బుట్టెంగారి మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ మాధవరెడ్డి ఎవరంటే..బీసీ రిజర్వేషన్లు రాకుండా కోర్టుకెళ్లిన వ్యక్తి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను అడ్డుకునేందుకు గతంలో కోర్టుల్లో పిటిషన్లు వేసిన చరిత్ర బుట్టెంగారి మాధవరెడ్డికి ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మాధవరెడ్డి జగిత్యాల మున్సిపాలిటీలో ఓ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
అణగారిన వర్గాల నోటికాడ ముద్దను లాగేసిన వ్యక్తికి, బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చిందని ఆయా వర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన టికెట్ కాదని, రాష్ట్రంలోని మెజారిటీ జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వారు మండిపడుతున్నారు. మాధవరెడ్డికి మద్దతు ఇవ్వడం అంటే, రిజర్వేషన్ల వ్యతిరేక విధానాలను సమర్థించడమేనని, దీనిని ఏమాత్రం సహించేది లేదని జేఏసీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
ఈ పరిణామాలకు నిరసనగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యాయి. తమ సామాజిక వర్గాల శక్తిని తక్కువగా అంచనా వేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి రాజకీయంగా ఘోరీ కడతాం అని వారు శపథం చేస్తున్నారు. ఓటు హక్కు ద్వారా తమ సత్తా చాటి, అణగారిన వర్గాల వ్యతిరేకులకు టికెట్లు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
నిజానికి ఈ మాధవరెడ్డి.. కాంగ్రెస్ నేత అని.. రేవంత్ కు సన్నిహితుడని.. రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్లు వేసినప్పుడు బీఆర్ఎస్ ఆరోపిచారు. ఇప్పుడు తమ పార్టీ టిక్కెట్ కేటాయించడం బీఆర్ఎస్ నేతలకే చెల్లిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
