ఎపి హౌదా విషయంలో మోడీ ప్రభుత్వ ఉదాసీనతకు ఒక ముఖ్య కారణం రాజకీయంగా బిజెపికి ఏ ప్రయోజనం లేకపోవడం.ఇస్తే చంద్రబాబుకే లబ్ది జరుగుతుందనే అంచనా. ఈ సమస్య ఇప్పుడూ వుంది. పరస్పర విమర్శలతో కొంత పెరిగింది కూడా. అందుకే ప్యాకేజీ ప్రకటన బిజెపి ద్వారా బిజెపి చొరవతో జరిగినట్టు బహిరంగంగా చూపించుకోవాలన్నది కేంద్రం లక్ష్యంగా వుంది. ప్రత్యేక హౌదాకు అవకాశం లేదని ఒకటికి రెండు సార్లు పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కేంద్ర బిజెపి నేతలు తర్వాత చర్చల ప్రహసనం ప్రారంభించారు. ఆ సమయంలోనే పుష్కరాల ఆహ్వానం పేరిట వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కసరత్తులో కాస్త భాగం పంచుకుని తిరిగి వచ్చారు. ఇంతకూ సుజనాచౌదరి అరుణ్‌జైట్లీని కలిశారు, జైట్లీ రాజ్‌నాథ్‌ను కలిశారు ఇద్దరూ కలసి చంద్రబాబును వెంకయ్య సమక్షంలో కలిశారు ఇలా భేటీల పరంపర కొనసాగింది.అవీ ఇవీ కలిపి ఇరవైవేలు లేదా కాస్త అటూ ఇటుగా ఒక ప్యాకేజీ ప్రకటించామనిపించుకోవాలని కేంద్రం తంటాలు పడుతున్నది. సాధించినట్టు కనిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతున్నది. అయితే ఇక్కడే బిజెపి రాజకీయ పాత్రను ప్రధానంగా చూపించుకోవడం కోసం అదేపనిగా చర్చోపచర్చలు నడిపిస్తున్నారు.
ఈసారి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలోనే అన్నీ జరిగినట్టు కూడా ఆయనే మీడియాకు వివరిస్తున్నారు. అయితే రాష్ట్ర పార్టీ అద్యక్షుడి ఎంపిక కూడా పూర్తి చేసుకోలేని అంతర్గత కలహాలు బిజెపిని అక్కడ కుదిపేస్తున్నాయన్నది నిజం. సోము వీర్రాజు, హరిబాబు ఇంకా అనేక పేర్లు చలామణిలో వున్నాయి. వెంకయ్యకు ఇష్టంలేని వారిని ఆయన ఒప్పుకోరు. ఆయన చెప్పిన వారిని ఇతరులు ఆమోదించరు. అందుకే తెలంగాణలో కె.లక్ష్హణ్ ఎన్నికై చాలా కాలమైనా ఎపి ఇంకా ఎడతెగని తర్జనభర్జనగానే వుంది. ఈ లోగా పుష్కరాలు వచ్చాయి . ఇప్పుడు ఏదో ఒక ప్యాకేజీ ప్రకటనైనా రూపొందించి బిజెపి ద్వారానే అది జరిగిందన్న సంకేతాలు స్పష్టంగా అందేలా చూడాలని కేంద్ర రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. కొత్త అద్యక్షుని ఎంపిక, ప్యాకేజీ ప్రకటన ఒకేసారి వుండొచ్చని బిజెపి నాయకులొకరు చెప్పారు. వార్తలు చూస్తుంటే అదే దిశలో వున్నాయి. పోని క్రెడిట్ ఎవరికి దక్కినా ఏపికి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే మంచిదే. ప్రజలు వారికి అర్థమయ్యేది అర్థం చేసుకుని అందుకు తగినట్టే స్పందిస్తారు.