బిగ్ బ్రేకింగ్‌: బోయ‌పాటితో కంటే ముందు మ‌రో ద‌ర్శ‌కుడితో బాల‌య్య‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర‌వాత‌.. నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా బోయ‌పాటి శ్రీ‌నుతోనే అనేది ఫిక్స‌య్యింది. ఇది ఇప్ప‌టి మాట కాదు. యేడాది క్రితం నుంచే… ఈ మాట వినిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ప్ర‌ణాళిక‌లు న‌డుస్తున్నాయి కూడా. ఎన్నిక‌ల హ‌డావుడి ముగిశాక ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని అనుకున్నారు. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈసినిమా కాస్త ఆల‌స్యం అవ్వొచ్చ‌ని ‘తెలుగు 360’ ముందే చెప్పింది. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఈసినిమా ఆల‌స్యం అవ్వ‌డమే కాదు, ఈలోగా.. బాల‌య్య మ‌రో సినిమా చేయ‌డానికి కూడా రెడీ అయిపోయారు.

అవును.. బోయపాటి కంటే బాల‌య్య మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. సి.కల్యాణ్ నిర్మాత‌. వీరి కాంబినేష‌న్‌లో ‘జై సింహా’ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా బాగానే ఆడింది. అప్పుడే బాల‌య్య‌తో మ‌రో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చారు సి.క‌ల్యాణ్‌. వినాయ‌క్‌తో ఆ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌నుకున్నారు. కానీ అది కుద‌ర్లేదు. ఇప్పుడు కె.ఎస్‌.ర‌వికుమార్‌నే మ‌రోసారి న‌మ్ముకున్నారు.

మే – జూన్‌ల‌లో బోయ‌పాటి సినిమా ప్రారంభం కావాల్సింది. కానీ.. క‌థ విష‌యంలో కొన్ని మార్పులు చేయాల్సివ‌చ్చింది. దానికి తోడు బాల‌య్య కూడా పాత్ర‌కు త‌గిన‌ట్టు మార‌డానికి కాస్త స‌మ‌యం కావాల‌న్న‌ట్టు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా ఆగ‌స్టుకి వెళ్లిపోయింది. అప్ప‌టి వ‌ర‌కూ చేతిలో సినిమా లేకుండా, ఖాళీగా కూర్చోవ‌డం బాల‌య్య‌కు ఇష్టం లేదు. అందుకే ఈలోగా కె.ఎస్‌.ర‌వికుమార్ సినిమాని పూర్తి చేయాల‌ని బాల‌య్య భావిస్తున్నాడు. మేలో ఈసినిమాని మొద‌లెట్టి, ఆగ‌స్టు నాటికి పూర్తి చేయాల‌ని ప్లాన్‌. అతి త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కి సంబంధించి ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com