టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా నిలిచింది ‘బిగ్ బాస్’. మొదట హిందీ లో మొదలైన ఈ షో తరువాత మిగతా అన్ని భాషల్లోనూ వ్యాపించింది. ఆయా భాషల్లో ఉన్న స్టార్ హీరోలు హోస్ట్ లగా వ్యవహరిస్తూ బిగ్ బాస్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. దానికి తోడు ఇది సెలబ్రిటీస్ షో కావటంతో జనాల్లో మంచి ఆదరణ పొందింది. నటీనటులు , గాయకులు , కొరియోగ్రాపర్స్, సోషల్ మీడియా స్టార్లూ ఈ షోలో సందడి చేయడం మొదలెట్టారు. రీసెంట్ గా తెలుగులో సీజన్ 9 ముగిసింది. ఈ సీజన్ లో కామనర్స్ కూడా సెలబ్రిటీస్ తో పోటీ పడి, చివరికి టైటిల్ విన్నర్ గా నిలవటం ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంకొకరు… మొత్తం ఏడు గురు హౌస్ లోకి వెళ్లారు. టాప్ ఫైవ్ కి ఇద్దరు కామనర్స్ చేరారు. వీరిలో కళ్యాణ్ టైటిల్ విన్ అయ్యాడు. తనూజ, ఇమ్మాన్యూల్ లాంటి సెలబ్రిటీస్ ని వెనక్కి నెట్టి కామనర్ గా వచ్చిన కళ్యాణ్ విన్నర్ కావటం విశేషం. సీజన్ 7 లో సోషల్ మీడియా ఇన్ఫ్లు ఎన్సర్ రైతు బిడ్డ ట్యాగ్ లైన్‌తో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెల్చుకున్నాడు.
అయితే సీజన్ 9 వరకు బిగ్ బాస్ టైటిల్ గెల్చిన వారు కెరియర్ లో సక్సెస్ అయ్యారా ? వారికి బిగ్ బాస్ టైటిల్ హెల్ప్ అయ్యిందా ? హౌస్ నుంచి కప్ తో బయటికి వెళ్లిన వాళ్లంతా ఈ మైలేజీని వాడుకొన్నారా? అంటే సంతృప్తికరమైన సమాధానాలు రావు. బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నటుడు శివ బాలాజీ నిలిచారు. తెలుగులో 2017 లో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీజన్ లో విజేతగా నిలిచిన శివ బాలాలాజీ కెరీర్‌కి బిగ్ బాస్ పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. అప్పటి వరకు హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడపా కనిపించే శివబాలాజీ బిగ్ బాస్ తరవాత నటనకి బ్రేక్ ఇచ్చి బిజినెస్ మెన్ గా మారారు. లాంగ్ గ్యాప్ తరువాత రీసెంట్ గా కన్నప్ప సినిమాలో నటించాడు. ప్రస్తుతం ‘మా’ అసోషియేషన్ నెంబర్ గా కొనసాగుతున్నాడు. సీజన్ 2 లో మోడల్, సహాయక నటుడు అయిన కౌశల్ మండా విజేత గా నిలిచాడు. ఈ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు. కౌశల్ బయటికి వచ్చిన తరువాత బోలెడు వివాదాలు మూటగట్టుకున్నాడు. సినిమాలు, సీరియల్స్ లో ఎక్కడా కనిపించలేదు. ఆయన కూడా చాలా గ్యాప్ తరువాత కన్నప్ప సినిమాలో ఒక పాత్రలో మెరిశాడు.
సీజన్ 3 లో సింగర్ ‘రాహుల్ సింప్లి గంజ్’ విన్నర్ గా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నాడు. బిగ్ బాస్ గెలిచిన తరువాత లాభ పడిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ తరువాత రాహుల్ కెరియర్ మరింత ఊపందుకుంది. బ్లాక్ బస్టర్ సినిమాల్లో పాటలు పాడాడు. కొన్ని షోలలో హైలెట్ అయ్యాడు. చివరికి ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ కూడా రాహుల్ ఖాతాలో చేరి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చింది. పొలిటికల్ సర్కిల్ లో కూడా రాహుల్ పేరు మారు మ్రోగింది.
సీజన్ 4లో అభిజిత్ విజేతగా నిలిచాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’, ‘మిర్చి లాంటి కుర్రాడు’ లాంటి సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వచ్చింది అభిజిత్ కి. కానీ బిగ్ బాస్ అభిజిత్ కి పెద్దగా కలిసి రాలేదు. చివరికి వరల్డ్ టూర్ చేస్తూ, బ్లాగర్ గా మారాడు అభిజిత్. లాస్ట్ ఇయర్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తో OTT లో అడుగుపెట్టాడు. అది కూడా నిరాశే మిగిల్చింది. బిగ్ బాస్ లో కామనర్స్ ఎంట్రీ కోసం నిర్వహించిన ‘అగ్ని పరీక్ష’ ద్వారా మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు అభిజిత్.
సీజన్ 5 లో ‘వీజే సన్నీ’ విజేత గా నిలిచాడు. సీజన్ 5 లో టఫ్ ఫైట్ లో నిలిచి గెలిచాడు. బిగ్ బాస్ ఫేమ్ తో హీరోగా రెండు మూడు సినిమాలు చేసాడు. కానీ ఏవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. చివరికి హైద్రాబాద్ లో ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నాడు. సీజన్ 6 లో సింగర్ రేవంత్ విజేత అయ్యాడు. రేవంత్ బిగ్ బాస్ కి రాకముందే పాన్ ఇండియా గుర్తింపు ఉంది. ఇండియన్ ఐడెల్ 9 విన్నర్ గా నిలిచి రేవంత్ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడు. బిగ్ బాస్ తరువాత రేవంత్ పెద్దగా యాక్టీవ్ గా లేడని చెప్పాలి. ఒకటీ అరా పాటలు పాడుతున్నాడు తప్ప, అతనికి కూడా ట్రోఫీ పెద్దగా కలిసి రాలేదు.
సీజన్ 7 లో సోషల్ మీడియా స్టార్లయిన పల్లవీ ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యాడు. హౌస్ నుంచి ట్రోఫీ తో బయటికి వచ్చిన రోజే ప్రశాంత్ అరెస్ట్ కావటం గమనార్హం. రూల్స్ కి వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టి చివరికి అరెస్ట్ అయ్యాడు. ప్రశాంత్ విన్నింగ్ నుంచి తర్వాత కొంత కాలం వరకు వివాదాలతో వార్తల్లో నిలిచాడు. అంతకు మించి బిగ్ బాస్ ట్రోఫీ ప్రశాంత్ కి ఏం ఉపయోగపడలేదు. సీజన్ 8 లో సీరియల్ నటుడు నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్ లో మెయిన్ లీడ్ చేసిన నిఖిల్ బిగ్ బాస్ తరువాత కేవలం కొన్ని ఈవెంట్స్ కి మాత్రమే పరిమితం అయిపోయాడు. ఇక సీజన్ 9 విన్నర్ గా నిలిచిన కామనర్ అయిన కళ్యాణ్ ఆర్మీ సోల్జర్. ఈ విన్నింగ్ తెచ్చిన ఫేమ్ తో నెక్స్ట్ కళ్యాణ్ ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటి వరకూ అయితే బిగ్ బాస్ టైటిల్ ఒకరిద్దరికి తప్ప ఇంకెవ్వరికీ ఉపయోగపడలేదు. భవిష్యత్తులో ఈ ట్రెండ్ ఏమైనా మారుతుందేమో చూడాలి.
