అక్క‌డ సొంత బ‌లం పెంచుకోవ‌డంపై మోడీ దృష్టి..!

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అత్యంత కీల‌కంగా ఉన్న క‌రుణానిధి, జ‌య‌ల‌లిత.. ఇద్ద‌రూ ఇప్పుడు లేరు! నిజానికి, జయలలిత మరణంతో మొదలైన రాజకీయ అనిశ్చితి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే, ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో సొంత బ‌లం పెంచుకోవ‌డం కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి తీవ్రంగా ప్ర‌య‌త్నించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అమ్మ మ‌ర‌ణం త‌రువాతే నేరుగా చ‌క్రం తిప్పేద్దామ‌ని ప్ర‌య‌త్నించినా, ప‌ట్టు చిక్క‌లేదు. అయినాస‌రే, అన్నాడీఎంకే వెన‌క అదృశ్య శ‌క్తి పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అయితే, ప్రాంతీయ పార్టీల‌పై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించుకోవాల‌న్న‌ది మోడీ 2019 ఎన్నిక‌ల ప్ర‌ధాన అజెండాగా క‌నిపిస్తోంది. అందుకే, స‌హ‌జ మిత్ర‌ప‌క్షాల‌ను కూడా ప‌ట్టించుకోని ప‌రిస్థితిని చూస్తున్నాం.

త‌మిళ‌నాడు విష‌యానికొస్తే.. అక్క‌డ భాజ‌పాకి సొంతంగా అంటూ ఏమీ లేదు! గ‌త ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా మోడీ హ‌వా బ‌లంగా ఉన్న స‌మ‌యంలో కూడా అక్క‌డ భాజ‌పాని ప్రజలు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌మిళ‌నాడులో ఒక్క‌టంటే ఒక్క ఎంపీ సీటును ద‌క్కించుకోగ‌లిగింది. ఆ త‌రువాత‌, 2016 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సొంతంగా 232 స్థానాల్లో పోటీకి దిగింది. కేవ‌లం 2.8 శాతం ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి! భాజ‌పా కంటే కాంగ్రెస్సే కొంత‌న‌యం.. ఆ పార్టీకి 6.4 శాతం ఓట్లు ప‌డ్డాయి. దీంతో త‌మిళ‌నాడులో భాజ‌పాకి సొంతంగా పునాదులు ఏర్పాటు చేసుకోవ‌డం అంత ఈజీగా సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌నేది బాగానే తెలిసొచ్చింది. అయితే, ట్రాక్ రికార్డు ఇలా ఉన్నా కూడా… జ‌య‌ల‌లిత మ‌రణం త‌రువాత త‌మ‌కూ త‌మిళ‌నాడులో బ‌ల‌ప‌డే ఛాన్సులు పెరిగాయ‌న్న‌ది మోడీ షా ద్వ‌యం అంచ‌నాగా అప్పుడూ క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి విశ్లేష‌ణ‌లే ఆ పార్టీలో జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో భాజ‌పాకి దాదాపు 50 ల‌క్ష‌ల మంది స‌భ్యులున్నార‌ని ఆ పార్టీ చెబుతోంది. దీంతోపాటు, త‌న ట్రేడ్ మార్క్ వ్యూహాన్ని కూడా అమ‌ల్లో పెట్టింద‌ట‌! కులాల ప్రాతిప‌దిక కొన్ని స‌మావేశాల‌ను భాజ‌పా అక్క‌డ నిర్వ‌హిస్తోంద‌ని స‌మాచారం. దేవేంద్రకుల వ‌ల్లార్‌, నాడార్లు, విన్న‌యార్‌, బ్రాహ్మ‌ణులు.. ఈ కులాల‌కు చెందిన‌వారితో స‌మావేశాలూ స‌భ‌లూ పెడుతూ.. భాజ‌పా యాక్టివ్ గా ఉండే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ట‌. ఒక ద‌ళిత్ క‌మ్యూనిటీ, ఒక ఓబీసీ గ్రూపు, ఒక ఎంబీసీ గ్రూపు.. ఇలా దేనిక‌వి ప్ర‌త్యేకంగా చూసుకుంటూ, సొంతంగా ఓటు బ్యాంకుని తయారు చేసుకునే వ్యూహంలో ఉన్న‌ట్టు త‌మిళ రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే, అగ్ర‌కులాల వారికి మాత్ర‌మే భాజ‌పా ప్రాధాన్య‌త ఇస్తుందీ, ఇత‌రుల‌ను ప‌ట్టించుకోదు, ఆ పార్టీలో అవకాశాలూ దక్కవు అనే బలమైన ముద్ర త‌మిళ‌నాట ప్ర‌జ‌ల్లో ప‌డిపోయి ఉంది. దాన్ని చెరుపుకోవ‌డం అంత ఈజీ కాదనేదీ వాస్త‌వం. కానీ, సొంతంగా ఒక బేస్ కోసం భాజ‌పా ప్ర‌య‌త్నాలు ఇక‌పై మ‌రింత ముమ్మ‌రం చేయ‌డం త‌థ్య‌మ‌నే అనిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం కొన్ని ఎంపీ సీట్ల‌నైనా ఈ రాష్ట్రం నుంచి రాబ‌ట్టుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో మోడీ ఉన్నార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. క‌రుణానిధి మ‌ర‌ణం త‌రువాత త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో చోటు చేసుకోబోయే ప‌రిస్థితి ఎలా ఉంటాయో, భాజ‌పా పాత్ర ఏవిధంగా మారుతుందో వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com