తాత్కాలిక సచివాలయమే ఏపి రాజధానా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 180 కోట్లతో రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలనుకొంది. కానీ దాని నిర్మాణానికి టెండర్లు వేసిన రెండు కంపెనీల ఒత్తిడి కారణంగా రూ.201.50 కోట్లు చెల్లించడానికి సిద్దపడింది. అంటే ప్రభుత్వం ముందు అనుకొన్న దాని కంటే మరో రూ.21.50 కోట్లు అధనంగా చెల్లించబోతోందన్న మాట. అదికాక ప్రభుత్వం విధించిన ఆరునెలల గడువు కంటే ముందుగా అంటే నాలుగు నెలల్లోగా తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసినట్లయితే నిర్మాణ వ్యయంలో 10 శాతం (రూ.21.50 కోట్లు), ఐదునెలల్లో పూర్తి చేసినట్లయితే 5 శాతం అదనంగా (రూ.10.75 కోట్లు) ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం బోనస్ గా చెల్లిస్తుంది. గడువు కంటే ఆలశ్యంగా పూర్తి చేసినట్లయితే ఆ రెండు సంస్థలు 10 శాతం జరిమానా చెల్లించవలసి ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులలో ఆ గడువులోగానే పూర్తి చేసి బోనస్ అందుకొనేందుకు అవి గట్టిగా కృషి చేస్తాయని చెప్పవచ్చును. ఒకవేళ అవి ఐదు నెలల్లోనే ఆ పని పూర్తిచేస్తాయనుకొన్నట్లయితే వాటికి నిర్మాణ వ్యయంతో కలిపి మొత్తం రూ. 212.75 కోట్లు ప్రభుత్వం చెల్లించినట్లవుతుంది.

ఇంత బారీ మొత్తం చెల్లిస్తున్నా అది కేవలం సచివాలయ నిర్మాణానికే పరిమితం కనుక అక్కడికి చేరుకొనేందుకు రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ ఏర్పాట్లు, వీధి దీపాలు, ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ వసతుల కల్పన వంటివన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. వాటి కోసం అధనంగా మరో రూ.120 కోట్లు వ్యయం అవుతుందని సీ.ఆర్.డి.ఏ. అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తయ్యేసరికి ఇవ్వన్నీ కూడా పూర్తి కావలసి ఉంటుంది కనుక ఆ పనులు చేయడానికి త్వరలో టెండర్లు పిలువబోతున్నారు. అంటే ఈ ఏర్పాట్లకి, తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి కలిపి ప్రభుత్వం మొత్తం రూ.321.50 కోట్లు ఖర్చు చేయబోతోందన్న మాట. దానికి అదనంగా ఐదో, పదో శాతం బోనస్ ని కూడా కలుపుకొంటే సుమారు రూ.331-350 కోట్లు వరకు మొత్తం ఖర్చు అవుతుందని స్పష్టమవుతోంది.

ఒక్క తాత్కాలిక సచివాలయం కోసం ఇంత డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉందా? అదే డబ్బుతో రాజధానిలో శాశ్విత సచివాలయం నిర్మించుకోవచ్చును కదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంత ఖర్చు చేసి నిర్మించుకొన్న ఆ తాత్కాలిక సచివాలయాన్ని తరువాత వేరే సంస్థలకి లేదా ప్రభుత్వ కార్యాలయాలకి ఉపయోగించుకొని ఈ ఖర్చును రాబట్టుకొంటామని మంత్రులు సమర్ధించుకొంటున్నారు.

తీవ్ర ఆర్ధిక సమస్యలున్నాయని నిత్యం చెప్పుకొంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఈ తాత్కాలిక సచివాలయం కోసం చేస్తున్న ఈ దుబారా ఖర్చు, హడావుడి చూస్తుంటే, రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించలేమని ప్రభుత్వం భావిస్తునందునే ఈ పనికి పూనుకొందా…అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సింగపూర్ కంపెనీల చేత అద్భుతమయిన చిత్రాలు గీయించుకొచ్చి వాటిని ప్రజలకి చూపిస్తూ ప్రభుత్వం కాలక్షేపం చేసేస్తోంది తప్ప దాదాపు రెండేళ్ళు పూర్తయిపోయినా రాజధాని నిర్మాణం ఇంతవరకు మొదలవలేదు. ఇంకా ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం ఇంతవరకు రూ.1600 కోట్లు మంజూరు చేసింది. మరో 23,000 కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. కనీసం ఆ డబ్బుతోనయినా రాజధాని నిర్మాణ పనులు చేపట్టకుండా ఇటువంటి తాత్కాలిక కట్టడాల కోసం ఆ డబ్బుని వాడేసుకొంటే అప్పుడు కేంద్రం మిగిలిన మొత్తం మంజూరు చేయకపోతే చివరికి రాజధాని అంటే ఇప్పుడు నిర్మిస్తున్న ఈ తాత్కాలిక సచివాలయమేనని సరిపెట్టుకోవాలేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com