ప్రొ.నాగేశ్వర్ : బ్యాంకుల వద్ద రూ. 10 లక్షల కోట్లు దోచిందెవరు..?

భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద గుదిబండగా మొండి బాకీలు మారాయి. 2018 మార్చి నాటికి భారతీయ బ్యాంకుల మొండి బాకీలు రూ. 10 లక్షల కోట్లు దాటాయి. మొండి బాకీలు అంటే… నాన్ పెర్మార్మింగ్ అసెట్స్. నిరర్థక ఆస్తులు. వసూలు కావని.. బ్యాంకులు లెక్కలేసుకున్నవి. ఇలా మొండి బాకీల లెక్కల్లో బ్యాంకులు రాసుకున్న వాటిల్లో కనీసం పది శాతం కూడా వసూలు కావని బ్యాంకుల రికార్డులు చెబుతున్నాయి. రూ. 10 లక్షల కోట్ల మొండిబాకీలు అంటే.. బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 11.2 శాతం. అంటే బ్యాంకులు అప్పు ఇచ్చే ప్రతి వంద రూపాయాల్లో పదకొండు రూపాయలు తిరిగి రావడం లేదు. ఈ మొండి బాకీలు..మార్చి 2017 నాటికి రూ. 8 లక్షల కోట్లు. పైకి… రెండు లక్షల కోట్లు మొండిబాకీలుగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవంగా.. ఈ ఏడాదిలో బ్యాంకులకు పెరిగిన మొండి బాకీలు రూ. 5 లక్షల కోట్లు. బ్యాంకులు.. తమ లాభాల నుంచి రుణాలను రైటాఫ్ చేయడంతో… ఈ మూడు లక్షల కోట్లు తగ్గాయి. అంటే.. బ్యాంకులు తమ ఆదాయాన్ని మొండిబాకీల కింద సర్దుబాటు చేసుకున్నాయి. అంటే ఏడాదిలో రూ. 5 లక్షల కోట్లు.. బ్యాంకుల సొమ్ము.. మొండి బాకీలుగా మారింది.

రైతులకో రూలు.. కార్పొరేట్లకు ఓ రూలు..!
రైతులు, పేదవారు, మధ్యతరగతి జీవులు ఎవరైనా రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాయి. ఆస్తులను వేలం వేసేస్తాయి. కానీ లక్షల కోట్ల అప్పులు తీసుకున్న పెద్దల విషయంలో మాత్రం ఈ కఠినత్వం చూపించవు. పెద్దలు తీసుకున్న అప్పులు చెల్లించకపోతే.. ముందుగా వాటికి నిరర్థక ఆస్తి అని పేరు పెడతారు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఆస్తులు వేలం వేస్తారు. కానీ ఆ పెద్దల ఆస్తులు మొత్తం వేలం వేయరు. అంటే.. అతనికి రూ. 10వేల కోట్ల ఆస్తి ఉంటే… రూ. వేయి కోట్ల ఆస్తులను మాత్రమే వేలం వేస్తారు. మిగతా తొమ్మిది వేల కోట్లను.. వివిధ రూపాల్లోకి మార్చుకుంటారు. ఇతరల పేర్లపైకి మార్చుకోవడం .. విదేశాలకు తరలించుకోవడం చేస్తారు. ఇంకా తప్పించుకు పోవాలంటే..మాల్యా, నిరవ్ మోదీలాగా విదేశాలకు పారిపోతారు. ఒక వేళ దేశంలోనే పెద్ద మనిషిగా చెలామణి అవ్వాలనుకున్నా.. అనేక మార్గాలున్నాయి. రైతులు రుణాలు తీసుకుని చెల్లించలేకపోతే.. రుణాలు రీషెడ్యూల్ చేయరు. ఇలా చేస్తూ పోతే.. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెబుతూ ఉంటారు. కానీ పెద్దలు, కార్పొరేట్ సంస్థలు రుణాలు చెల్లించకపోతే.. రీ షెడ్యూల్ చేస్తారు. దీనికి కార్పొరేట్ డెట్ రీ స్ట్రక్చరింగ్ అని పేరు పెట్టుకున్నారు. అంటే.. బ్యాంకులు.. రూ.కోటి అప్పు ఇస్తే.. రూ.50 లక్షలు చెల్లించి.. సర్దుబాటు చేసుకోమని ఆఫర్ ఇచ్చేస్తాయి. అదే సమయంలో రైతుల రుణాలు మాఫీ చేస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని కారణాలు చెబుతూంటారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రుణమాఫీకి ఆర్బీఐ, కేంద్రం సహకరించలేదు. గతంలో యూపీఏ ప్రభుద్వం దేశ వ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేయడం వల్ల బ్యాంకులపై పడిన భారం.. రూ. 72వేల కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు బ్యాంకుల మొండి బకాయిలు లక్షల కోట్లలో ఉంటున్నాయి.

