వెంక‌య్య మెడ‌లో ప‌వ‌న్ గంట‌!

ఏంటిద‌నుకుంటున్నారా.. ఇది అర్థం కావాలంటే కొన్ని నెల‌లు వెన‌క్కి వెళ్ళాలి. బీజేపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి, ఏపీలో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ఇతోధికంగా సాయ‌ప‌డిన త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను కలుసుకునేందుకంటూ కొన్ని స‌భ‌లు నిర్వ‌హించారు. మొద‌టి స‌భ‌లోనే ఆయ‌న బీజేపీపై విరుచుకుప‌డ్డారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌నీ.. దాని బ‌దులు రెండు పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చారనీ విమ‌ర్శించారు. ప‌నిలో ప‌నిగా వెంక‌య్య‌నాయుడుగారిపైనా సెటైర్లు వేశారు. సెటైర్లేం ఖ‌ర్మ నేరుగానే క‌ఠిన ప‌ద‌జాలాన్ని వాడారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా గురించి వెంక‌య్య చేసిన బాస‌లేమ‌య్యాయనీ ప్ర‌శ్నించారు. దానికి వెంక‌య్య కౌంట‌ర్లు కూడా ఇచ్చారు. కొన్నాళ్ళ‌కు ఇద్ద‌రూ సైలెంట‌య్యారు. ఆప్త మిత్రుల క‌ల‌హానికీ… ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ వెంక‌య్య నాయుడును ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా చేయ‌డానికీ సంబంధ‌ముందంటున్నారు విశ్లేష‌కులు.

వెంక‌య్య నాయుడు కార‌ణంగానే ఏపీలో బీజేపీ ఎద‌గ‌లేక‌పోతోంద‌నీ, పార్టీని ఆలంబ‌న‌గా చేసుకుని ఆయ‌న మాత్రం ఉన్న‌త స్థానాల‌ను అధివ‌శిస్తున్నార‌నీ పార్టీలో త‌ర‌చూ విమ‌ర్శ‌లు వినిపించేవి. క‌నీసం పార్టీ రాష్ట్ర శాఖ‌కు అధ్య‌క్షుని నియ‌మించుకోవాల‌న్నా చంద్ర‌బాబు, వెంక‌య్య‌ల ఆమోదం అవ‌స‌ర‌మ‌న్న స్థాయికి ఆ విమ‌ర్శ‌లు చేరాయి. ఏపీ క్యాబినెట్లో బీజేపీ మంత్రులు సైతం టీడీపీ మంత్రుల్లానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ అనుకునే స్థాయికి రెండు పార్టీల సంబంధాలూ చేరాయి. వెంక‌య్య‌ను రాష్ట్ర వ్య‌వ‌హారాల్లో త‌లదూర్చ‌కుండా చేస్తే త‌ప్ప పార్టీ మెరుగుప‌డ‌ద‌నే నిర్ణ‌యానికి అధిష్టానం వ‌చ్చింద‌నీ, అందుకు పునాదిగానే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉసిగొల్పార‌నీ.. ఆ విమ‌ర్శ‌ల‌కు, స్థానిక నాయ‌కుల ఆరోప‌ణ‌లు తోడ‌వ్వ‌డంతో ఏం చేయాలా అని పార్టీ అధినాయ‌క‌త్వం త‌ల‌ప‌ట్టుకుంద‌నీ తెలుస్తోంది. వెంకయ్య‌లాంటి సీనియ‌ర్ నేత‌ను రాష్ట్రంపై ప్ర‌భావం చూప‌కుండా ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. ఆయ‌న‌కున్న ప‌ట్టు అలాంటింది. ప‌ట్టెంత ఉందో వ్య‌తిరేక‌తా అంతే ఉంద‌న్న విష‌యాన్ని వెంకయ్య గ‌మ‌నించుకోలేక‌పోయారు. గ‌మ‌నించుకున్న‌ప్ప‌టికీ.. అధిష్టానానికి తాను ఎంత చెబితే అంత కాబ‌ట్టి.. త‌న‌ను త‌ప్పించే ప‌రిస్థితి ఉండ‌ద‌ని భావించారు. ఈ ఆలోచ‌నే ఆయ‌న‌ను త‌ప్పులో కాలేసేలా చేసింది. అధిష్టానానికి ఆలోచించుకునే వెసులుబాటు ఇచ్చింది. ముఖ్య‌మంత్రితోనూ, ప్ర‌ధాన మీడియాతోనూ ఆయ‌న‌కు ఉన్న స‌న్నిహిత సంబంధాలు వెంక‌య్య‌ను మ‌రింత బ‌లోపేతం చేశాయి. రాష్ట్రంలో ఏం జ‌రిగినా ఇట్టే త‌న‌కు చేరిపోయేది.

