రివ్యూ: భీమ్లా నాయ‌క్‌

BHeemla Nayak review

తెలుగు360 రేటింగ్‌: 3.25/5

మాల‌యాళ సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డం, దాన్ని తెలుగులోకి తీసుకొచ్చి, ఆ థీమ్‌ని, మూడ్ ని, థాట్ నీ పాడు చేయ‌డం తెలుగు వాళ్ల‌కు అల‌వాటే. నిజానికి అది మ‌న త‌ప్పు కూడా కాదు. అక్క‌డి సెన్సిబులిటీస్ వేరు. ఇక్క‌డ వేరు. తెలుగులో కి ఓ క‌థ త‌ర్జుమా చేయాలంటే, అనేక లెక్క‌లేసుకోవాలి. కొల‌త‌లూ, తూనిక‌లూ కావాలి. ఉన్న‌ది ఉన్న‌ట్టు తీయ‌లేం. మార్పులు, చేర్పులూ చేసి, అతికించిన ఫీలింగ్ చెరిపేయ‌లేం. `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ అన‌గానే చాలా అనుమానాలు మొద‌లైపోయాయి. మ‌ల‌యాళంలో అదో క‌ల్ట్ క్లాసిక్‌. దాన్ని తెలుగులో ప‌వ‌న్‌, రానాల‌తో తీస్తున్నారంటే… ప‌వ‌న్ కోసం రానా పాత్ర‌ని త‌గ్గించేస్తార‌ని, కొత్త క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఆ క‌థ ఫ్లోని దెబ్బ తీస్తాయ‌ని.. ర‌క‌ర‌కాల భ‌యాలు. దినుసుల్ని ఎప్పుడు వేయాలో, ఎంత వేయాలో తెలిసే నేర్పుండాలే గానీ, ఎలాంటి వంటైనా కుదిరిపోతుంది. సినిమా కూడా అంతే. రాసే రాత‌లో, తీసే తీత‌లో, తెర‌పై క‌నిపించే పాత్ర‌ధారుల్లో ద‌మ్ము ఉంటే ఎలాంటి క‌థైనా వ‌ర్క‌వుట్ అయిపోతుంది. `భీమ్లా నాయ‌క్‌`లా.

డానియ‌ల్ శేఖ‌ర్ (రానా) మాజీ మిల‌ట‌రీ ఉద్యోగి. రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తి. క‌ర్నూలు స‌రిహ‌ద్దుల్లోని చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర ఎస్‌.ఐ భీమ్లా నాయ‌క్ (ప‌వ‌న్ క‌ల్యాణ్‌) అరెస్ట్ చేస్తాడు. కేసు ఫైల్ చేసి, ఎఫ్‌.ఐ.ఆర్ కూడా రాస్తారు. కానీ… డానియ‌ల్ బ్యాక్ గ్రౌండ్ తెలిశాక‌.. భీమ్లా కాస్త త‌గ్గుతాడు. అదే అదునుగా తీసుకుని డానీ రెచ్చిపోతాడు. సీజ్ చేసిన మందు బాటిల్ ని, డాని కోసం ఓపెన్ చేయ‌బోయి, కెమెరాకి చిక్కుతాడు నాయ‌క్‌. ఆ వీడియో పై అధికారుల‌కు పంపించి, భీమ్లా స‌స్పెండ్ అయ్యేలా చేస్తాడు డానీ. అలా ఓ చిన్న గొడ‌వ‌.. చినికీ చినికీ గాలివాన‌గా మారుతుంది. భీమ్లా, డానీల మ‌ధ్య యుద్ధం మొద‌ల‌వుతుంది. ఈ యుద్ధంలో ఎవ‌రు గెలిచారు? ఎవ‌రు ఓడారు? అనేదే మిగిలిన క‌థ‌.

ఇదో ఈగో క్లాష్‌. గోటితో పోయిందానికి, ఈగోకి పోయి గొడ్డ‌లి వ‌ర‌కూ తెచ్చుకున్న ఓ అహంకారి క‌థ‌. అందుకే అహంకారానికీ, ఆత్మాభిమానానికీ జ‌రిగే యుద్ధం అంటూ ట్రైల‌ర్ల‌లో, పోస్ట‌ర్ల‌లో ఈ సినిమా క‌థంతా రెండు ముక్క‌ల్లో చెప్పేశారు. డానీ, భీమ్లా అనేవి రెండు బ‌ల‌మైన పాత్ర‌లు. ఒక‌రిది అహం అయితే, మ‌రొక‌రిది ఆత్మాభిమానం. రెండూ త‌గ్గేవి కావు. అందుకే ఆ పోటీ మ‌జానిస్తుంది. రెండు కొద‌మ సింహాలు త‌ల‌బ‌డితే ఎలా ఉంటుందో ఈసినిమా అలా ఉంటుంది. `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` హిట్ట‌వ్వ‌డానికి బ‌ల‌మైన కార‌ణం అదే. అది క‌థ కాదు. రెండు పాత్ర‌ల ఘ‌ర్ష‌ణ‌. దాని చుట్టే క‌థ న‌డుస్తుంది.

