హామీలు ఇవ్వలేదంటే పోలా..? బ్లాక్‌మనీ, ప్రత్యేకహోదాపై బీజేపీ యూటర్న్‌..!!

భారతీయ జనతా పార్టీకి 2014 ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ రావడానికి ఆ పార్టీ ఇచ్చిన అసాధ్యమైన హామీలే కారణం. నరేంద్రమోదీని బాహుబలిలా చూపించి… ఆయన అవన్నీ నెరవేర‌్చగలరని.. చూపించడం వల్లే బీజేపీకి భారీగా ఓట్లు, సీట్లు వచ్చాయి. అందులో ప్రధానమైన హామీలుగా రెండింటిని చెప్పుకోవచ్చు. దేశం మొత్తం తీసుకుంటే.. బీజేపీ ఇచ్చిన నెంబర్ వన్ హామీ బ్లాక్‌మనీని తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పడం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి … ప్రత్యేకహోదాను ఇస్తామని చెప్పడం. ఈ రెండు హామీల విషయంలో ఇప్పుడు బీజేపీ పూర్తిగా రూటు మార్చేసింది.. ఎంతలా అంటే.. అసలు అలాంటి హామీలే ఇవ్వలేదంటోంది.

“కాంగ్రెస్ నేతలు దేశాన్ని దోచుకున్నారు. వారంతా నల్లడబ్బును విదేశాల్లో దాచుకున్నారు. ఆ నల్లడబ్బును వెనక్కి తీసుకొచ్చి.. ప్రజల అకౌంట్లలో వేస్తా. ఒక్కొక్కిరికి రూ. 15 లక్షలు వస్తాయి..” ఇదీ గత ఎన్నికల ముందు ప్రధాని మోదీ చాలా బహిరంగసభల్లో చెప్పిన విషయం. ఇదేమీ ఆషామాషీగా చెప్పడం లేదని.. ఆ పార్టీ నేతలు.. కొన్ని లెక్కలు చెప్పారు. మొత్తం రూ. 71 లక్షల కోట్ల భారతీయుల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ఉందని.. బీజేపీ నేతలే ప్రకటించారు. ఎన్నికల తర్వాత … బ్లాక్‌మనీని వెనక్కి తెచ్చేందుకు కేంద్రం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. దేశీయ నల్లధనాన్ని అరి కడతామంటూ నోట్ల రద్దు చేశారు. దాని వల్ల రూ.70 వేల కోట్లకుపైగా నల్లధనం వెలికి తీశామని మోదీ చెబుతున్నారు. కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం.. కొత్త నోట్ల ప్రింటింగ్‌కు చేసిన ఖర్చులు కూడా వెనక్కి రాలేదు.

ఈ హామీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కొన్నాళ్ల కిందట.. స్పందించారు. ప్రధాని హామీ ఇచ్చిన మాట నిజమేనైనా.. అది సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసని.. అదోక రాజకీయ జుమ్లా అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా.. అసలు ప్రధాని మోదీ అలాంటి హామీనే ఇవ్వలేదని… ప్రకటించేశారు. దాంతో ఈ హామీ ఓ జుమ్లా అని నేరుగా ప్రకటించేసినట్లయింది.

ఇదే కాదు.. ఏపీకి సంబంధించిన ప్రత్యేకహోదా విషయంలోనూ… బీజేపీ ఇదే తరహా వ్యూహం అమలు చేస్తోంది. ప్రధాని మోదీ.. ఇచ్చిన హామీల వీడియోలను చంద్రబాబు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రదర్శిస్తున్నారు. దీంతో.. అసలు ప్రధాని ప్రత్యేకహోదా హామీ ఇవ్వలేదన్న ప్రచారాన్ని ఏపీ బీజేపీ నేతలు కింది స్థాయిలో ప్రారంభించారు. కొద్ది రోజుల కిందట.. తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి… ప్రత్యేకహోదా హామీ మోదీ ఇవ్వలేదని.. తిరుపతిలో ఎన్నికల ప్రచారసభలో.. ఎవరో పేపర్‌పై రాసిస్తే చదివారని చెప్పుకొచ్చి … కలకలం రేపారు. ఆ తర్వాత విష్ణుకుమార్ రాజు లాంటి బీజేపీ నేతలు మరో అడుగు ముదుకేసి.. ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్నవి..మార్ఫింగ్ వీడియోలను.. మోదీ అసలు ఆ హామీ ఇవ్వలేదని చెప్పేశారు.

ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో.. బీజేపీ నేతల ప్రయత్నాలు చూస్తూంటే.. గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చి పెట్టిన హామీలను నేరవెర్చడం కన్నా.. అసలు ఇవ్వలేదని చెబితేనే బాగుంటుందని డిసైడయ్యారు. హామీలను అమలు చేయలేదన్న చెడ్డ పేరు కన్నా… అసలు ఇవ్వలేదని చెప్పి మోసం చేయడమే ఈజీ అనుకుంటున్నట్లున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.