నోట్ల ర‌ద్దు ల‌క్ష్యాన్ని జైట్లీ ఇప్పుడు మార్చేస్తే ఎలా.!

పెద్ద నోట్ల ర‌ద్దుతో ఒక పెద్ద ల‌క్ష్యం నెర‌వేరింద‌ని చెప్పారు దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ర‌ద్ద‌యిన పెద్ద నోట్ల‌లో 99.3 శాతం తిరిగి బ్యాంకుల‌కు వ‌చ్చేశాయ‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దానిపై గురువారం మాట్లాడుతూ… నోట్ల ర‌ద్దు ల‌క్ష్యం జ‌మకాని నోట్ల‌ను చెల్ల‌కుండా చెయ్య‌డం మాత్ర‌మే కాద‌న్నారు..! ఈ నిర్ణ‌యం వెన‌క ఉన్న విస్తృత ల‌క్ష్యం వేరే ఉంద‌న్నారు! ప‌న్ను చెల్లించే అల‌వాటు అంద‌రికీ చేయ‌డంతోపాటు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డం, బ్లాక్ మ‌నీని నియంత్రించ‌డం… ఈ ల‌క్ష్యాలనున‌ నోట్ల ర‌ద్దు ద్వారా సాధించామ‌ని గొప్ప‌గా చాటింపేసే ప్ర‌య‌త్నం చేశారు అరుణ్ జైట్లీ. నోట్ల ర‌ద్దు వ‌ల్ల‌నే చాలామంది నుంచి ప‌న్ను వ‌సూలు చేయ‌గ‌లిగామ‌న్నారు. ఐటీ రిటర్న్స్ పెరిగాయ‌న్నారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం సూప‌ర్ డూప‌ర్ హిట్ అనేది జైట్లీ అభిప్రాయం.

నిజానికి, నోట్లు ర‌ద్దు చేసిన స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర భాయ్ మోడీ ఏమ‌న్నారో దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఇంకా గుర్తుంది, గుర్తుంటుంది కూడా! ఆ స‌మ‌యంలో మూడు అంశాలు చెప్పారు. ఒక‌టీ… అవినీతిని అంతం చేయ‌డం, రెండు… న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి తేవ‌డం, ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించ‌డం! ముంబైలో జ‌రిగిన ఓ స‌ద‌స్సులో క‌న్నీరు పెట్టుకుని మ‌రీ… ‘న‌న్ను న‌మ్మండీ, యాభై రోజుల్లో ఫ‌లితాలు రాక‌పోతే ఉరి తీయండి’ అంటూ జ‌నాల్ని ఎట్రాక్ట్ చేశారు. ఏమో… దేశం మారిపోతుందేమో అని భార‌తీయ ప్ర‌జ‌లంతా మోడీని న‌మ్మారు. కానీ, నోట్ల ర‌ద్దుతో సాధిస్తామ‌ని చెప్పిన మూడు ల‌క్ష్యాల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా నెర‌వేర‌ని ప‌రిస్థితి ఇప్పుడుంది. రిజ‌ర్వ్ బ్యాంకు నివేదిక‌తో ఈ నిర్ణ‌యం అట్ట‌ర్ ఫ్లాప్ అని ఆమోద ముద్ర వేసిన‌ట్ట‌యింది. ప్ర‌జ‌లకు క‌ష్టాలు, క‌న్నీళ్లు, న‌ష్టాలు త‌ప్ప‌… ఈ నిర్ణ‌యంతో మోడీ చెప్పిన మూడు ల‌క్ష్యాలు నెర‌వేర‌లేద‌న్న‌ది ముమ్మాటికీ వాస్త‌వం.

మోడీ చెప్పిన ఆ మూడు ల‌క్ష్యాలూ అరుణ్ జైట్లీ మ‌ర‌చిపోతే ఎలా..? దాదాపు రూ. 5 ల‌క్ష‌ల కోట్లు న‌ల్ల‌ధ‌నం లెక్క‌ల‌కు వ‌స్తుంద‌న్న అంచ‌నాలేమ‌య్యాయి..? చివ‌రికి మిగిలింది ఎంత‌య్యా అంటే…. రూ. 10 వేల కోట్ల‌ట‌! ఆ మేర‌కు కొత్త నోట్ల ముద్ర‌ణా వ‌గైరావ‌గైరాల‌కు జ‌రిగిన ఖ‌ర్చులు రూ. 25 వేల కోట్లు..! సాధించింది ఇదేనా…? ఏడాది పాటు ప్ర‌జ‌లు ప‌డ్డ క‌ష్టాలు, పోయిన ప్రాణాలు, మూత‌బ‌డ్డ చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై త‌గ్గిన‌ న‌మ్మ‌కం, దెబ్బ‌తిన్న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌… వీట‌న్ని గురించి కేంద్ర ఆర్థిక‌మంత్రి మాట మాత్ర‌మైనా ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం దారుణం. ఇప్పుడిప్పుడే మానుతున్న గాయ‌న్ని మ‌ళ్లీ రేపిన‌ట్టుగా ఉన్నాయి అరుణ్ జైట్లీ వ్యాఖ్య‌లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com