ప్రొ.నాగశ్వర్: బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ల కాళ్ల వద్ద పెడుతున్నారా..?

బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత పరిణామాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. యాభై ఏళ్ల క్రితం బ్యాంకుల్ని ప్రైవేటీ కరణ చేసినప్పటి పరిస్థితులే ఇప్పుడు మళ్లీ వచ్చాయి. అప్పట్లో .. ప్రైవేటు బ్యాంకులు ప్రజల వద్ద నుంచి ఇష్టం వచ్చినట్లు డిపాజిట్లు సేకరించి.. చాలా కొద్ది మంది పారిశ్రామికవేత్తలకే రుణాల రూపంలో ఇచ్చేవారు. అంటే బ్యాంకులన్నీ కొద్ది మంది పారిశ్రామిక వేత్తల అదపులో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల్నీ జాతీయం చేశారు. దేశాభివృద్దికి ఉపయోగపడాలని ఆ పని చేశారు.

మళ్లీ బ్యాంకుల ప్రైవేటీకరణ నాటి పరిస్థితులు..!

1960లలో… దేశం మొత్తం ఆదాయంలో 44 శాతం ఆదాయం వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. కానీ అప్పట్లో ప్రైవేటు బ్యాంకులు కేవలం రెండు శాతం మాత్రమే ఆ రంగానికి రుణాలు ఇచ్చాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ చేసిన తర్వాత ప్రాధాన్యతా రంగానికి 40 శాతం రుణాలివ్వాలని నిర్దేశించారు. వ్యవసాయం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రాధాన్య రంగం పరిధిలోకి వస్తాయి. ఇందులో వ్యవసాయరంగానికి 80 శాతం రుణాలివ్వాలని నిర్దేశఇంచారు. అలాగే.. మాస్ బ్యాంకింగ్ ను ప్రారంభించారు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి విస్తరించారు. బ్యాంకుల సేవలను విస్తరించారు. ఇది 1961 నుంచి 1991 వరకూ జరిగింది. మళ్లీ ఇప్పుడు బ్యాంకులన్నీ డీ నేషనైలైజేషన్ దిశగా వెళ్తున్నాయి. డీ నేషనలైజేషన్ అంటే… ప్రజల డిపాజిట్లను మళ్లీ కార్పొరేట్ రంగానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. వారికే ఉపయోగపడలా చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్నరుణాల్లో…. బిగ్ బారోయర్స్ చేతుల్లోకే ఎక్కువగా వెళ్తున్నాయి. బిగ్ బారోయర్స్ అంటే… రూ. 5 కోట్లు అంత కంటే ఎక్కువరుణాలు తీసుకునేవారని అర్థం. ఇలా బిగ్ బారోయర్స్ చేతుల్లో వెళ్తున్న బ్యాంకుల రుణాలు మొత్తం 55 శాతం వరకూ ఉన్నాయి. అంటే బ్యాంకుల్లో ప్రజలు వంద రూపాయలు డిపాజిట్ చేస్తే అందులో రూ. 55 రూపాయలు ఈ పెద్ద రుణదారుల చేతుల్లోకే వెళ్తున్నాయి. వీరికి 85 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నారు. 1991 తర్వాత జరుగుతున్న పరిణామాలేమిటంటే.. మళ్లీ బ్యాంకింగ్ రంగంలోని బడా డిపాజిట్లన్నీ… పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలకే ఉపయోగపడే పరిస్థితి వచ్చింది.

బ్యాంకుల లాభాలన్నీ మొండిబాకీలకే..!

2014 నాటికి రూ. రెండున్నర లక్షల కోట్లు ఉన్న బ్యాంకుల మొండి బాకీలు 2018 మార్చి నాటికి భారతీయ బ్యాంకుల మొండి బాకీలు రూ. 10 లక్షల కోట్లు దాటాయి. మొండి బాకీలు అంటే… నాన్ పెర్మార్మింగ్ అసెట్స్. నిరర్థక ఆస్తులు. వసూలు కావని.. బ్యాంకులు లెక్కలేసుకున్నవి. ఇలా మొండి బాకీల లెక్కల్లో బ్యాంకులు రాసుకున్న వాటిల్లో కనీసం పది శాతం కూడా వసూలు కావని బ్యాంకుల రికార్డులు చెబుతున్నాయి. రూ. 10 లక్షల కోట్ల మొండిబాకీలు అంటే.. బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 11.2 శాతం. అంటే బ్యాంకులు అప్పు ఇచ్చే ప్రతి వంద రూపాయాల్లో పదకొండు రూపాయలు తిరిగి రావడం లేదు. ఈ మొండి బాకీలు..మార్చి 2017 నాటికి రూ. 8 లక్షల కోట్లు. పైకి… రెండు లక్షల కోట్లు మొండిబాకీలుగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవంగా.. ఈ ఏడాదిలో బ్యాంకులకు పెరిగిన మొండి బాకీలు రూ. 5 లక్షల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 5,89, 000 కోట్లు… కానీ 77,000కోట్ల లాస్ గా చూపిస్తున్నారు. ఇలా ఎలా చూపిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఆరు లక్షల అరవై ఏడు వేల కోట్లు… మొండి బాకీలు. ఈ మొత్తం కార్పొరేట్లకు ఇచ్చినవే. అంటే.. బ్యాంకుల లాభాలన్నీ… బడా కార్పొరేట్ల రుణాలు, వాటి మాఫీ కిందనే పోతున్నాయి. బ్యాంకులు.. తమ లాభాల నుంచి రుణాలను రైటాఫ్ చేయడంతో… ఈ మూడు లక్షల కోట్లు తగ్గాయి. అంటే.. బ్యాంకులు తమ ఆదాయాన్ని మొండిబాకీల కింద సర్దుబాటు చేసుకున్నాయి.

