బాల‌య్య ‘శివ శంక‌రీ’ డ్రీమ్‌

నంద‌మూరి బాలకృష్ణ మైకు ప‌ట్టుకొంటే చాలు.. బోల్డంత కామెడీ పుట్టేస్తుంది. ఏ ఆడియో వేడుక అయినా స‌రే.. ఒకే విధంగా రెచ్చిపోవ‌డం బాల‌య్య స్టైల్‌. పైసా వ‌సూల్‌లోనూ అదే కనిపించింది. ఉప ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్న బాల‌య్య స్పీచులు ఇచ్చీ ఇచ్చీ బాగా అల‌సిపోయాడు. అందుకే గొంతు కూడా బొంగురుపోయింది. అయినా స‌రే… – ఏక ధాటిగా మాట్లాడుతూ, తాను చెప్పాల‌నుకొన్న‌ది చెప్పేశాడు. పైసా వ‌సూల్ ఆడియో ఫంక్ష‌న్ మొత్తంలో హైలెట్ బాల‌య్య స్పీచే. అందులో ‘శివ శంక‌రీ’ ఎపిసోడ్‌. బాల‌య్య‌కు ఈ పాటంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఎప్పుడైనా స‌రే, ఘంట‌శాల లెవిల్లో వేదిక‌పై ఈ పాట పాడాల‌ని అనుకొనేవాడ‌ట‌. సినిమాల్లో పాటలు పాడ‌తాన‌ని ఎప్పుడూ అనుకోలేద‌ట‌. అలాంటి బాల‌య్య చేత పూరి ఓ పాట పాడించాడు. హుషారుగా ఒక్క గంట‌లో ఈ పాట పూర్తి చేశాడ‌ట బాల‌య్య‌. ”పాట ఒక్క గంట‌లో పాడేశా. బాగా వ‌చ్చిందో రాలేదో, ఇంకోసారి పాడాలో అనే అనుమానం నాది. అనూప్ ని అడిగితే ‘ఇది చాలు బాబు’ అనేవాడు. ఈ పాట‌ని నేనేదో శివ శంక‌రీ రేంజులో ఊహించుకొనేవాడ్ని“ అని చెప్పుకొచ్చాడు బాల‌య్య‌.

శ్రియ‌ని ఏరి కోరి ఈ సినిమాలో పెట్టింది బాల‌య్యే అని ముందు నుంచీ గ‌ట్టిగా ప్రచారం జ‌రుగుతోంది. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి స‌క్సెస్ మూడ్‌లో ఉన్న బాల‌య్య‌ను ‘మీతో మ‌రో సినిమా చేయాల‌నివుంది’ అని వేదిక‌పైనే అడిగేసింది శ్రియ. అప్ప‌ట్లోనే బాల‌య్య శ్రియ‌కు మాటిచ్చేశాడు. ”నాతో శ్రియ రెండు సినిమాలు చేసింది. చెన్న‌కేశ‌వ‌రెడ్డి, గౌత‌మి పుత్ర శాతక‌ర్ణి అద్భుత విజ‌యాన్ని అందుకొన్నాయి. మూడో సినిమా ఎప్పుడో అని శ్రియ బెంగ పెట్టుకొంది. దాంతో నేనే పూరితో చెప్పి ఈ సినిమాలో తీసుకొచ్చా” అంటూ అస‌లు సీక్రెట్ రివీల్ చేసేశాడు బాల‌య్య‌.
బాల‌య్య అంటే అంతే మ‌రి. నోట్లో ఏదీ దాగ‌దు. ఆ చేయి.. లేస్తే ఆగ‌దు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.