కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ విచారణను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బీఆర్ఎస్ పక్కా ప్రణాళిక రెడీ చేసుకుంది. భారీ బలప్రదర్శనకు రంగం సిద్ధం చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కార్యకర్తల్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇప్పటికే పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో అందరూ రావాలని సమాచారం పంపారు. పార్టీ నేతలకు వ్యక్తిగతంగా టార్గెట్లు పెట్టారు.
కాళేశ్వరం కేసు పూర్తిగా రాజకీయ పరమైనదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆ దిశగానే ఎదుర్కోవాలని నిర్ణయించింది. తెలంగాణ సాధించిన .. తెలంగాణ ఇరిగేషన్ రంగంలో చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను వేధిస్తున్నారని.. కక్ష సాధింపులతో వ్యవహరిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఓ మాజీ ముఖ్యమంత్రిని విచారణ కమిషన్ ముందు హాజరయ్యేలా చేయడమే అవమానకరమని.. ఇలా చేయడం ద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసినట్లేనని చెప్పడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
కేసీఆర్ పెద్దగా జనం లేకుండా విచారణ కమిషన్ కు హాజరైతే.. ఆయనను అందరూ మర్చిపోయారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసే అవకాశం ఉంది. అందుకే .. కేసీఆర్ కు భారీ మద్దతు ఉందని చూపించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. అనుకున్న విధంగా జనం లేకపోతే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. అలాంటివాటిని ఇప్పుడు బీఆర్ఎస్ తట్టుకునే పరిస్థితుల్లో లేదు. కుటుంబంలో ఏర్పడిన స్పర్థలు ఇతర కారణాలతో.. పార్టీ భవిష్యత్ పై చర్చ జరుగుతున్న సమయంలో.. బలప్రదర్శన చాలా కీలకమని నమ్ముతున్నారు.
అవసరం లేని రాజకీయాలతో.. కేవలం కుట్ర పూరితంగా కక్ష పూరితంగానే కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు .. కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావడాన్ని ఉపయోగించుకోనున్నారు. ఇది కక్ష సాధింపు అని ప్రజలకు నమ్మకం కలిగిస్తే అది బీఆర్ఎస్ కు మేలు జరుగుతుంది. ఒక వేళ తప్పేముందని ప్రజలు అనుకుంటే.. ఓవరాక్షన్ చేసినట్లవుతుంది.