బాల‌య్య విగ్గు వెనుక స్టోరీ

రూల‌ర్ సినిమా ఫ్లాప్ అవ్వ‌డం, డ‌బ్బులు రాక‌పోవ‌డం అటుంచితే, ఇందులో బాల‌కృష్ణ వాడిన విగ్గులు, వేష‌ధార‌ణ – వ్యంగ్యాస్త్రాల‌కు గురైంది. ఫ‌స్ట్ లుక్ నుంచే సోష‌ల్ మీడియాలో ఈ విగ్గుల‌పై జోకులు వేసుకోవ‌డం మొద‌లెట్టారు. ఐటీ కంపెనీ సీఈఓగా గెట‌ప్ ఓకే అయినా, పోలీస్ అధికారి ధ‌ర్మాగా మాత్రం విగ్గు భ‌యంక‌రంగా తేలిపోయింది. నిజానికి బాల‌య్య‌కు ముందు నుంచీ విగ్గుల స‌మ‌స్య ఉన్న‌దే. సింహా, లెజెండ్‌ల‌లో మిన‌హాయిస్తే… బాల‌య్య విగ్గుల విష‌యంలో దొరికిపోతూనే ఉన్నాడు. ఏ హీరోకీ లేదీ స‌మ‌స్య‌. కేవ‌లం బాల‌య్య విష‌యంలో మాత్ర‌మే జ‌రుగుతోంది. బాల‌య్య ఆహార్యం ఇలా త‌యార‌వ్వ‌డానికి కార‌ణం ఏమిటి? దీనికి నేప‌థ్యం ఏమిటి?

మేకప్ మెన్‌లు దూరం

బాల‌య్య‌కు కోపం, ప్రేమ అన్నీ ఎక్కువే. ఏదీ మ‌న‌సులో దాచుకోడు. కోపం వ‌స్తే మాత్రం చుట్టు ప‌క్కల వాళ్లు అవుట్‌. ఈ కోపాన్ని చాలాసార్లు బాల‌య్య మేక‌ప్‌మెన్‌ల మీద చూపించేవాడు. బాల‌య్య కోపానికి బ‌లైన మేక‌ప్‌మెన్‌లు ఎంతోమంది ఉన్నారు. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. అందుకే సినిమాకో మేక‌ప్‌మెన్ మారిపోతూ ఉంటాడు. అగ్ర క‌థానాయ‌కుల‌కు అలా కాదు. ప‌ర్మినెంట్ మేక‌ప్‌మెన్‌లు ఉన్నారు. వాళ్ల‌కు త‌మ హీరో ఎలా క‌నిపించాలో, ఎలా క‌నిపిస్తే జనాల‌కు నచ్చుతుందో ఓ అవ‌గాహ‌న ఉంటుంది. సినిమాకో మేక‌ప్ మేన్ మారితే.. ఆ అవ‌గాహ‌న ఎలా వ‌స్తుంది..? పైగా బాల‌య్య‌కు ఎదురు చెప్ప‌డం అంటే అంద‌రికీ భ‌య‌మే. ఇది బాలేదు, అది బాలేదు అంటే.. ఆయ‌న‌కు కోపం వ‌స్తుంద‌ని వెన‌క‌డుగు వేస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యం ఏమిటంటే.. బాల‌య్య సినిమాకి మేక‌ప్ మేన్‌ల‌ను వెదికి ప‌ట్టుకోవ‌డమే క‌ష్టాతి క‌ష్టం. స్టార్ హీరో సినిమాకి 2 ల‌క్ష‌ల జీతం ఇస్తే… బాల‌య్య‌కు మాత్రం 5 ల‌క్ష‌లు ఇవ్వాలి. అప్పుడే మేక‌ప్‌మెన్‌లు ధైర్యం చేయ‌గ‌ల‌గుతున్నారు. మ‌రో కీల‌క‌మైన విష‌యం.. త‌న విగ్గుల‌పై పూర్తి నిర్ణ‌యం బాల‌య్యే తీసుకుంటున్నాడు. లండ‌న్‌లో ఇలాంటి విగ్గులు తయార‌వుతుంటాయి. సినిమా ప్రారంభానికి ముందు లండ‌న్ వెళ్ల‌డం, అక్క‌డ ఓ విగ్ త‌యారు చేయించుకుని రావ‌డం… ఇదీ బాల‌య్య ప‌ద్ధ‌తి. త‌యారైన విగ్గు బాగోలేదంటే మ‌ళ్లీ బాలయ్య‌ని లండ‌న్ తీసుకెళ్లాలి. అందుకే.. ఆ మాట ఎవ్వ‌రూ చెప్ప‌డం లేదు.

తండ్రి మాత్రం వేరు

ఎన్టీఆర్ అయితే ఇలా కాదు. మేక‌ప్‌మెన్‌ల‌కు ఆయ‌న గౌర‌వం ఇచ్చేవాడు. ఆయ‌నకు జీవితాంతం ఒకే ఒక్క మేక‌ప్‌మెన్ ఉండేవాడు. ఆయ‌నే పీతాంబ‌రం. షూటింగ్ ఉందంటే…తెల్ల‌వారుఝామున మూడింటికే పీతాంబ‌రం ఎన్టీఆర్ ఇంటి ముందు ప్ర‌త్య‌క్షం అయ్యేవారు. మేక‌ప్ వేయించుకున్న త‌ర‌వాత ఎన్టీఆర్ పీతాంబ‌రం కాళ్ల‌కు మొక్కి ఆశీర్వాదం తీసుకునేవారు. అదీ… ఎన్టీఆర్ మేక‌ప్‌మెన్‌ల‌కు ఇచ్చిన గౌర‌వం. కొన్నిసార్లు స్వ‌యంగా పీతాంబ‌రం ఇంటికే వెళ్లి మేక‌ప్ వేయించుకునేవారు. అంతేకాదు… పీతాంబ‌రంని నిర్మాత చేసింది కూడా ఎన్టీఆరే. రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు పీతాంబ‌రం కోసం ఓ సినిమా చేశారు. బాల‌కృష్ణ తొలి చిత్రానికి కూడా పీతాంబ‌ర‌మే నిర్మాత‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com