ప్రజల డిపాజిట్లతోనే… కార్పొరేట్లకు రుణాలు..!

బ్యాంకులకు పేరుకు పోతున్న మొండి బకాయిలన్నింటినీ.. కేంద్రం ఇవ్వదు. అవన్నీ… సామాన్యల డిపాజిట్లే. సామాన్యులు రూపాయి రూపాయి బ్యాంకుల్లో దాచుకుంటే.. ఆ సొమ్మును బ్యాంకులు కార్పొరేట్లకు రుణాలుగా ఇస్తున్నాయి. ఇప్పుడు మొండి బకాయిలుగా మారిన ప్రజల డిపాజిట్లు రూ. 10 లక్షల కోట్లు.. కార్పొరేట్లే తీసుకున్నాయి. అంబానీలు, ఆదానీల్లాంటి.. దేశంలోని బడా పారిశ్రామక వేత్తలు తీసుకున్న రుణాలే మొండి బకాయిలుగా మారాయి. కానీ బ్యాంకులు వీరి ఆస్తులను వేలం వేసే ఆలోచన కూడా చేయవు. ఈ కార్పొరేట్ కంపెనీ ఓనర్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా..? అంటే అదీ లేదు. వారి దగ్గర డబ్బులు ఉన్నా కట్టరు.. కట్టించుకునే ప్రయత్నం చేయరు.

బ్యాంకు రుణాలు ఎగ్గొడితే ఎన్నికల్లో పోటీ చేయకుడా చేయాలి..!

నిజానికి సామాన్యుడు ఎవరైనా ఒకసారి బ్యాంకులో లోన్ తీసుకుని కట్టలేకపోతే.. మరోసారి బ్యాంకుల లోన్లు ఇవ్వవు. కానీ కార్పొరేట్ గద్దలకు మాత్రం .. ఎగ్గొట్టేకొద్దీ ఇస్తూనే ఉంటారు. డబ్బులుండి కూడా.. కట్టని వాళ్లకే మళ్లీ మళ్లీ ఇస్తున్నారు. ఇలా లోన్లు తీసుకున్న కార్పొరేట్లు.. తమ కంపెనీల నుంచి నిధులను డైవర్ట్ చేస్తున్నారు. తర్వాత కంపెనీలను దివాలా తీస్తున్నారు. ఈ విషయాన్ని కాగ్ బయటపెట్టింది. రుణాలు తీసుకుని దారి మళ్లించి..వాటిని మొండి బకాయిల ఖాతాలో చేర్చేస్తున్నారు. వీరిని ఎవరూ పట్టించుకోరు. ఇలా డబ్బులు ఎగ్గొట్టిన పెద్ద మనుషుల పేర్లను ఎప్పుడూ బ్యాంకులు ప్రకటించలేదు. ప్రకటించవు కూడా. బ్యాంకులు వద్ద రుణాలు తీసుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతా వేటు వేయాలి. కానీ ఇంత వరకూ ఏ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేయలేదు. చట్టం చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే రాజకీయా పార్టీలన్నీ కార్పొరేట్ కంపెనీలతో సన్నిహితంగా మెలుగుతూంటాయి. నిధులిస్తూంటాయి. అవసరానికి విమానాలను సమకూరుస్తూంటాయి. ఇటీవలి కాలంలో ఆదానీ కంపెనీకి కొన్ని వేల కోట్ల రుణాలను బ్యాంకర్లు ఇచ్చారు. నిజానికి ఆదానీ అన్ని కంపెనీల విలువ కన్నా.. తీసుకున్న రుణాలు చాలా ఎక్కువ. ఇప్పటికిప్పుడు ఆదానీ కంపెనీలన్నీ అమ్మినా రుణాలు రికవరీ కావు. అయినా సరే లోన్లు ఎందుకు ఇచ్చారు..? ఎలా సాధ్యమయింది..?

ప్రజల డిపాజిట్లు ప్రజల అభివృద్ధికే ఉపయోగపడాలి..!

ఈ రకంగా బడా కార్పొరేట్ వ్యక్తులు దోచుకుంటూంటే.. ఇప్పుడు ఏకంగా వారికే బ్యంకింగ్ లైసెన్సులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో కూడా పారిశ్రామికవేత్తలకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వరు. అంబానీ, ఆదానీలు బ్యాంకులు పెట్టుకుంటే… ప్రజలు పెట్టే డిపాజిట్లన్నీ వాళ్లే వాడుకుంటారు కదా..? అందుకే అగ్ర దేశాల్లోనూ… బ్యాంకుల లైసెన్సులు కార్పొరేట్లకు ఇవ్వడం లేదు. ఇక్కడే ఏ దేశంలోనూ ఇవ్వడం లేదు. ప్రైవేటు బ్యాంకులు ఏవీ ప్రజలకు సేవలు చేయడం లేదు. పేదలకు అందుబాటులో ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులే. ప్రైవేటు బ్యాంకులు.. ప్రాధాన్య రంగాలకు కూడా.. రుణాలు ఇవ్వడం లేదు. అందువల్ల ప్రస్తుతం భారత ప్రజల డిపాజిట్లు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. జాతీయ కరణ నాటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. భారత ప్రజల డిపాజిట్లు వారి అభివృద్ధికే ఉపయోగపడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.