కొద్దిగా తగ్గినా సర్క్యూలేషన్‌లో కింగ్ ఈనాడే..!

తెలుగు మీడియాలో రంగంలో ఉండే పోటీ అంతా ఇంతా కాదు. టీవీ చానళ్ల టీఆర్పీ రేస్ గురించి పక్కన పెడితే.. పత్రికల హడావుడి చాలా ఎక్కువ. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత పత్రికా రంగంలోమార్కెట్ ఎంత విస్తృతమయిందో.. అంత కుంచించుకుపోయిందని చెప్పాలి. కానీ ఈ పోటీలోతట్టుకుని నిలబడేందుకు… పత్రికలన్నీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా 2017 రెండో ద్వితీయార్థంలో.. పత్రికల సర్క్యూలేషన్‌కు సంబంధించిన వివరాలను అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ విడుదల చేసింది.

తెలుగు పత్రికా రంగంలో నలభై ఏళ్ల నుంచి అగ్రస్థానంలో ఉన్న పత్రిక ఈనాడు. తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తోంది. కానీ గత ఏడాది ద్వితీయార్థంలో మాత్రం.. దాదాపుగా ఇరవై వేల కాపీల్ని కోల్పోయింది. ఆ పత్రిక సర్క్యూలేషన్.. ఏబీసీ లెక్కల ప్రకారం.. 1,842,624 కాపీలు. పెద్దెనిమిది లక్షల నలభై రెండు లక్షల పైచిలుకు కాపీలు.. ప్రతీ రోజూ.. అమ్ముడవుతున్నాయి. గత ఏడాది ప్రథమార్థంలో.. ఈ సంఖ్య పద్దెనిమిది లక్షల అరవై వేలకుపైగానే ఉంది. రెండో స్థానంలో సాక్షి దినపత్రిక ఉంది. ఆ పత్రిక ప్రస్తుత సర్క్యూలేషన్ 1,110,141 కాపీలు. ఆరు నెలల కాలంలో.. 18వేల కాపీల్ని పెంచుకోగలిగింది. మూడో స్థానంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఉంది. ఈ పత్రిక సర్క్యూలేషన్.. 7,20, 473 కాపీలు. ఆరు నెలల వ్యవధిలో నాలుగు వేల కాపీల్ని పెంచుకోగలిగింది ఈ పత్రిక.

ఓవరాల్‌గా చూస్తే.. సాక్షి పత్రికకు ఈ అంకెలు ఓ రకంగా ఊరట కల్పించాయని చెప్పొచ్చు. ఈనాడుతో పోటాపోటీగా ఉన్న ఆ పత్రిక పతనం శరవేగంగా సాగింది. ఒక్కో గత మూడేళ్ల కాలంలో దాదాపుగా ఐదారు లక్షల కాపీల సర్క్యూలేషన్ తగ్గిపోయింది. ఇటీవలి కాలంలోనూ బాగా తగ్గిపోతోంది. కానీ ఆ పత్రిక ఎన్నడూ లేని విధంగా.. మండల స్థాయి రిపోర్టర్లకు కూడా టార్గెట్లు పెట్టి… ప్రమోషన్ చేయిస్తోంది. ప్రత్యేకంగా ఇన్ని కాపీలు పెంచి చూపించాల్సిందేనని.. టార్గెట్లు పెడుతోంది. దాంతో… ఆ పత్రిక ఫీల్డ్ స్టాఫ్ మొత్తం సర్క్యూలేషన్ పెంచే పనిని కొనసాగిస్తున్నారు. ఈ చర్యల వల్ల పతనం కాస్తంత ఆగిపోయింది. ఆరు నెలల్లో ఇరవై వేల కాపీలు పెంచుకోగలిగారు. ఇటీవలి కాలంలో వరుసగా సర్క్యూలేషన్ పెరుగుతు వస్తున్న పత్రిక ఆంధ్రజ్యోతి. ఈ సారి కూడా పెంచుకుంది.

ఈ పత్రికలన్నిటినీ… ముందు ముందు కొన్ని సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ప్రధానంగా… తెలంగాణ ప్రాంతంలో .. ఈ పత్రికల సర్క్యూలేషన్‌పై వచ్చే ఏబీసీ రిపోర్టుల్లోతేడా కనిపించే అకకాశం ఉంది. ఎదుకంటే… విశాఖ ఇండస్ట్రీస్ ఓనర్, వీ 6 చానల్ యజమాని వివేక్.. వెలుగు పేరుతో పత్రికను పెద్ద స్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దసరా నుంచి ఇది మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే విజయక్రాంతి అనే పత్రికను.. నమస్తే తెలంగాణ మొదటి ప్రమోటర్ సీఎల్ రాజం ప్రారంభించారు. వీటి ప్రభావం.. ఈ ప్రధాన పత్రికలపై ఎంతో కొంత ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇది ఎన్నికల కాలం కాలం కాబట్టి సర్క్యూలేషన్ పెంచుకోవడానికి ఇంత కన్నా మంచి సమయం దొరకదని.. పత్రికల యాజమాన్యాలకు బాగా తెలుసు. అందుకే ఆ దిశగా ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com