ఈవారం సినిమాల హడావుడి ఏం లేదు. కానీ వచ్చే వారం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ అవుతోంది. దాంతో పాటుగా హిందీ సినిమా ‘దురంధర్ 2’ రిలీజ్ అవుతోంది. హిందీ సినిమా రిలీజ్ అవుతోంటే.. పెద్దగా ఆలోచించాల్సివచ్చేది కాదు. కానీ ఇది ‘దురంధర్ పార్ట్ 1’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఓటీటీలో చూశాక, ఈ సినిమాపై మరింత ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకే పార్ట్ 2పై ఫోకస్ పడింది. దాంతో ఈ రెండు సినిమాలకు మధ్య పోటీ ఉంటుందా, ఉండదా అనే డిబేట్ కూడా నడుస్తోంది. ‘దురంధర్ 2’కి భయపడే టాక్సిక్ సినిమా వాయిదా పడిందన్న అనుమానాలూ ఉన్నాయి. అందుకే ‘ఉస్తాద్’ దూకుడు ఈ సినిమాతో తగ్గే ప్రమాదం ఉంది అని విశ్లేషిస్తున్నారు సినీ పండితులు.
మరోవైపు ఓ హిందీ సినిమా, అందులోనూ డబ్బింగ్ సినిమా.. తెలుగు సినిమాకు పోటీనా? అనేవాళ్లు ఉన్నారు. కానీ.. ‘దురంధర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే కచ్చితంగా ‘ఇది పోటీనే’ అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో. హైదరాబాద్ లో ఎన్నిథియేటర్లు ఓపెన్ చేస్తే.. అన్ని థియేటర్లలోనూ ఫాస్ట్ ఫిల్లింగ్స్ కనిపిస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే తీరు. 19న సినిమా విడుదల అవుతోంది. 18న సాయింత్రం ఆటలతో ప్రీమియర్స్ మొదలవుతాయి. ప్రీమియర్స్కి మంచి టాక్ వస్తే.. 19 నుంచి `దురంధర్` జోరు మరింత అందుకొంటుంది. ‘ఉస్తాద్’ కూడా 18న ప్రీమియర్లతో పలకరించడానికి రెడీ. కానీ టైమ్ ఫిక్స్ కాలేదు.
మరీ ముఖ్యంగా ఉస్తాద్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు తీసుకోవాల్సివుంది. అది తేలితే తప్ప.. బుకింగ్స్ ఓపెన్ చేసుకొనే ఛాన్స్ లేదు. ఈలోగా.. ‘దురంధర్ 2’ దూకుడు కొనసాగుతుంది. పైగా ‘ఉస్తాద్’ తో పోలిస్తే, దురంధర్ 2కి టికెట్లు రేట్లు తక్కువగా ఉండొచ్చు. ఈ ప్రభావం కూడా గట్టిగా పడే ఛాన్స్ వుంది. బీ,సీ సెంటర్లలో ‘ఉస్తాద్’కు పోటీ లేకపోవొచ్చు. కానీ మల్టీప్లెక్సులు, నగర ప్రేక్షకుల దగ్గరే పోటీ. ఈ విషయంలో `ఉస్తాద్` ఎంత ధీటుగా సమాధానం చెబుతుందో?
