ప‌న్నీరు, ప‌ళ‌ని మ‌ధ్య‌లో కేంద్రం రాజీ ప్ర‌య‌త్నం..!

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోబోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అధికార పార్టీ అన్నా డీఎంకేలో ఉన్న వైరివ‌ర్గాల‌ను ఒక‌టి చేసే ప్ర‌య‌త్నాలు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. ఇవ‌న్నీ ఢిల్లీ డైరెక్ష‌న్ లో జ‌రుగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం! అన్నాడీఎంకేలో రెండు వ‌ర్గాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ తిరుగుబాటు నేత ప‌ళ‌ని స్వామిది ఒక వ‌ర్గం. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా ఉన్న ప‌ళ‌ని స్వామిది రెండో వ‌ర్గం. ఈ రెంటినీ ఒక‌టి చేయాల‌నే ప్ర‌య‌త్నాలు గ‌త కొన్నాళ్లుగా సాగుతూనే ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించిన చ‌ర్చ‌ల ప్ర‌క్రియ త్వ‌ర‌లో మ‌రోసారి మొద‌లు కాబోతోంద‌ని త‌మిళ‌నాట రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కే ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య రాజీ ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.

నిజానికి, గ‌తంలో కూడా ప‌ళ‌ని, ప‌న్నీరు వ‌ర్గాల‌ను క‌లిపేందుకు చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే, ఆ చ‌ర్చ‌ల్లో ఎటూ తేలక‌, అర్ధంత‌రంగా ముగిసిపోయిన సంద‌ర్భాలే ఎక్కువ‌. తిరుగుబాటు నేత అయిన ప‌న్నీర్ సెల్వానికి ప్రాధాన్య‌త ఇచ్చేందుకు.. పార్టీకి చెందిన ఏడుగురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేసి, ఛైర్మ‌న్ బాధ్య‌త‌ల్ని ప‌న్నీరుకు అప్ప‌గించాల‌ని పార్టీ నేత‌ల ఓ అభిప్రాయానికి వ‌చ్చారు. ముఖ్య‌మంత్రిగా ప‌ళ‌ని స్వామి కొన‌సాగుతూ.. పార్టీ క‌మిటీ ఇచ్చే సూచ‌న‌ల్ని పాటిస్తుంటార‌ని అన్నారు. ఈ ప్ర‌తిపాద‌న ఎప్ప‌ట్నుంచో వినిపిస్తూ ఉన్న దిన‌క‌ర‌న్ గ్రూపు వ్య‌తిరేకించ‌డంతో కార్య‌రూపం దాల్చ‌కుండా ఇన్నాళ్లూ గ‌డిచిపోయింద‌ని అంటున్నారు. ఎందుకంటే, దిన‌క‌రన్ వ‌ర్గంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు క‌థ‌నాలు వినిపించేవి. ఈ ప్ర‌తిపాద‌న‌ను ఆ వ‌ర్గీయులు వ్య‌తిరేకిస్తూ ఉండ‌టంతో ఈ ప్ర‌తిపాద‌న మ‌రుగున ప‌డింది. అయితే, ఇప్పుడు ‘దిన‌క‌ర్ వ‌ర్గానికి చెందిన‌వారం మేమే’ అని చెప్పుకునేందుకు చాలామంది నేత‌లు ముందుకు రావ‌డం లేద‌ట‌! బెంగ‌ళూరు జైల్లో రాజ‌భోగాల మ‌ధ్య చిన్న‌మ్మ శ‌శిక‌ళ శిక్ష అనుభ‌విస్తున్న‌ట్టు ఈ మ‌ధ్య క‌థ‌నాలొచ్చాయి. ఈ సౌక‌ర్యాల క‌ల్ప‌నార్థం దాదాపు రెండు కోట్ల రూపాయాలు లంచాలిచ్చారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతో వారు నోరు మెద‌ప‌డం లేదట‌.

దీంతో ప‌ళ‌ని స్వామి, ప‌న్నీరు సెల్వ‌మ్ వ‌ర్గాల‌ను ఒక‌టి చేసేందుకు ఇదే స‌రైన త‌రుణ‌మ‌ని ఢిల్లీ పెద్ద‌లు భావించి, మంత్రాంగం మొద‌లుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా ప‌ళ‌ని స్వామి ఢిల్లీకి వెళ్లారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో చ‌ర్చ‌లు జ‌రిపారు. అధికారికంగా ఆయ‌న ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటే… నీట్ ప‌రీక్ష‌ల నుంచి త‌మిళ‌నాడుకు మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరడానికి! ఇక‌, అన‌ధికారికంగా ఆయ‌న ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటే.. పార్టీలోని అంత‌ర్గ‌త సంక్షోభంపై ప్ర‌ధానితో చ‌ర్చించ‌డానికి! ఇదే అంశ‌మై ప్ర‌ధానితో దాదాపు ఓ అర్ధ‌గంట‌సేపు ర‌హ‌స్య మంత‌నాలు సాగించారు. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ప్ర‌ధాని అడిగి తెలుసుకున్నార‌ట‌. అంతేకాదు, పార్టీ పాల‌నా వ్య‌వ‌హారాల‌ను చూసుకునే క‌మిటీని నియ‌మించి, దాని బాధ్య‌త‌ల్ని ప‌ళ‌నికి అప్ప‌గించేందుకు ఆ వ‌ర్గం సుముఖంగా ఉన్న‌ట్టు ఢిల్లీ పెద్ద‌ల‌కు తెలిపార‌ట‌. సీఎంగా ప‌ళ‌ని స్వామిని కొన‌సాగించేందుకు కూడా ఓపీయ‌స్ వ‌ర్గం అభ్యంత‌రం తెల‌ప‌లేద‌నీ చెబుతున్నారు. మొత్తానికి, ఢిల్లీ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో క‌దిల‌క క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.