బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాజకీయ అస్త్రంగా మారింది. ఈ కేసులో న్యాయం జరగాలన్న డిమాండ్ కంటే, బాధితురాలి వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కేసు రాజకీయం కావడమే దీనికి కారణం. రాజకీయ ప్రయోజనాల కోసం బాధితురాలిని ఒక పావులా వాడుకుంటూ, ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేయడం ఆమెను మరింత మానసిక క్షోభకు గురిచేస్తోంది. బాధితురాలికి అండగా ఉండాల్సిన సమాజం, ఆమె క్యారెక్టర్‌పై నిందలు వేస్తూ చర్చలు పెట్టడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
అమ్మాయి క్యారెక్టర్‌పై నిందలేస్తున్న రాజకీయం
భగీరథ్‌ను సమర్థించే కొందరు వ్యక్తులు బాధితురాలి కుటుంబంపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆమె పార్టీల్లో గడిపిన ఫోటోలు, వీడియోలను పబ్లిక్ లో పెడుతున్నారు. ఆమెకు బోలెడంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని లెక్కలు తీస్తున్నారు. ఈ వ్యవహారంలో సదరు కుటుంబం ఏ రాజకీయ నాయకుడి వద్దకూ వెళ్లలేదని, కేవలం తమకు జరిగిన అన్యాయంపై చట్టపరంగా పోరాడుతున్నామని చెబుతున్నా, రాజకీయ పార్టీల అత్యుత్సాహం ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసేలా చేస్తోంది.
బాధితురాలి ఐడెంటీటీని బయట పెడుతున్న నెటిజన్లు
ఒకవైపు మహిళా సంఘాలు, విపక్షాలు నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తుంటే, మరోవైపు బాధితురాలి గతాన్ని తవ్వితీసి ఆమెను దోషిగా నిలబెట్టే స్మియర్ క్యాంపెయిన్ సాగుతోంది. ఒక పోక్సో కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలనే ప్రాథమిక నిబంధనను కూడా విస్మరించి, ఆమె ఫోటోలను వైరల్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా చాలామంది ఆగడం లేదు. నిందితుడు ఎంతటి బలవంతుడైనా, చట్టం ముందు బాధితురాలికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
బాధితురాలే అస్త్రంగా రాజకీయయుద్ధం
రాజకీయ యుద్ధానికి సంబంధం లేని కుటుంబం నలిగిపోవడం మంచిది కాదు. అసలు నేరం ఏమిటి, సాక్ష్యాలు ఏమున్నాయి అన్నది పోలీసులు, కోర్టులు తేల్చాల్సిన విషయం. కానీ, సోషల్ మీడియా విచారణలు చేస్తూ బాధితురాలి నైతికతను ప్రశ్నించడం వల్ల బాధితులు ఫిర్యాదు చేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనంతటికి కారణం అతి రాజకీయ జోక్యమే. ఆ కేసులో తప్పు చేస్తే భగీరథ్‌కు శిక్ష పడుతుంది. పడాలి కూడా. కానీ రాజకీయం చేయడం వల్ల బాధితురాలికి అన్యాయం జరుగుతుంది.


