తెలంగాణ మంత్రివర్గంలో కీలకమైన మైనారిటీ కోటాలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ అజహరుద్దీన్‌కు రాజ్యాంగపరమైన గడువు ముంచుకొస్తోంది. అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహర్, నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు అంటే ఏప్రిల్ 30 నాటికి శాసనసభ , శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ఎలాంటి అవకాశం లేదు . ఉన్నదల్లా ఎమ్మెల్సీ చాన్సే అది కూడా గవర్నర్ కోటాలోనే.
గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఫైల్
గతంలోనే క్యాబినెట్ తీర్మానం ద్వారా గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, అజహరుద్దీన్ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే అప్పటి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బదిలీ కావడం, కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టడంతో ఆ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయింది. పాత సిఫారసులపై సాంకేతిక కారణాలతో నిర్ణయం ఆలస్యం అవుతుండటంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
మళ్లీ క్యాబినెట్ సిఫారసు
తాజా సమాచారం ప్రకారం, వచ్చే రెండు మూడు రోజుల్లోనే అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, కొత్తగా అజహర్, కోదండరాం పేర్లను గవర్నర్ కోటా కింద మరోసారి సిఫారసు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత సిఫారసులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుండటంతో, ఫ్రెష్ రికమెండేషన్ పంపడం ద్వారా గవర్నర్‌కు రాజ్యాంగపరంగా ఆమోదముద్ర వేసే వెసులుబాటు కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు లోపు ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే అజహర్ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
మంత్రి పదవి పోతే రాజకీయంగా చిక్కులే
అజహరుద్దీన్ పదవి కోల్పోతే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒక కీలక మైనారిటీ నేతను మంత్రిగా చేసి, ఆరు నెలలు కూడా గడవకముందే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే మైనారిటీ వర్గాల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. కోదండరాం తెలంగాణ ఉద్యమ చరిత్రను, అజహరుద్దీన్ విషయంలో ఉన్న రాజ్యాంగ అవసరాన్ని గవర్నర్‌కు విన్నవించారు. పది రోజుల్లోపు గవర్నర్ ఆ ఫైల్‌పై సంతకం చేస్తేనే అజహర్ గండం గట్టెక్కుతారు. ఒకవేళ జాప్యం జరిగితే మాత్రం తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు తప్పవు.
