శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణం పెదపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక రామాలయ దర్శనానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆందోళనకారులు ఒక్కసారిగా మేకుల కర్రలు, చాకులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజును రక్షించే ప్రయత్నంలో ఆయన వెంట ఉన్న కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
పెదపేటలో దశాబ్దాలుగా శిథిలావస్థకు చేరిన ఒక పురాతన రామాలయం ఉంది. ఈ ప్రాంతంలో సామాజిక మార్పుల వల్ల కాలక్రమేణా ఆలయ నిర్వహణ కుంటుపడింది. ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించి, దానికి సంబంధించిన పనులను ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలపై స్థానిక క్రైస్తవ వర్గాల్లోని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు స్థలం తమకు సంబంధించిందని లేదా అక్కడ ఆలయ నిర్మాణం వల్ల తమ ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందనే వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజుకు , స్థానిక క్రైస్తవులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఇప్పుడు పండుగ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు ఆలయాన్ని దర్శించి, శ్రీరామునికి దండ అర్పించడాన్ని నిరసిస్తూ కొందరు ఆయన కారును అడ్డుకున్నారు. ఇది క్రమంగా పోలీసులు మరియు ఆందోళనకారుల మధ్య తోపులాటకు, ఆపై హింసాత్మక దాడికి దారితీసింది. ఉద్రిక్తతల నడుమ రఘురామకృష్ణరాజు ఆలయ దర్శనం ముగించుకుని మరో ప్రాంతానికి బయలుదేరుతుండగా, ఆందోళనకారులు కర్రలు, చాకులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో జనసేన నేత అనిల్ తలకు మేకులు దిగబడటంతో తీవ్ర రక్తస్రావమైంది. అలాగే, దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన మరో కార్యకర్తపై చాకుతో దాడి జరగడంతో వీపు భాగంలో తీవ్ర గాయమైంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తితో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తే ఇలాంటి దాడులకు పాల్పడటం దురదృష్టకరమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆకివీడులో ప్రస్తుతం భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.


