బీజేపీ పాచిక ఇప్పుడైనా పారుతుందా!

అధికారం కోసం ఆబ‌గా కాచుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ప‌రిణామాలు ఆనందాన్నే క‌లిగిస్తుంటాయి. జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాట పాగా వేయాల‌ని ప‌న్నీర్ సెల్వాన్ని దువ్వి.. అత‌గాడి బ‌ల‌మెంతో తెలిసిపోయాక గ‌మ్మునుండి పోయింది. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డానికి అన్ని ర‌కాల ఎత్తుల్నీ ప్ర‌యోగించింది. జ‌ల్లిక‌ట్టు.. కావేరీ… ఇలా ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోలేదు. కానీ త‌మిళుల ప‌ట్టుద‌ల ముందు త‌లొంచేసింది. ఆ విష‌యం తెలిస్తే అవ‌మాన‌మ‌నుకుంటూ చూసీ చూడ‌న‌ట్టు న‌టించేసింది. ఆ పార్టీ నేత‌లు అవున‌న్నా కాద‌న్నా…ఓపీఎస్ లేదా శ‌శిక‌ళ‌ల‌ను గుప్పెట్లో పెట్టుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కావేరీ వివాదాన్ని రెచ్చ‌గొట్టి, ప్ర‌శాంత‌మైన బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో నిప్పులు మండేలా చేసింది. త‌మిళ‌నాడు రిజిస్ట్రేష‌న్ వాహ‌నాలు ఆ న‌గ‌రంలో కొద్దిరోజుల‌పాటు బ‌య‌ట‌కు రాలేదంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా త‌యారైందో తేలిగ్గా ఊహించేయొచ్చు. అనంత‌రం జ‌ల్లిక‌ట్టుపై సుప్రీం తీర్పు ఆధారంగా మ‌రోసారి ఆడుకోవాల‌నుకుంది. త‌మిళులు స్థిత‌ప్రజ్ఞులు…ఒక‌రికి త‌లొంచ‌ని వారూ కాబ‌ట్టి.. మెరీనా బీచ్‌లో ఏక‌ధాటిగా అలాగే కూర్చుని నిర‌స‌న తెల‌ప‌డంతో కేంద్రానికి దిగిరాక త‌ప్ప‌లేదు. ఈ అంశాల‌ను బీజేపీ అంగీక‌రించ‌క‌పోవ‌చ్చు.. మాకు సంబంధం లేద‌ని ఖండించ‌నూ వ‌చ్చు. బ‌ల‌హీనుడు సీఎంగా ఉన్న త‌రుణంలో సాఫీగా అక్క‌డ పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నించిన మాట మాత్రం వెయ్యి శాతం వాస్త‌వం.

శ‌శిక‌ళ జైలు పాలైన అనంత‌రం ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు ఇంకా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. అవినీతిని తుద‌ముట్టించ‌డ‌మ‌నే ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయాల‌లో పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ల‌క్ష్యం చేసుకుంది. ఎక్క‌డ చూసినా ఏఐఏడీఎంకే మూలాలే బ‌య‌ట‌ప‌డుతుండ‌డాన్ని ఆధారంగా చేసుకుని ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా డ‌బ్బు పంచిపెట్ట‌డానికి శ‌శిక‌ళ వ‌ర్గం వేసిన ప్ర‌ణాళిక‌ను వ్యూహాత్మ‌కంగానూ, స‌మ‌యం చూసీ గురి చూసి వాడుకుంది. ఫ‌లితంగా ఆ ఉప ఎన్నిక వాయిదా ప‌డింది. శ‌శిక‌ళ వ‌ర్గం 89 కోట్ల రూపాయ‌ల‌ను ఓట‌ర్ల‌కు పంచేందుకు రూపొందించిన వ్యూహం ఐటీ దాడుల‌లో వెల్ల‌డైంది. ఇందులో త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి విజ‌య‌భాస్క‌ర్ కీల‌క‌మ‌ని తేల‌డంతో ఈ వ‌ర్గంలో తాజా లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. ఆయ‌న్ని వ‌దిలించేసుకుని అప‌ప్ర‌ధ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని పార్టీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. సీనియ‌ర్లంతా విజ‌య‌భాస్క‌ర్‌ను పార్టీ నుంచి సాగ‌నంపాల‌ని డిమాండ్ చేస్తుండ‌గా.. ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిసామి మాత్రం ముగ్గురు మంత్రులు బ‌య‌ట‌కెళ్లాల‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌శిక‌ళ వ‌ర్గం రెండుగా చీలిపోయింది. ఇదెక్క‌డికి దారితీస్తుందో సామాన్యుడికి క్లారిటీ లేక‌పోయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయ పార్టీల‌కు మాత్రం స్ప‌ష్ట‌త వ‌చ్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. న‌డిపించే నేత లేని అనాధ‌గా ప్ర‌స్తుతం అన్నా డీఎంకే కొట్టుమిట్టాడుతోంది. తాజా ఐటీ దాడుల కార‌ణంగా శ‌శిక‌ళ‌కు జైలులో సౌక‌ర్యాలు త‌గ్గిపోయాయి. అమెకు ములాఖ‌త్‌ల‌ను కూడా 15రోజుల‌కొక‌సారి మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆమెను ఎప్పుడు ప‌డితే అప్పుడు క‌లుసుకుని స‌ల‌హాలు పొందేందుకు అవ‌కాశ‌ముండేది.

ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక పూర్త‌య్యి దిన‌క‌ర‌న్ గ‌ట్టెక్కుంటే పార్టీని ఒకే గాట‌న కట్టుంచే నాయ‌కుడుగ‌గా త‌యార‌యి ఉండేవారు.
వేడిగా ఉన్న‌ప్పుడే ఇనుమును సుత్తి కొట్టి వంచాల‌నే సూత్రాన్ని ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ అనుస‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ద‌క్షిణాదిలో ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్‌లో టీడీపీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ.. వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క అసెంబ్లీలో గెలిచే అవ‌కాశాలు ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తున్నాయి. మ‌రో వంక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కూ బీజేపీని కాద‌నే వ్య‌వ‌హరించే అవ‌స‌రం లేదు. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితోనే ఆయ‌న వెడుతున్నారు. రాజ‌కీయ అనిశ్చితితో వేడిగా ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడే ఏదో ఒక‌టి చేయాల‌నే యోచ‌న ఆ పార్టీలో బ‌లంగా క‌నిపిస్తోంది. ప్ర‌య‌త్నిస్తే పోయేదేం లేదు క‌దా అనే వైఖ‌రితో సాగుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఊహాతీత విజ‌యం ఆ పార్టీ ఆత్మ‌విశ్వాసాన్ని రెట్టింపు చేసేసింది. డీఎంకే ఎటూ లొంగే అవ‌కాశం లేదు కాబట్టి, బ‌ల‌హీనంగానూ, నాయ‌క‌త్వ లేమితోనూ ఉన్న అన్నా డీఎంకేను త‌న గుప్పెట్లో పెట్టేసుకోవాల‌ని ఆరాట ప‌డుతోంది బీజేపీ. 2019 ఎన్నిక‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఒంట‌రిగా పోటీ చేసేస్తామ‌ని ఇప్ప‌టికే బీజేపీకి చెందిన ఓ నేత ప్ర‌క‌టించారు. పార్టీ ప‌ప్పులు ఎక్క‌డైనా ఉడుకుతాయేమో గానీ, ఆత్మ‌విశ్వాసం..ఆత్మాభిమానం మెండుగా ఉన్న త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ల్లో చెల్ల‌వు. న‌క్క‌జిత్తుల‌ను ఎప్ప‌టికప్పుడు ప‌సిగ‌ట్టి తిప్పికొట్టే నైజం త‌మిళుల‌ద‌ని మ‌ర‌వ‌రాదు. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఎన్నిక‌ల్లోనే కాదు ఆంధ్రులు నిద్ర‌లోనూ మ‌రువ‌ర‌ని ఆ పార్టీ గుర్తు పెట్టుకోవాలి. ఆంధ్ర‌లో బీజేపీ ఒంట‌రిగా పోటీ చేయ‌డం టీడీపీకే లాభం. ఎందుకంటే.. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు కాబట్టే వ‌దిలించేసుకున్నామ‌ని ప్ర‌చారం చేసుకుని ల‌బ్ధి పొంద‌డానికి వీలుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com