తెలకపల్లి వ్యూస్ : మెగా బ్రదర్స్‌పై బిజెపి కథలు కథలే!

పవన్‌ కళ్యాణ్‌ బిజెపిలో చేరవచ్చని ఆ పార్టీ నేతలు చాలా కాలంగా కథలు వదులుతున్నారు. ఈ మధ్యనైతే పవర్‌ స్టార్‌తో పాటు మెగా స్టార్‌ చిరంజీవి కూడా చేరే అవకాశం వుందని ప్రముఖ ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. చిరంజీవి దాన్ని కొట్టిపారేసినా కొంతమంది మాత్రం ఏదైనా సంభవమే అంటూ ఇంకా ఆ వూహాగానాలు సజీవంగా వుంచుతున్నారు.

ఎకాఎకిన ప్రభుత్వంలోకి రావచ్చన్న అంచనాతోనే చిరంజీవి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లోపోటీ చేశారు. అప్పటికి రాజకీయ శూన్యం లేకపోయినా సామాజిక సమీకరణలు సినిమా ఆకర్షణ కలిసి బాగానే వోట్లు తెచ్చాయి. సీట్లు అనుకునన్ని రాలేదుగాని వచ్చినవీ మరీ తక్కువ కాదు. ఆయనే పోటీ చేసిన ఒక చోట ఓడిపోవడం కొంత దెబ్బే అయినా తన గ్లామర్‌ కారణంగా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కాని తర్వాత ఆ పార్టీని హడావుడిగా కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజకీయ అస్తిత్వం కోల్పోయారు. ఆపైన విభజన ఉద్యమాల గజిబిజిలో కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశించి చివరి వరకూ ఆ పార్టీతోనే వున్నారు. వుంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ జనసేన స్థాపించడం ఒకటైతే ఎన్నికల ముందే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలసి రావడం ద్వారా అటు మొగ్గారు. చే గువేరా ఐకాన్‌తో బయిలుదేరిన పవన్‌ మితవాద మతవాద పార్టీతో కలవడం ఏమిటన్న విమర్శలు వచ్చినా ఖాతరు చేయక తను ఎన్నికల్లో పోటీ చేయకుండానే టిడిపి బిజెపి కూటమికి స్టార్‌ కాంపైనర్‌గా ఉపకరించారు. అయితే తర్వాత ఆ ప్రభుత్వానికి వాచ్‌డాగ్‌లాగా పనిచేస్తారన్న వాగ్దానం మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. ఒక్కసారి భూములు సమీకరణపై పర్యటన జరిపారు గాని చివరికి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానే ముగించారు. కేంద్రం సాయంపైన గాని, కాపుల ఆందోళన పైన గాని ఆయన మాటలు ఆఖరుకు అలాగే వుండటరతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేదనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది. వెళ్లేప్పుడు గబ్బర్‌సింగ్‌లావెళ్లి వచ్చేప్పుడు సిద్ధప్పలాగా రావడమెందుకని ఆయన సినిమా భాషలోనే నేను సరదాగా అన్నాను. తర్వాత కేంద్రం నుంచి రావలసిన ప్రత్యేక హోదా ప్యాకేజీల విషయంలోనైతే ఆ మాత్రం కూడా చేయకుండా మిన్నకుండి పోయారు.

మూడు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ పూర్తికావడానికే మూడేళ్ల వరకూ పట్టిందనుకుంటే మూడు సినిమాలకు మరెంత సమయం పడుతుందో లెక్కేసుకోవాలి. కనీసం మూడేళ్లనుకుంటే ఎన్నికల ముందు రంగంలోకి వస్తారా? అలా ఆఖరు నిముషంలోవచ్చేస్తే ప్రజలు ఆమోదిస్తారా? ఇదంతా తన వ్యక్తిగత వ్యవహారంగా నడుస్తుంటే చిరంజీవి వంటి మెగాస్టార్‌ ఎందుకు చేతులు కలుపుతారు?

ఇవన్నీ జరిగాయనుకున్నా కోరికోరి బిజెపిలో ఈ సోదరులు ఎలా ఎందుకు చేరతారు? ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలం ఎంత పరిమితమో సమీప భవిష్యత్తులో కూడా వారి అవకాశాలు ఎంత నామమాత్రమో అందరికీ తెలుసు. వాజ్‌పేయి, మోడీలకు అనుకూలంగా వచ్చిన వాతావరణం చంద్రబాబు రెండు సార్లు ముఖ్యమంత్రి కావడానికి తోడ్పడిందంటే ఆ పార్టీకి వున్న యంత్రాంగం కారణం తప్ప బిజెపి పునాది కాదు.

అసహనం, విద్వేష ప్రచారాల వివాదాలు, హెచ్‌సియు జెఎన్‌యు సంక్షోభాల నేపథ్యంలో మోడీ ప్రాభవం తగ్గుదల తప్ప ఎక్కడా పెరుగుతున్న దాఖలాలే లేవు. అసలే ఆచితూచిఅడుగులేసే అన్నదమ్ములు ఈ సమయంలో కమలం జట్టులో చేరడం వూహకందని విషయం. రజనీ కాంత్‌ గురించి కూడా ఇలాటి కథలే తమిళనాడులో ప్రచారమయ్యాయి గాని ఎన్నికల్లో ఆయన ఆ వూసే తీసుకురాలేదు. తెలుగునాట కూడా ఈ కథలు కంచికి పోవలసిందే గాని నిజమయ్యే అవకాశం లేదు. ఉన్నా మల్టీస్టార్‌ ఫార్ములా అసలు వర్కవుట్‌ కాదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com