దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో ఆశీష్. ‘రౌడీ బోయ్స్’, ‘లవ్ మీ’ సినిమాలు నిరాశ పరిచాయి. ‘సెల్ఫిష్’ అనే ఓ సినిమా మొదలెట్టి మధ్యలో ఆపేశారు. ఇప్పుడు ‘దేత్తడి’ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఆశీష్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. దిల్ రాజు కూడా ఈసారి గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ‘దేత్తడి’ సినిమాకు సంబంధించి గ్లింప్స్ విడుదలైంది. టైటిల్ కి తగ్గట్టు తెలంగాణ నేపథ్యంలో సాగే కథ ఇది. హీరో పేరు.. ఘన్ను భాయ్. అతనికో బ్యాండ్ మేళం ట్రూప్ ఉంది. పెళ్లిళ్లకు, చావులకు, జాతర్లకు బ్యాండు వాయిస్తుంటాడు. అతని ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ కట్ చేశారు.
‘నేను లేకుండా ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక్క పండగ కాదు… దావత్ కాదు..’ అనే డైలాగ్ తో గ్లింప్స్ మొదలైంది. గ్లింప్స్ లో తీన్ మార్ బీట్ బాగుంది. జాతర సెటప్‌లో.. సినిమా వైబ్ మొత్తం కనిపిస్తోంది. ఆశీష్ లుక్ మాసీగా కనిపిస్తోంది. యూత్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీశారని అర్థం అవుతోంది. ‘బ్యాండోళ్లం కదన్నా.. గట్టిగ కొట్టుడు అలవాటైపోయింది’ అనే డైలాగ్ లో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం కనిపిస్తోంది. ఆదిత్య రావు గంగసాని దర్శకత్వం వహిస్తున్నారు. రాజు – శిరీష్ నిర్మాతలు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ప్రసన్న కుమార్ బెజవాడ అందించారు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ వేసవిలో విడుదల చేస్తారు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారు.


