లోక్‌సభలో నిన్న రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, దానితో పాటే ఉన్న మరో రెండు అనుబంధ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అంతా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోంది. సాధారణంగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించే మోదీ-షా ద్వయం, ఈ బిల్లును నెగ్గించుకోవాలనుకుంటే తమ కూటమియేతర పార్టీలైన వైసీపీ, బిజెడి వంటి తటస్థ పార్టీలను లేదా విపక్షాల మద్దతును కచ్చితంగా కూడగట్టేవారు. కానీ, అమిత్ షా కేవలం కూటమి పక్షాల బలంతోనే డివిజన్ కు వెళ్లడం వెనుక ప్రత్యేకమైన రాజకీయం ఉంది. మోదీ-షా రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాయి.
మోదీ, షా రాజకీయ వ్యూహాలు అనూహ్యం
భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం విసిరే ప్రతి పాచిక వెనుక ఒక బలమైన రాజకీయ లక్ష్యం ఉంటుంది. ప్రస్తుతం చర్చనీయాంశమైన రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలోనూ అదే కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ సవరణ వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు, అది నెగ్గడానికి అవసరమైన లెక్కలపై ముందే కసరత్తు చేస్తుంది. కానీ, ఈసారి మోదీ ప్రభుత్వం విపక్షాల మద్దతు కోరడానికి కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం, కేవలం కూటమి పార్టీలపైనే ఆధారపడటం వెనుక ఒక లోతైన వ్యూహం దాగి ఉంది. ఈ బిల్లు నెగ్గడం కంటే, వీగిపోతేనే బీజేపీకి రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది.
విపక్షాలను మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేయడం
బిల్లు వీగిపోతే మహిళాభివృద్ధికి తాము తెచ్చిన విప్లవాత్మక మార్పును విపక్షాలు అడ్డుకున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. మేము మహిళల కోసం మార్పు కోరుకున్నాం, కానీ విపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకున్నాయి అనే సెంటిమెంట్‌ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం ద్వారా విపక్షాలను మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేయనున్నారు. బిల్లు నెగ్గితే దాని క్రెడిట్ కేవలం ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ, అది వీగిపోతే ఆ కోపం అంతా విపక్షాల మీదకు మళ్లుతుంది. ఈ లాజిక్ కాంగ్రెస్ మిస్సయింది.
సంఖ్యాబలం లేకున్నా సాహసం ఎందుకు?
పార్లమెంటులో అవసరమైన మెజారిటీ లేదని తెలిసినా మొండిగా ముందుకు వెళ్లడం ద్వారా తాము తమ ఎజెండాకు కట్టుబడి ఉన్నామని, రాజీపడే ప్రసక్తే లేదని తమ కేడర్‌కు బీజేపీ ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది. , ఈ ఓటమి ద్వారా వచ్చే సానుభూతిని ఓట్లుగా మలుచుకోవడమే మోదీ-షా ద్వయం ముందున్న అసలు లక్ష్యం. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఒక చట్టం కావాలనే ఆకాంక్ష కంటే, విపక్షాల అసలు రంగును బయటపెట్టే ఒక పొలిటికల్ ట్రాప్ లాగా మారింది. ఇదే మోదీ-షా నెక్స్ట్ లెవల్ రాజకీయం అనుకోవచ్చు.
