పాయింట్‌ బ్లాంక్‌ – బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ వ్యాఖ్యలపై నోటీసు

మాజీ సిఎస్‌ రమాకాంతరెడ్డితో సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటర్వ్యూ వారి బాస్‌ జగన్‌ మోహన రెడ్డి బెయిలును తిరగదోడేంతవరకూ వెళ్లింది. అయితే ఆ ఛానల్‌ నిర్వహణతో తనకు సంబంధం లేదని, ఇంటర్వ్యూల వంటివి తాను నిర్ణయించనని చెప్పి జగన్‌ బయిటపడ్డారు.అది నిజమే కావచ్చు. బెయిలు రద్దుకు అది పెద్ద కారణం కాకపోవచ్చు. గాని సాక్షితో తనకు సంబంధం లేదని జగన్‌ చెబితే ఎవరు ఒప్పుకుంటారు? అందుకే ఆ తర్వాత వారు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక మరో వైపున సోషల్‌ మీడియాలో పోస్టింగుల పేరిట చంద్రబాబు ప్రభుత్వ వేట కొనసాగుతూనే వుంది. తాజాగా బెంగుళూరులో ఒకరిని అరెస్టు చేశారట.

కొమ్మినేని తర్వాత ఎన్‌టివిలో టాక్‌షో చేస్తున్న యువ ప్రెజంటర్‌ రిషి పాయింట్‌ బ్లాంక్‌ పేరిట ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటారు. ఈ నెల 7న ఆయన హైదరాబాద్‌ ఘోషామహల్‌కు ప్రాతినిధ్యం వహించే బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌తో ముఖాముఖి జరిపారు. రాజాసింగ్‌ కవ్వింపు రాజకీయాలు రెచ్చగొట్టే బెదిరింపులపై సూటిగానే ప్రశ్నించారు. దాంతో ఆయన మా నమ్మకాలను అవమానిస్తే చంపుతాం చంపుతాం అని ఒకటికి రెండు సార్లు అన్నారు. ఇతరత్రా కూడా చాలా దూకుడుగా అభ్యంతర కరంగా మాట్లాడారు. దీనిపై అయిదు రోజుల తర్వాత మీర్‌చౌక్‌ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసు పంపించారు. మతసామరస్యానికి విఘాతం కలిగించే విదంగా మాట్లాడటంపై వివరణ ఇవ్వాలని పేర్కాన్నారు. ఉత్తరాదిలో కొంతమంది మాట్లాడేతీరును గుర్తు చేసిన రాజాసింగ్‌ మాటలతో తమకు సంబంధం లేదన్నట్టు బిజెపి చెబుతుంటుంది గాని ఆయన మాత్రం తను ఆ పార్టీలోనే వున్నానని ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తను ఎదిగిపోవడం సహించలేక కిషన్‌రెడ్డి హయాంలో దూరం పెట్టారని లక్ష్మణ్‌ వచ్చాక ఏ సమస్య లేదని స్పష్టంగా చెప్పారు. అంటే ఈ మాటలన్నీ కూడా బిజెపి అభిప్రాయాలే. మరి ఇప్పుడు ఆయన ఏం చెబుతారో బిజెపి ఎలా సమర్థిస్తుందో చూడాల్సిందే.

ఇది ఇలా వుంటే ప్రాంతీయ సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుడు నందనం దివాకర్‌ జబర్దస్త్‌ షోలో బూతులు ఆపాలంటూ బాలనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాసనసభ్యురాలుగా వున్న రోజా వీటిలో పాలు పంచుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరో గెస్ట్‌ నాగబాబుపైనా ఫిర్యాదు పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com