్దేశం చేయ‌డం. ఇది మాత్ర‌మే వారి ప‌ని. అయితే, ఆ సంఘం ఇచ్చిన నివేదిక‌లో ‘ప్ర‌త్యేక‌ హోదా’ ప్రస్థావ‌న కూడా ఉంది. కానీ, అది ఎలా అంటే… ప్ర‌త్యేక లేదా సాధార‌ణ కేటగిరీల‌లో ఉన్న రాష్ట్రాల‌ను వేర్వేరుగా చూసి తాము సిఫార్సులు చేయడం లేద‌నీ, అయితే ఆర్థిక అస‌మాన‌త‌ల రీత్యా కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌త్యేక ప‌రిస్థితులున్నాయ‌ని పేర్కొన్నామ‌ని నివేదిక‌లో చాలా స్ప‌ష్టంగా ఉంది. ప్రత్యేక హోదా ఉన్న, హోదా లేని రాష్ట్రాలను కూడా 14వ ఆర్థిక సంఘం వేర్వేరుగా పరిగణించలేదు. ఉన్నవాస్తవాలను ద్రుష్టిలో పెట్టుకుని మాత్రమే సిఫార్సులు చేశామని చెబుతోంది. అంతేగానీ, కొత్త‌గా రాష్ట్రాల‌కు ఇవ్వాలా వ‌ద్దా అనే అంశంపై నివేదిక‌లో ఎలాంటి ప్ర‌స్థావ‌నా లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

హోదాకు సంబంధించిన నిర్ణ‌యాల‌ను (పూర్వ) ప్ర‌ణాళికా సంఘం సిఫార్సుల‌పై జాతీయ అభివృద్ధి మండ‌లి తీసుకుంటుంది. అది కూడా ఓ ఐదు అంశాల ప్రాతిప‌దిక‌న మాత్ర‌మే నిర్ణ‌యం జ‌రుగుతుంది. కొండ ప్రాంతాలు, జ‌న‌సాంద్ర‌త త‌క్కువ లేదా నిర్దిష్ట గిరిజ‌న జ‌న‌సంఖ్య ఉన్న ప్రాంతాలు, పొరుగు దేశాల‌తో స‌రిహ‌ద్దు క‌లిగిన రాష్ట్రాలు, ఆర్థిక, మౌలిక స‌దుపాయాల్లో వెనుక‌బాటుత‌నం, ఆర్థిక వెసులుబాటులో అసాధార‌ణ ప‌రిస్థితులు… వీటి ప్రాతిప‌దిక హోదా అనేది ఇవ్వ‌డం అనేది జ‌రుగుతుంది. ఇవేవీ 14వ ఆర్థిక సంఘం ప‌రిధిలోకి రాని అంశాలు. కాబ‌ట్టి, ప్ర‌త్యేక హోదా అనేది కేవ‌లం కార్య‌నిర్వాహ‌క నిర్ణ‌యంగానే చూడాల‌న్న‌ది నిపుణుల మాట‌. దీంతో రాజ్యాంగానికిగానీ, 14వ ఆర్థిక సంఘానికిగానీ, వారు చేసిన సిఫార్సుల‌తోగానీ ఏమాత్రం సంబంధం లేద‌ని ఆ సంఘ స‌భ్యుల్లో ఒక‌రైన ఎమ్‌. గోవింద‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక్క‌డ‌ స్థూలంగా అర్థం చేసుకోవాల్సిన విష‌యం ఏంటంటే… ఏపీకి హోదా ఇవ్వ‌కపోవ‌డానికి అస‌లు కార‌ణం భాజ‌పా మొండి వైఖ‌రి మాత్ర‌మే. దాన్ని క‌ప్పిపుచ్చుకుకోవ‌డం కోసం అరుణ్ జైట్లీతో స‌హా ఢిల్లీ పెద్ద‌లంతా ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను బూచిగా చూపిస్తున్నారు. ఆ సంఘం సూచ‌న‌లే అంటూ నెపాన్ని వారిపై నెట్టే వాద‌న‌లు తెర‌పైకి తెస్తున్నారు. చివ‌రికి, 2016లో ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌ట‌న చేస్తున్న స‌మ‌యంలో కూడా ‘14వ ఆర్థిక సంఘం వ‌ద్దు అంది కాబ‌ట్టే’ అంటూ హోదాకు బ‌దులుగా ప్యాకేజీ అని అరుణ్ జైట్లీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కానీ, వాస్త‌వం వేరేలా ఉంది. హోదా ఇవ్వాల‌నిగానీ, వ‌ద్ద‌నిగానీ చెప్పే అధికార‌మూ అవ‌స‌ర‌మూ ఆ అంశంపై స్పందించే స్వేచ్చా.. ఇవేవీ ఆర్థిక సంఘానికి లేవ‌నే విష‌యం చాలా స్పష్టం అని అంటున్నారు. లేని దాన్ని ఉంద‌ని చెప్పి, ఏకంగా రాజ్యాంగ బ‌ద్ధంగా ఏర్పడ్డ ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను ఏమాత్రం సంబంధం లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విష‌యానికి ముడిపెట్ట‌డం…. ఎంత దారుణ‌మైన వక్రీక‌ర‌ణ‌..? సాక్షాత్తూ కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే ఇలా వ్య‌వ‌హ‌రిస్తే ఏమ‌నుకోవాలి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.