భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఉదయం 11:00 గంటలకు రన్‌వేపై తొలి కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపి కలిశెట్టితో పాటు అధికారులు, జీఎంఆర్ ఉన్నతాధికారులు భోగాపురం చేరుకున్నారు. నూతనంగా నిర్మించిన రన్‌వేపై విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తరుణంలో అక్కడ హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే వాటర్ సెల్యూట్ తో ఘనస్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేగంగా పనులు పూర్తి చేసి, గడువు కంటే ముందే వ్యాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం కూటమి ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనం అనుకోవచ్చు. జూన్ నుంచి విమానాల రాకపోకలు మొదలైతే విశాఖ పారిశ్రామికంగా, విజయనగరం పర్యాటకపరంగా ప్రపంచ పటంలో నిలుస్తాయి. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో తదుపరి సాంకేతిక అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
విశాఖకు పెద్ద ఎత్తున అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులతో వస్తున్న తరుణంలో ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావడం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుతం 95 శాతం పనులు పూర్తయ్యాయి. మార్చిలోపు అన్ని పనులు పూర్తవుతాయి. ఈ లోపు అనుమతులు, పరీక్షలు అన్నీ పూర్తవుతాయి. మధ్యలో ఎప్పుడైనా ప్రధాని మోదీతో ప్రారంభించి…జూన్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభిస్తారు.
