బాబు మాయ చేసినా.. అశోక్‌ అప్పుడే హింటిచ్చాడు!!

విశాఖ రైల్వేజోన్‌ గురించి రైల్వే బడ్జెట్‌ అసలేమీ ప్రకటించకుండా మోసం చేసిదని ఇప్పుడు అందరూ ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో దీని గురించి ఆగ్రహం ఉండడం సహజమే. రాజకీయ నాయకులు అందరూ తమ తమ పార్టీల భావజాలాల ప్రకారం.. ఈ అంశానికి తమకు తోచిన రీతిలో భాష్యం చెబుతూ మాటల గారడీ చేస్తూ ఉండడం కూడా సహజమే. కానీ కాస్త నాలుగైదురోజుల ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి నాయకుల ప్రకటనలను గుర్తు చేసుకుంటే.. విశాఖపట్నంకు రైల్వే జోన్‌ రాబోవడం లేదని.. సాక్షాత్తూ కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు హింట్‌ ఇచ్చారని గుర్తుకు వస్తుంది. ఈ విషయంలో తాను వెళ్లి ఢిల్లీలో ప్రధానిని, సంబంధిత శాఖలకు చెందిన అందరు మంత్రులను కలిసి వచ్చిన తర్వాత.. రైల్వేజోన్‌ వచ్చేయబోతున్నదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బురిడీ కొట్టించడానికి ప్రయత్నించారు గానీ.. తెదేపా కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు మాత్రం.. చాలా నర్మగర్భంగా హింట్‌ ఇచ్చారు.

ఆయన కొన్ని రోజుల కిందట మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాకపోతే చాలా నష్టం అని.. హోదా విషయంలో గానీ, విశాఖకు రైల్వేజోన్‌ విషయంలో గానీ.. విభజన చట్టంలో స్పష్టంగా పెట్టకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఏదో కాంగ్రెస్‌ పార్టీని, వారు రాష్ట్రానికి చేటు చేశారని నిందించడానికి వీలుగా ఆయన ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారని అంతా అనుకున్నారే తప్ప.. ఆయన మాటల్లోని మర్మం గ్రహించలేదు. కానీ రైల్వే బడ్జెట్‌ వచ్చిన తర్వాత.. విశాఖ జోన్‌ విషయంలో వంచన అర్థమైన తర్వాత.. అశోక్‌ ముందే చెప్పిన సంగతి గుర్తుకు వస్తోంది.

ఆ మాటకొస్తే హోదా అనే సంగతిని, రైల్వేజోన్‌తో పోల్చడానికి వీల్లేదు. ప్రత్యేకహోదా అనేది చాలా పెద్ద సంగతి.. దానికి ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవాలి లాంటి పితలాటకాలు పెట్టడానికి కేంద్రానికి సాకులు దొరకుతాయి. కానీ రైల్వేజోన్‌ అలా కాదు. పైగా ”విభజన చట్టం ప్రకారం అని గానీ, పార్లమెంటులో హామీ ప్రకారం అని గానీ.. ” అనే వాక్యాలతో హోదా గురించి వాదించినట్లుగా మనం దీనిని అడగడం లేదు. ఏపీ అభివృద్ధి చెందాలంటే.. వీరికి సొంతంగా ఒక రైల్వేజోన్‌ కావాలనేది కొత్త డిమాండుగానే కేంద్రానికి విన్నవించుకుంటున్నాం. మన విజ్ఞప్తుల్ని తిరస్కరించడానికి వారికి అన్ని హక్కులూ ఉన్నాయి గానీ.. అందుకు మనం విభజన చట్టాన్ని సాకుగా ఎంచుకోవడం మాత్రం ఎందుకు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com