ఆంధ్రలో భాజపా డ్రామాలు ఇంకానా? ఇకపై చెల్లవు !

పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగినంత మాత్రాన చూసేవాళ్లు చూడకపోరు. కేంధ్రంలో అధికారం చెలాయిస్తున్న భాజపా వ్యవహారం ఇలాగే వుంది. తాము చేస్తున్న ఘనకార్యాలు, తాము రచిస్తున్న రాజకీయ వ్యూహాలు జనం గమనించడం లేదనుకుంటోంది. కానీ తమిళనాట ఓటర్లు భాజపాకు ఝలక్ ఇచ్చి చెక్ చెప్పారు. ఒక విధంగా ఇది ఆంధ్రలోని భాజపా జనాలకు కూడా ఓ పాఠం.

తమిళనాట ఏం జరిగింది? జయలలిత ఆసుపత్రిలో చేరింది మొదలు, చనిపోయేవరకు, ఆ తరువాత అన్నాడిఎంకె వర్గాలతో భాజపా ఏ విధంగా ఆడుకుందో జనాలకు తెలియంది కాదు. గవర్నర్ ఏ విధంగా వ్యవహరించారో కూడా తెలిసిందే. భాజపా ఇందులో తనకేం ప్రమేయం లేదు, అక్కడ ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు అనే భ్రమను కల్పించానని అనుకుంది. విశాల్ పోటీ చేస్తానంటే జరిగిన తంతు తెలిసిందే. ఇవన్నీ జనం గమనించారు. సరైన టైమ్ లో భాజపాకు చెళ్లుమనే జవాబు నిచ్చారు.

తమిళ జనాలు తెలివైన వారు. ఎక్కడన్నా బావే కానీ, వంగతోటలో కాదన్నట్లు, మిగిలిన వ్యవహారాలు ఎలా వున్నా, రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి జాతీయపార్టీలను పక్కన పెడుతున్నారు. అలాంటిది రాష్ట్ర రాజకీయాల్లో డ్యాన్స్ ఆడేద్దామని భాజపా అనుకుంటే ఊరుకుంటారా? పైగా డిఎంకె తో కలిసి చిన్న తెరచాటు రాజకీయం చేద్దామని అనుకుంది భాజపా. దాన్నీ పసిగట్టి పక్కన పెట్టారు.
ఇది ఆంధ్రకూ పాఠమే

ఆంద్రలో భాజపా తాను లేస్తే మనిషిని కాదంటోంది. నిజానికి భాజపా తెలుసుకోవాల్సింది చాలా వుంది. విభజన పాపం భాజపాకు వుంది. అయితే వెంకయ్య నాయుడు కోసం, భాజపాతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కోసం మన మీడియా ఆ విషయాన్ని సక్సెస్ ఫుల్ గా దాచేసి, మొత్తం పాపాన్ని కాంగ్రెస్ ఖాతాలోకి విజయవంతంగా తోసేసింది. దాంతో జనం తమను ఆమోదించేసారని భాజపా నేతలు కలలు కంటున్నారు. మరోపక్క రాష్ట్రానికి భాజపా ఏం చేస్తోందో? ఏం చేయలేదో? అర్థం అవుతూనే వుంది. కానీ దానిమీద గట్టిగా దృష్టి పెట్టడం లేదు. ఒకసారి తెలుగుదేశంతో పొత్తు ఫట్ అని తెగిన మరుక్షణం మన మీడియా ఒళ్లు విరుచుకుంటుంది. భాజపా వ్యవహారాలను ఏకరవు పెడుతుంది.

అప్పుడు భాజపాను కూరలో కరివేపాకు మాదిరిగా జనాలు పక్కన పెడతారు. పైగా ఆంధ్రలో భాజపా అంటే చిరకాలంగా తెలుగుదేశం పార్టీ 2 నే కానీ వేరు కాదు. అలాంటిది తెలుగుదేశం పార్టీకి దూరం జరిగితే, అందులో వున్న దేశం జనాలు అంతా జారుకుంటారు. గట్టిగా పది ఓట్లు కూడా తేలేని జనాలే మిగుల్తారు.

కానీ అమిత్ షా కలలు వేరుగా వున్నాయి. తెలుగుదేశంతో కలిసి వుంటూనే, భాజపా బలాన్ని పెంచేసుకోవచ్చని, అవసరమైనపుడు తెగతెంపులు చేసుకుని, వైకాపాతోనో, మరొ పార్టీతోనో ముందుకు వెళ్లిపోయి బోలెడు సీట్లు బేరమాడి తెచ్చుకోవచ్చని అనుకుంటోంది. కానీ అది సరైన ఆలోచన కాదని ఇప్పుడు తమిళనాడు పాఠం చెబుతోంది. పైగా ఈ పాఠం భాజపాకు మాత్రమే కాదు. వీలయితే ఆంధ్రలో దాంతో పొత్తు పెట్టుకోవాలనుకున్న వైకాపాకు కూడా.
తెలుగుదేశంతో పొత్తు తెగిన మరుక్షణం భాజపా బండారం మన మీడియాలో బద్దలవుతుంది. జనం దాన్ని పక్కన పెట్టడం కాకుండా, దాంతో అంటకాగితే కనుక వైకాపాను కూడా పక్కన పెడతారు. అందువల్ల భాజపా తన బలాన్ని ఎక్కువ అంచనా వేసుకోవడం అనవసరం. అలాంటి పార్టీతో వెళ్లాలన్న ఆలోచన వైకాపాకు అంతకన్నా అనవసరం.

చిత్రగుప్తుడు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.