కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ అల్లుకున్న హనీ ట్రాప్ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బండి భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబం తనను ట్రాప్ చేసి భారీ మొత్తంలో నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించింది. సాధారణ స్నేహితుల ద్వారా పరిచయమైన సదరు యువతితో కొన్నాళ్లు చాటింగ్ చేశానని , ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఇందుకు నిరాకరించడంతో తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని, ఇప్పటికే భయం కొద్దీ రూ. 50 వేలు చెల్లించానని, కానీ ఇప్పుడు ఏకంగా రూ. 5 కోట్లు ఇవ్వాలని, లేదంటే ఆ యువతి తల్లి ఆత్మహత్య చేసుకుంటుందని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్నారు.
అయితే, ఈ వ్యవహారం మరో మలుపు తిరుగింది. సదరు యువతి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో భగీరథ్‌పై ఎదురు ఫిర్యాదు చేశారు. సదరు యువతి మైనర్ అని, ఆమెను భగీరథ్ వేధించారని ఆరోపిస్తూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇదే కుటుంబం నిర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన స్నేహితులను కూడా ఇలాగే వేధించిందని భగీరథ్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 308(5), 351(2), 61(2) కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ప్రధాని పర్యటనకు సరిగ్గా ముందే ఈ ఆరోపణలు బయటకు రావడం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. ఒకవైపు హనీ ట్రాప్ ఆరోపణలు, మరోవైపు పోక్సో వంటి తీవ్రమైన సెక్షన్లతో కూడిన కౌంటర్ ఫిర్యాదుల మధ్య ఈ కేసు ఇప్పుడు అత్యంత క్లిష్టంగా మారింది. అసలు నిజానిజాలు ఏమిటన్నది పోలీసుల సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది.


