బాహుబ‌లిని చూసి వాత పెట్టుకొంటున్నారా??

తెలుగు సినిమా స‌రిహ‌ద్దుల‌న్నీ చెరిపివేసింది బాహుబ‌లి. వేయి కోట్ల‌తో ఔరా అనిపించింది. తెలుగు సినిమాకేకాదు… యావ‌త్ భార‌తీయ చిత్ర‌సీమ‌కే గ‌ర్వ‌కార‌ణంగా మారింది. రూ. వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టినా, తిరిగి రాబ‌ట్ట‌గ‌ల‌మ‌న్న ధీమా అందించింది బాహుబ‌లి. తెలుగు సినిమా బ‌డ్జెట్ ఇంత‌కు మించి ఉండ‌కూడ‌ద‌న్న‌… నిబంధ‌న‌ని కాల‌రాసింది. అందుకే ఇప్పుడు రూ.500 కోట్ల‌తో `రామాయాణం` క‌ల‌గ‌నే ధైర్యాన్నిచ్చింది. రూ.500 కోట్ల‌తో ఓ సినిమా తెర‌కెక్క‌డం ఇది వ‌ర‌కు ఊహ‌కు కూడా అంద‌ని విష‌యం. ఈ ప్రాజెక్టుకు స్ఫూర్తి అందించింది బాహుబ‌లి అన్న‌ది నిస్సంకోచంగా చెప్పొచ్చు. అయితే.. అన్ని సినిమాలూ బాహుబ‌ల‌లు కావు. ఈ విష‌యాన్ని చిత్ర‌సీమ ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది.

రామాయ‌ణం యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్‌. అంద‌రికీ తెలిసిన క‌థ‌. దాన్ని గ్రాండియ‌ర్‌గా చూపించాల‌నుకోవ‌డం త‌ప్పు కాదు. కాక‌పోతే… ప్రేక్ష‌కుడి ఊహ‌ల‌కు దూరంగా స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌డం మాత్రం అసాధ్యం. రామాయ‌ణంలో క‌ల్పిత పాత్ర ఒక్క‌టి ప్ర‌వేశ పెట్టినా.. ఔచిత్యం దెబ్బ‌తింటుంది. వెండి తెర‌పై భార‌తాన్ని ఎన్నిసార్ల‌యినా చూపించొచ్చు. ఎందుకంటే భార‌తంలో క‌నిపించే విశిష్ట‌మైన పాత్ర‌లు.. పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ రామాయాణంలో క‌నిపించ‌దు. మ‌హా భార‌త యుద్దాన్ని మించిన క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్‌.. ఎక్క‌డా ఉండ‌దు. అదే… రామ‌య‌ణంలో ప్ర‌ధాన‌మైన మైన‌స్‌. రామాయ‌ణంలో యుద్ద‌కాండలో వార్ ఎపిసోడ్స్‌కి ఛాన్సుంది. కానీ… దాన్నే న‌మ్ముకొంటే లాభం లేదు. బాపు లాంటి ద‌ర్శ‌కుడే రామాయ‌ణాన్ని క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా మ‌ల‌చ‌లేక‌పోయాడు. దానికి త్రీడీ హంగుల్ని జోడించినంత మాత్రాన‌.. జ‌నాల‌కు చేరువ అవుతుందా? భారీ తారాగ‌ణం, జ‌నాల విశ్వాసాన్ని పొందిన ద‌ర్శ‌కుడు… ఉంటే త‌ప్ప రామాయ‌నానికి క్రేజ్ రాదు. ఈ విష‌యం అల్లు అర‌వింద్ గుర్తిస్తే మంచిదేమో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.