జనసేన పార్టీకి తాత్కాలికంగా దూరంగా ఉంటానని విశాఖకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ అనే మేధావి పవన్ కల్యాణ్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ తెల్లకాగితం మీదనే ఉంది. కనీసం తాను జనసేన లో కీలక నేత..ఫలానా పదవి ఉందని లెటర్ ప్యాడ్ మీద కూడా లేదు. ఆ లేఖలో తాను జనసేనలో ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నానో కూడా చెప్పుకోలేకపోయారు. చివరికి తన పేరు కింద..తనేదో ఓ కమిటీని పెట్టుకుని ఆ కమిటీకి అధ్యక్షుడిగా చెప్పుకుని..జనసేనకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
బొలిశెట్టి సత్యనారాయణ అనే నేత ఎప్పుడూ జనసేన పార్టీ కోసం యాక్టివ్ గా పని చేసిన సందర్భమే లేదు. కానీ ఆయన ఆ పేరు చెప్పుకుని మీడియా చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. ఆ చర్చలను చూసేవారికి ఆయన జేసన తరపున మాట్లాడుతున్నారో.. వైసీపీ తరపున మాట్లాడుతున్నారో అర్థం కాదు. అంత సులువుగా ఆయన వైసీపీని సమర్థిస్తారు. జనసేన విధానాలను వ్యతిరేకిస్తారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవి ఏమైనా వస్తుందని ఆశపడ్డారేమో కానీ.. ఆయన తీరును బాగా గుర్తించిన పవన్ కల్యాణ్.. ఎలాంటి అవకాశం కల్పించలేదు. దాంతో ఇటీవల ఆయన కూటమిలో .. జనసేనకు అన్యాయం అంటూ కొత్త కథలు ప్రారంభించారు. ఆయనకు పార్టీ నేత అనే ముద్ర ఉండకూడదన్న ఉద్దేశంతో.. దయచేయమని సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
ప్రభుత్వంపై ఏదో కేసు వేశానని ఆ కేసు విషయంలో తాను పిటిషనర్ గా ఉన్నాను కాబట్ిట అధికార పార్టీలో ఉంటే.. అక్కడో కాన్ ఫ్లిక్ట్ వస్తుందని అందుకే తాత్కాలికంగా దూరంగా ఉంటానని కారణంగా చెప్పారు. ఆయన కేసులు వేయని సందర్భమే లేదు. చివరికి అమరావతి మీద కూడా కేసులేశారు. జనసేన పార్టీకి నష్టం చేసే అలాంటి వారి వల్ల ప్రయోజనమే ఉండదని.. ఆయన విడుదల చేసిన లేఖపై స్పందించాల్సిన అవసరం కూడా లేదని జనసేన వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