పిల్లి వ‌స్తోంద‌ని తెలియాలంటే దాని మెడ‌లో గంట క‌ట్టాలి. ఎవ‌రు గంట క‌ట్టాలీ అని త‌ర్జ‌న‌భర్జ‌న ప‌డిన అనంత‌రం ఆ బాధ్య‌త‌ను వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అప్ప‌జెప్పిన‌ట్టు తెలుస్తోంది. అంతే ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఆయ‌న త‌న ప‌నిని పూర్తిచేశారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఏపీకి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వెంక‌య్య వ్య‌తిరేక వ‌ర్గం ఆయ‌న చెవిలో గూడుక‌ట్టుకుని మ‌రీ పితూరీలు చెప్పేవారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన బూత్ స్థాయి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో అయితే ఒక గ్రూపు బ‌హిరంగంగానే వెంకయ్య‌పై అసంతృప్తిని వెళ్ళ‌గ‌క్కింది. ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించింది. స్వ‌యంగా వెంక‌య్య క‌ల్పించుకుని, ఇది బీజేపీ ప‌ద్ధ‌తి కాద‌నీ, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించాల‌నీ ప‌దేప‌దే విజ్ఞ‌ప్తి చేయాల్సి వ‌చ్చింది. త‌న‌ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ తంతును అమిత్ షా తేలిగ్గా తీసిపారేయ‌లేరు క‌దా. పైగా అవ‌కాశం కోసం చూస్తున్నారాయే. అప్ప‌టి నుంచి స‌మ‌యం కోసం చూడ్డం ప్రారంభించింది అధిష్టానం. పార్టీ జాతీయాధ్య‌క్షునిగా ప‌నిచేసిన‌, వెంక‌య్య వంటి అనుభ‌వ‌జ్ఞుడ్ని అవ‌మానించి పంప‌డానికి అది కాంగ్రెస్ పార్టీ కాదు. సుశిక్షిత‌మైన ఆర్ఎస్ఎస్ మూలాల‌పై నిర్మాణ‌మైన పార్టీ. వాడుకుని వదిలేసే సంస్కృతి త‌నకి లేదు. గౌర‌వ‌ప్ర‌దంగానే ఆయ‌న్ను ఏపీలో అడ్డు తొల‌గించుకోవాల‌నుకుంది. అంత‌కంటే గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని నిర్ణ‌యించింది. దేశ రెండో పౌరుని హోదాను క‌ట్ట‌బెట్టే ఈ ప‌ద‌వి వ‌ల్ల ఆయ‌న‌కు పార్టీ సంబంధాలుండ‌వు. అంద‌రూ స‌మాన‌మే. క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల్సిన త‌రుణ‌మూ కాద‌ని ఆయ‌న త‌న నిరాస‌క్త‌త‌నూ వెళ్ళ‌బుచ్చారు. స్వ‌యంగా ప్ర‌ధాని పూనుకోవ‌డంతో వెంక‌య్య‌నాయుడుకు ఒప్పుకోక త‌ప్పింది కాదు. అపార అనుభ‌వ‌జ్ఞుడు, అసాధార‌ణ వాక్చాతుర్య‌మూ గ‌ల వెంక‌య్య సేవ‌లు బ‌లం త‌క్కువున్న రాజ్య‌స‌భ‌లో వినియోగించుకోవ‌డానికి మోదీ మొగ్గుచూప‌డం ఆయ‌న్ను ఏపీకి రాజ‌కీయంగా దూరం చేసింది.

ఇక‌, జ‌ర‌గ‌బోయేదేమిటో చిత్రం స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో బీజేపీ నేరుగా పొత్తు పెట్టుకోవ‌చ్చు. టీడీపీ మైత్రిని వీడి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌చ్చు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటుకు ప్ర‌స్తుతం బీజేపీ పావులు క‌దుపుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని వాడుకుని ఏపీలో క‌మ‌ల వికాసానికి త‌లుపులు తెర‌వ‌చ్చు.. ఇదంతా ఊహే. ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు. వేచి చూడాల్సిందే.
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com