ప్రజల డిపాజిట్లతోనే… కార్పొరేట్లకు రుణాలు..!
బ్యాంకులకు పేరుకు పోతున్న మొండి బకాయిలన్నింటినీ.. కేంద్రం ఇవ్వదు. అవన్నీ… సామాన్యల డిపాజిట్లే. సామాన్యులు రూపాయి రూపాయి బ్యాంకుల్లో దాచుకుంటే.. ఆ సొమ్మును బ్యాంకులు కార్పొరేట్లకు రుణాలుగా ఇస్తున్నాయి. ఇప్పుడు మొండి బకాయిలుగా మారిన ప్రజల డిపాజిట్లు రూ. 10 లక్షల కోట్లు.. కార్పొరేట్లే తీసుకున్నాయి. అంబానీలు, ఆదానీల్లాంటి.. దేశంలోని బడా పారిశ్రామక వేత్తలు తీసుకున్న రుణాలే మొండి బకాయిలుగా మారాయి. కానీ బ్యాంకులు వీరి ఆస్తులను వేలం వేసే ఆలోచన కూడా చేయవు. ఈ కార్పొరేట్ కంపెనీ ఓనర్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా..? అంటే అదీ లేదు. వారి దగ్గర డబ్బులు ఉన్నా కట్టరు.. కట్టించుకునే ప్రయత్నం చేయరు.

మొండి బాకీలన్నీ కార్పొరేట్ల పాపాలే.. !
బ్యాంకులకు ఉన్న మొండి బాకీల్లో 89 శాతం రూ. 5కోట్లకు మించిన రుణాలే. సామాన్యుడెవరూ.. రూ. 5 కోట్ల రుణాన్ని బ్యాంకు నుంచి తీసుకోలేరు. అంటే ధనవంతులు, కార్పొరేట్లు మాత్రమే ఈ రుణాలు తీసుకోగలుగుతారు. బ్యాంకులకు ఉన్న మొండి బాకీల్లో 25 శాతం 12 పెద్ద కార్పొరేట్ సంస్థల వద్దే ఉన్నాయి. ఈ పన్నెండు కంపెనీల దగ్గరగా గట్టిగా వసూలు చేస్తే రెండున్నర లక్షల కోట్లు వస్తాయి. ఈ సొమ్ముతో కోట్లాది మంది సామాన్యులు.. పెట్రోల్, డీజిల్ పై వసులు చేస్తున్న పన్నులు తప్పించుకోవచ్చు. అదే 30 మందిని పట్టుకుంటే అరవై శాతం మొండి బకాయిలు రికవర్ అవుతుంది. ఆరు వేల మందిని పట్టుకుంటే..మొత్తం మొండిబాకీలు వసూలవుతాయి. కానీ ఎందుకు పట్టుకోవడం లేదు…?

ఎగ్గొట్టిన వారికే మళ్లీ మళ్లీ రుణాలు..!
నిజానికి సామాన్యుడు ఎవరైనా ఒకసారి బ్యాంకులో లోన్ తీసుకుని కట్టలేకపోతే.. మరోసారి బ్యాంకుల లోన్లు ఇవ్వవు. కానీ కార్పొరేట్ గద్దలకు మాత్రం .. ఎగ్గొట్టేకొద్దీ ఇస్తూనే ఉంటారు. డబ్బులుండి కూడా.. కట్టని వాళ్లకే మళ్లీ మళ్లీ ఇస్తున్నారు. ఇలా లోన్లు తీసుకున్న కార్పొరేట్లు.. తమ కంపెనీల నుంచి నిధులను డైవర్ట్ చేస్తున్నారు. తర్వాత కంపెనీలను దివాలా తీస్తున్నారు. ఈ విషయాన్ని కాగ్ బయటపెట్టింది. రుణాలు తీసుకుని దారి మళ్లించి..వాటిని మొండి బకాయిల ఖాతాలో చేర్చేస్తున్నారు. వీరిని ఎవరూ పట్టించుకోరు. ఇలా డబ్బులు ఎగ్గొట్టిన పెద్ద మనుషుల పేర్లను ఎప్పుడూ బ్యాంకులు ప్రకటించలేదు. ప్రకటించవు కూడా.

పార్టీల మద్దతుతోనే కార్పొరేట్ల దోపిడి..!
బ్యాంకులు వద్ద రుణాలు తీసుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతా వేటు వేయాలి. కానీ ఇంత వరకూ ఏ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేయలేదు. చట్టం చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే రాజకీయా పార్టీలన్నీ కార్పొరేట్ కంపెనీలతో సన్నిహితంగా మెలుగుతూంటాయి. నిధులిస్తూంటాయి. అవసరానికి విమానాలను సమకూరుస్తూంటాయి. ఇటీవలి కాలంలో ఆదానీ కంపెనీకి కొన్ని వేల కోట్ల రుణాలను బ్యాంకర్లు ఇచ్చారు. నిజానికి ఆదానీ అన్ని కంపెనీల విలువ కన్నా.. తీసుకున్న రుణాలు చాలా ఎక్కువ. ఇప్పటికిప్పుడు ఆదానీ కంపెనీలన్నీ అమ్మినా రుణాలు రికవరీ కావు. అయినా సరే లోన్లు ఎందుకు ఇచ్చారు..? ఎలా సాధ్యమయింది..? ప్రజలు డిపాజిట్లుగా బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును బడా కార్పొరేట్లు దోచుకుంటున్నారు. వీరికి మద్దతుగా ప్రభుత్వం కూడా ప్రజల డిపాజిట్లకు భద్రత లేకుండా.. ఎఫ్ఆర్డీఏ బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మొండి బాకీలు పెరిగాయని బ్యాంక్ చార్జీలు పెంచుతున్నారు. ఇటీవలి కాలంలోనే.. ప్రతీ విషయంలోనూ బ్యాంకులు చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నాయి. దీనికంటికి కారణం.. బ్యాంకుల్లో మొండి బాకీలే. ఈ పేరుతో కార్పొరేట్లు చేస్తున్న దోపిడీనే. తప్పంతా.. తెలిసీ ఊరుకుంటున్న ప్రభుత్వానిదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com