సీన్ నెంబర్ వ‌న్ నుంచి క‌థ‌లోకి వెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు. డానిని అరెస్ట్ చేయ‌డం, పోలీస్ స్టేష‌న్‌లో డానీ త‌న పొగ‌రు చూపించ‌డం, డానీ ని రిమాండ్ కి పంపడం… ఇవ‌న్నీచ‌క చక సాగిపోతాయి. ఆ త‌ర‌వాత ఒక‌రిపై మ‌రొక‌రు గెల‌వ‌డానికి ఏం చేశార‌న్న‌ది క‌థైంది. మ‌ల‌యాళంలో ఉన్న లైన్ ఇదే. తెలుగులోనూ పెద్ద‌గా మార్పులు చేసే అవ‌కాశం లేక‌పోయింది. ప‌వ‌న్ కోసం, అత‌ని హీరోయిజం కోసం కొన్ని ఎపిసోడ్లు రాసుకున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాతృక‌లో లేదు. దాన్ని కేవ‌లం ప‌వ‌న్ కోసం రాసుకున్నా, ఆ ఎపిసోడ్ ని క్లైమాక్స్‌కి లింకుగా వాడుకోవ‌డం బాగుంది. మాతృక‌లో రెండు పాత్ర‌ల మ‌ధ్య డైలాగ్ ఓరియెంటెడ్ ఫైట్ ఎక్కువ‌. కానీ ఇక్క‌డ కూడా అదే చూపిస్తే కుద‌ర‌దు. అందుకే.. ఫైటింగుల‌కు చోటిచ్చారు. ఎలివేష‌న్ సీన్లు రాసుకున్నారు. భీమ్లా నాయ‌క్ అనేది ప‌వ‌న్ ఎలివేష‌న్ కోసం డిజైన్ చేసిన పాట‌. ఆడియో ప‌రంగా సూప‌ర్ హిట్ గీత‌మ‌ది. అయితే దాన్ని తెర‌పైకి తీసుకొచ్చేట‌ప్ప‌టికి అంత కిక్ ఇవ్వ‌దు. సునీల్ ఈ పాట‌లో మెరుస్తాడు. ఆ త‌ర‌వాత‌.. ప‌త్తా లేకుండా పోతాడు. ఈ పాట‌కోస‌మే సునీల్ ని తీసుకున్నార‌నుకోవాలి. పైగా ఈ క‌థ‌లో ఈ పాట ఏ కోణంలోనూ అమ‌ర‌లేదు. `లాలా… భీమ్లా…` పాట‌మాత్రం క‌థ‌లో బాగా మెడ్జ్ అయ్యింది. ఎక్క‌డ హీరోయిజం పండాలో.. అక్క‌డ ఈ పాట‌ని వాడుకున్నాడు. ఆ త‌ర‌వాత‌.. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ కూడా స్మూత్‌గా…. సాగిపోయింది.

ఎప్పుడైతే భీమ్లా ఖాకీ చొక్కా తీసేశాడో, అక్క‌డ హీరోయిజానికి మ‌రింత లైసెన్స్ దొరికేసింది. బార్‌ని పేల్చేయ‌డం, త‌న భార్య‌ని కిడ్నాప్ చేశార‌న్న కోపంతో డానీని వెదుక్కుంటూ త‌న అడ్డాకి వెళ్లడం.. అక్క‌డి యాక్ష‌న్ సీక్వెన్స్ అన్నీ బాగా కుదిరాయి. ద్వితీయార్థంలో సినిమా ఎక్కువ‌యాక్ష‌న్ మోడ్‌లో సాగుతుంది. నిత్య‌మీన‌న్ పాత్ర‌ని క‌థ‌లోకి బాగానే తీసుకొచ్చారు. ఇద్ద‌రు స్టార్ హీరోలున్న సినిమాలో బ‌ల‌మైన స్త్రీ పాత్ర‌ని చూసే అవ‌కాశం రావ‌డం నిజంగానే చాలా అరుదు. ఆ ఫీట్.. భీమ్లాలో క‌నిపించింది. `అంత ఇష్ట‌మేంద‌య్యా` అనే పాట‌ని సినిమా నుంచి లేపేశారు. ఓర‌కంగా మంచిదే అయ్యింది. లేదంటే ఫ్లోకి బ్రేక్ ప‌డేది. చివ‌ర్లో ప‌వ‌న్ – రానాల భీక‌ర‌మైన పోరాటం సుదీర్ఘంగా సాగింది. మొత్తానికి క‌మ‌ర్షియ‌ల్ ఎండింగ్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. మాతృక‌లో ఇన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేవు. ఇక్క‌డ కొత్త‌గా వాటిని పేర్చ‌డంలోనూ త‌ప్పులేదు. ఎందుకంటే అంతిమంగా ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా. త‌న నుంచి అభిమానులు ఏం ఆశించి థియేట‌ర్ల‌కు వ‌స్తారో, అది ఇవ్వ‌డానికి ఫిక్స‌యిపోయారు. చూడ్డానికి మ‌న‌మూ ఫిక్స‌వ్వాలంతే.

ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా ఎన‌ర్జిటిక్ గా క‌నిపించాడు. గబ్బ‌ర్ సింగ్ త‌ర‌వాత ప‌వ‌న్ లో ఇంత ఎన‌ర్జీ చూడ‌డం ఇదే తొలిసారి. ముఖ్యంగా ద్వితీయార్థంలో చాలా ఈజ్ తో చేశాడు. త‌న హెయిర్ స్టైల్ కాస్త ఇబ్బంది పెడుతుంటుంది. బాడీ షేప‌ప్ అవ్వ‌డం తెలుస్తుంటుంది. వాటిపై శ్ర‌ద్ధ పెట్టి, పోలీస్ పాత్ర‌కు ఇంకాస్త ప్రిపేర్ అయి ఉంటే బాగుండేది. రానా పాత్ర‌ని ప‌వ‌న్ కోసం త‌గ్గించేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. రానా పాత్రని ఎక్క‌డ ఎలివేట్ చేయాలో అక్క‌డ చేశారు. ఎక్క‌డ త‌గ్గించాలో అక్క‌డ త‌గ్గించారు. డానీగా త‌న అహంకారాన్ని మాట‌ల్లో, చేత‌ల్లో, చూపుల్లో ప‌ర్‌ఫెక్ట్ గా చూపించాడు రానా. నిత్య‌మీన‌న్ పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. `నాయ‌క్ పెళ్ల‌మంటే నాయ‌క్ లో స‌గం కాదు. నాయ‌క్ కి డ‌బుల్‌` అని ఓ డైలాగ్ ఉంది ఇందులో. ఆ డైలాగ్ కే ఆ పాత్ర‌ని ప‌రిమితం చేయ‌కుండా.. తెర‌పైనా చూపించ‌గ‌లిగారు. కొడుకుని రెచ్చ‌గొట్టి, ఆ ఈగోకి అస‌లు కార‌ణ‌మైన తండ్రి పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని క‌నిపించాడు. రావు ర‌మేష్ స‌పోర్టింగ్ విల‌న్ పాత్ర చేశాడు.

హీరోయిజం ఎలివేష‌న్ల‌లో ఆర్‌.ఆర్ ఎప్ప‌టిలానే ఇర‌గ్గొట్టాడు త‌మ‌న్‌. పాట‌ల‌న్నీ ఆడియో ప‌రంగా బాగా హిట్. ఆ బీజియ‌మ్స్‌ని బాగా వాడుకున్నాడు. కెమెరా వ‌ర్క్ బాగుంది. త్రివిక్ర‌మ్ మాట‌ల్లో ప‌దును క‌నిపించింది. అడ‌వి త‌ల్లి గురించి చెప్పిన‌ప్పుడు, రానా – స‌ముద్ర‌ఖ‌ని డైనింగ్ టేబుల్ సీన్‌లోనూ త్రివిక్ర‌మ్ మాట‌లు బాగా పేలాయి. `శుక్ర‌వారం సంత‌కం` అనే డైలాగ్ లో పొలిటిక‌ల్ అర్థాలు వెదుక్కునేవాళ్ల‌కు వెదుక్కునే అంత‌. నిజానికి ఇలాంటి క‌థ‌లు డీల్ చేయ‌డం చాలా క‌ష్టం. పైగా ఇద్ద‌రు హీరోల్ని పెట్టుకుని నెట్టుకుని రావ‌డం ఇంకా క‌ష్టం. ఆ క‌ష్టాన్ని త‌న రైటింగ్ తోనే దాటేశాడు త్రివిక్ర‌మ్.

ఓ రీమేక్ క‌థ‌కు, క‌మ‌ర్షియ‌ల్ దినుసులు జోడించి ఎలా తీయాలో.. భీమ్లా నాయ‌క్ చెబుతుంది. ప‌వ‌న్ ఎన‌ర్జీ, రానా పెర్‌ఫార్మెన్స్‌, త్రివిక్ర‌మ్ మాట‌లు, సినిమా క్వాలిటీ…. ఇవ‌న్నీ క‌లిసి మ‌ల‌యాళ క‌థ‌కు మ‌రిన్ని మెరుగులు దిద్దాయి.

ఫినిషింగ్ ట‌చ్‌: బాక్సాఫీస్ `నాయ‌క్‌`

తెలుగు360 రేటింగ్‌: 3.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close